చంద్రబాబు ప్రభుత్వం జీపీఎస్ తీసుకురావడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు వ్యతిరేకిస్తున్నా జగన్ సర్కార్ గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు. దీంతో ఉద్యమానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఆ పోస్టుల్లోని సారాంశం ఏంటంటే…
కూటమి నేతలు చెప్పినట్టు సీపీఎస్ రద్దు చేయకుండా, మళ్లీ జీపీఎస్ తీసుకురావడాన్ని నిరసిస్తూ ఉద్యమానికి రెడీ కావాలి. లేదంటే జీపీఎస్‌ను బలవంతంగా రుద్దేందుకు ఈ ప్రభుత్వం తహతహలాడుతోంది. ఉద్యోగ-ఉపాధ్యాయుల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా పరిణమించిన CPSను రద్దుచేసి, OPSను అమలు చేయాలని దశాబ్ద కాలంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు నెత్తీనోరు కొట్టుకుంటున్నాయి. ఉద్యమాలు నిర్వహించాయి. అయినప్పటికీ ప్రభుత్వాలు-పాలకులు మాత్రం వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. CPS రద్దుపై దృష్టి పెట్టే నాథుడే కరువయ్యాడు.
జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ CPS రద్దు హామీ పరిశీలించకుండా, చర్చించకుండానే బుట్ట దాఖలు చేశారు. ఆశలు వమ్ము అయ్యాయి. మళ్లీ ఉద్యమ బాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. అనుకున్నదొకటి, అయ్యిందొకటి. ఉద్యోగులు అనుకున్నది నూతన పాలకులు తలవలేదు.
ఈ GPS గెజిట్ కొత్త సీసాలో పాత సారా లెక్క లాంటిదే! ఆలస్యం, అలసత్వం ఇక పనికిరాదు. దశాబ్దాలుగా మోస పోవడం ఉద్యోగుల వంతు అవుతోంది. ఇకనైనా ఈ CPS & GPS విధానాలను మూకుమ్మడిగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించి బలమైన ఉద్యమాలను నిర్మించాలి!
చడీ చప్పుడు లేకుండా జారీచేసిన సీపీఎస్ ఉద్యోగుల గొంతు కోసే తడిగుడ్డ లాంటి జీపిఎస్ గెజిట్‌ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి! ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ఉప ముఖ్యమంత్రి పవన్ సమక్షంలో చర్చించాలి.