గత పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థలు ఎంత గొప్పగా పని చేస్తున్నాయో అందరికీ తెలుసు. వ్యవస్థల పనితనం రోజురోజుకూ ప్రజలు సంతోషంతో ఆర్తనాధాలు చేసేలా మెరుగుపడుతోంది. అదేంటి ఆనందంతో కూడా ఆర్తనాధాలు చేస్తారా? అంటే.. ఏపీలో ఆ రకమైన వాతావరణం వుంది మరి!
ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లాలో ఎమ్మెల్యే దంపతులు గొప్ప పనులు చేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ నెల రోజుల పాలనలో ఆళ్లగడ్డను భయంతో బతికేలా అభివృద్ధి చేయడంపై ఆ నియోజకవర్గ ప్రజలు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. గతంలో జగన్ పాలనలో ఎప్పుడూ ఇలాంటి పరిణామాలు లేవని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భయంతో ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడిందని, నెలరోజుల్లో సాధించిన ప్రగతిగా చెప్పుకుంటున్నారు.
కేవలం నెలరోజుల వ్యవధిలో మూడు విడతల్లో ముగ్గురిని కిడ్నాప్ చేసి, ఏకంగా మహిళా ఎమ్మెల్యే ఇంటికే తీసుకెళ్లి చితక్కొట్టి, చచ్చాడని రోడ్డుపై పడేశారని నంద్యాల జిల్లాలోని ఆ నియోజకవర్గంలో ప్రజలు కథలుకథలుగా చెప్పుకుంటున్నారు. కిడ్నాప్‌కు గురైన వారిలో టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి కేబుల్ నెట్‌వర్క్‌లో పని చేసే ఉద్యోగి కూడా వుండడం ఆనందించదగ్గ విషయమని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
పోలీస్ వ్యవస్థ ఎంతో గొప్పగా పని చేస్తున్నందుకు నిర్విరామంగా సాగుతున్న కిడ్నాప్‌లు, చితక్కొట్టడాలే నిదర్శనంగా చెబుతున్నారు. నంద్యాల జిల్లాలోని ఆ నియోజకవర్గంలో మూడు కిడ్నాప్‌లు, ఆరు భూదందాలు అన్నట్టుగా సాగుతుండడం ….నెల రోజుల పాలనలో ప్రోగ్రెస్ రిపోర్ట్‌గా టీడీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఆ నియోజకవర్గంలో ఒక మహిళ హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో ఆ నియోజక వర్గంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే ఏకైక లక్ష్యంగా పరిపాలన సాగుతోందన్న అభిప్రాయాన్ని కలిగించడంలో ఎమ్మెల్యే దంపతులు సక్సెస్ అయ్యారని సర్వత్రా మాట్లాడుకుంటున్నారు.
నెల రోజుల వ్యవధిలోనే ఆదర్శవంతమైన కిడ్నాప్‌లు, భూదందాలకు ప్రధాన కారకుడిగా ఎమ్మెల్యే భర్త పేరు ప్రముఖంగా వినిపించడం విశేషం.