జగన్మోహన్ రెడ్డి ఓటమి పరాభవం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేరుగా పులివెందులకు వెళ్లి అక్కడ ప్రజలతో మమేకమై, రెండున్నర రోజులపాటు గడిపిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడానికి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం వద్ద ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకుంటున్నారు.
ప్రజలను పార్టీ నాయకులను అనునిత్యం కలిసేలాగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు. ప్రజలను కలిసి, వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరించే కార్యక్రమానికి ‘జగన్ ప్రజా దర్బార్’ అని పేరు పెట్టినట్లుగా వార్తలు వస్తున్నా యి. ఈ పేరు మీద పార్టీ వర్గాలలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఈ పేరును సూచించిన, సలహా ఇచ్చిన వ్యక్తి ఎవర్రా బాబు అంటూ పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
దర్బార్ అనే మాటలోనే రాజరికపు అహంకారం ఇమిడి ఉంటుందనేది పలువురి భావనగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ప్రజల నుంచి విజ్ఞప్తిలు స్వీకరించి వాటికి అనుగుణంగా ప్రభుత్వ విధానాల మీద పోరాటాలకు రూపకల్పన చేసుకోవడానికి ప్రయత్నించడం సంతోషమే. కానీ ఆ కార్యక్రమానికి ప్రజాదర్బార్ అని పేరు పెట్టడమే చిత్రంగా, అతిశయంగా ధ్వనిస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
నిజం చెప్పాలంటే దర్బార్ అనే మాట అధికార అహంకారానికి ప్రతీకగా ప్రజలందరూ గుర్తించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల పాత్ర ఎంతో ఉంది. గతంలో కేసీఆర్ తో సత్సంబంధాలు లేని రోజులలో మాజీ మంత్రి రోజా విచ్చలవిడిగా ఆయన మీద విమర్శలు చేసేవారు. ‘‘పగలు దర్బారు.. రాత్రి బారు’’ కేసీఆర్ వ్యవహార శరళి అంటూ ఆమె కొన్ని వందలసార్లు విమర్శించారు. కేవలం రోజా మాటల వల్లనే కాకపోయినప్పటికీ ‘దర్బార్’ అనే పదమే ఒక అహంకార ప్రతీకగా ప్రజల్లో ముద్ర పడిపోయింది.
ఇప్పుడు అధికారంలో లేని జగన్- ప్రజలతో మమేకమయ్యే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోవాలి. ప్రజలలో తన ఆదరణను పునర్నిర్మించుకునే ప్రయత్నంగా ఆయన చేసే ప్రతి చర్య ఉండాలి. అలాంటి సరైన పదాన్ని సూచించకుండా ‘ప్రజా దర్బార్’ అనే పేరుతో వినతుల స్వీకరించాలని సలహా ఇచ్చిన వారి పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంత శ్రేణులు మండిపడుతున్నాయి.
ఇలాంటి సలహాలతోనే కదా జగన్మోహన్ రెడ్డిని అందరూ కలిసి ముంచేశారు అని ఆగ్రహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎటు అధికారిక ప్రకటన రాలేదు కనుక ఇప్పటికైనా ప్రజా దర్బార్ అని పేరు మార్చి- సరైన, వినయ పూర్వకమైన నామకరణం చేయాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.