గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకప్పుడు అధినేత కేసీఆర్ కు భయపడేవారు. భక్తిగా ఉండేవారు. నిరంతరం పొగుడుతూ ఉండేవారు. భజన చేసేవారు. కానీ అధికారం పోయాక, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక, పార్లమెంటు ఎన్నికల్లో జీరో అయిపోయాక డోంట్ కేర్ అంటున్నారు. అనర్హత వేటు పడుతుందని బెదిరించినా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోతున్నారు.
పార్టీ మారినందుకు వారికి తాయిలాలు ముడుతున్నాయో లేదో కరెక్టుగా చెప్పలేంగానీ పైకి నియోగకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాల్సి వచ్చిందని అంటున్నారు. గతంలో కేసీఆర్ హయాంలో కాంగ్రెస్ అండ్ టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన పని, చెప్పిన కారణం కూడా ఇదే కదా. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు దాదాపుగా పడదు. ఒకవేళ పడితే అప్పుడు చూసుకోవచ్చు అనుకుంటున్నారు.
ఇప్పటి వరకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. ఇంకో 18 మంది చేరితే బీఆర్ఎస్ ఎల్ఫీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందని అంటున్నారు. మొన్నటివరకు గులాబీ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో చేరినవారు ఇప్పుడు తాము పడ్డ బాధలు చెబుతున్నారు. గులాబీ పార్టీలో తమను పురుగుల్లా చూశారని, కేసీఆర్ కనీసం అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని అంటున్నారు.
అక్కడ ఉన్నప్పుడు భజనలు చేశారు. ఇక లోక్ సభలో కేసీఆర్ పార్టీకి సభ్యులు ఎవరూ లేరు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి శూన్య హస్తమే మిగిలింది. అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజ్యసభలో గులాబీ పార్టీకి ఏడుగురు సభ్యులు ఉండేవారు. వారిలో ఇద్దరి పదవీ కాలం ముగిసింది. ఆ సీట్లు కాంగ్రెస్ పరమయ్యాయి.
కేసీఆర్ కు కుడి భుజంగా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీలో చేరిన కేశవరావు రిజైన్ చేశాడు. మిగిన నలుగురూ బీజేపీలోకి వెళ్ళిపోతారని వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీకీ రాజ్యసభలో ఎంపీల అవసరం ఉంది. అదే జరిగితే పార్లమెంటు ఉభయసభల్లో కారు పార్టీకి చిరునామా ఉండదు. ప్రతి రాజకీయ పార్టీకి ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి దశ వస్తూనే ఉంటుంది. కాకపొతే తెలంగాణ తెచ్చానని చెప్పుకున్న కేసీఆర్ కు ఇలాంటి దశ రావడం విచారకరం.