ప‌వ‌న్‌కు చంద్ర‌బాబు షాక్‌!

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు గ‌ట్టి షాక్ ఇచ్చారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కాంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీమ్ (సీపీఎస్‌) ర‌ద్దు చేస్తామ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. అలాగే 2019లో…

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు గ‌ట్టి షాక్ ఇచ్చారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కాంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీమ్ (సీపీఎస్‌) ర‌ద్దు చేస్తామ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. అలాగే 2019లో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీపీఎస్‌ని అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వారంలోపు ర‌ద్దు చేస్తామ‌ని హామీ ఇచ్చార‌ని, ఆ త‌ర్వాత మోస‌గించార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

సీపీఎస్‌కి బ‌దులు జ‌గ‌న్ స‌ర్కార్ జీపీఎస్ తీసుకొచ్చింది. ఉద్యోగులు వ్య‌తిరేకిస్తున్న జ‌గ‌న్ స‌ర్కార్ మాత్రం జీపీఎస్‌పై ముందుకెళ్లింది. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన నేప‌థ్యంలో జీపీఎస్ ర‌ద్దు అవుతుంద‌ని, పాత పెన్ష‌న్ విధానం అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని ఉద్యోగులు ఆశించారు. మ‌రీ ముఖ్యంగా సీపీఎస్ విష‌య‌మై హామీ ఇచ్చిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌…. ఉప ముఖ్య‌మంత్రి స్థానంలో ఉండ‌డంతో ఉద్యోగులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు.

ఉద్యోగులు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు చంద్ర‌బాబు స‌ర్కార్ షాక్ ఇస్తూ, జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకొచ్చిన జీపీఎస్ అమ‌లుపై పాత జీవోనే తీసుకురావ‌డం గ‌మ‌నార్హం.  2023 అక్టోబరు 24న జీపీఎస్ అమ‌లుకు సంబంధించి విధివిధానాలు తీసుకొచ్చింది. అయితే ఇది తప్పనిసరి కాదని.. సీపీఎస్‌లోనే ఉండిపోవచ్చని జ‌గ‌న్ స‌ర్కార్‌ ఆప్షన్‌ ఇచ్చింది. జ‌గ‌న్ స‌ర్కార్‌పై ఉద్యోగుల వ్య‌తిరేక‌త‌కు ఇలా అన్ని అంశాలు కార‌ణ‌మ‌య్యాయి.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.  జూన్ 12న బాబు టీమ్ ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజే.. జీపీఎస్‌ విధానం 2023 అక్టోబరు 20 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది. జూలై 12న అదే జీవో గెజిట్‌లో ప్రచురితమైంది. దీంతో మోస‌పోయిన‌ట్టు ఉద్యోగులు మండిప‌డుతున్నారు.

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఈ ప్ర‌భుత్వంలో ఏపాటి విలువ ఉన్న‌దో అర్థ‌మ‌వుతోంద‌ని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా గ‌తంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ సీపీఎస్ ర‌ద్దుపై చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వైర‌ల్ అవుతున్నాయి.

“కాంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీమ్ (సీపీఎస్‌) ర‌ద్దు చేస్తామ‌ని అధికారంలోకి వ‌చ్చిన పెద్ద మ‌నుషులు …పాపం మా ముఖ్య‌మంత్రి చిన్న పిల్లోడు, ఏమీ తెలియ‌ద‌ని, ఆ రోజు తెలుసుకోకుండా మాట్లాడేశార‌ని స‌క‌ల‌శాఖ మంత్రి చెప్పాడు. డ‌బ్బులు దొబ్బేయ‌డానికి మీరు చిన్న పిల్లోళ్లు కాదే, సిమెంట్ ఫ్యాక్ట‌రీలు పెట్ట‌డానికి మీరు చిన్న పిల్లోళ్లు కాదే. బెదిరించ‌డానికి మీరు చిన్న పిల్లోళ్లు కాదే”

“సీపీఎస్ ర‌ద్దుపై ప్ర‌తి ఒక్క‌రూ ఉద్యోగి ఆలోచించాలి. మేము అధికారంలోకి వ‌స్తే పెద్ద‌లంద‌రితో చ‌ర్చించి సీపీఎస్ ర‌ద్దు చేస్తాం. వీళ్ల లాగా మేము మోసం చేయం. సీపీఎస్ తెచ్చే వ‌ర‌కూ మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించింది కాదు. ఈ విష‌యం తెలుసుకునే మాట్లాడుతున్నాను. నేను ఒక ప్ర‌భుత్వ ఉద్యోగి కొడుకుని. అందుకే కృత‌జ్ఞ‌త‌తో చెబుతున్నా… సీపీఎస్ ర‌ద్దు చేయ‌డానికి నా వంతు కృషిని సంపూర్ణంగా చేస్తాను”

ల్యాండ్ టైటిలింగ్ చ‌ట్టాన్ని ర‌ద్దు చేసిన కూట‌మి ప్ర‌భుత్వం…. జీపీఎస్ విష‌యంలో మాత్రం ఏమీ తెలియ‌ద‌ని అంటే న‌మ్మ‌డం ఎలా? జీపీఎస్ జీవో తాజాగా జారీ చేయ‌డానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వ అనుకూల ఉన్న‌తాధికారులే కార‌ణం అంటూ టీడీపీ అనుకూల మీడియా క‌థ‌నాలు రాసింది.

చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌చ్చిన త‌ర్వాత కూడా, అమాయ‌కంగా జీపీఎస్ అమ‌లుపై ఆర్థిక‌శాఖ జీవో జారీ చేసిందంటే ఎలా న‌మ్మ‌డం? ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీపీఎస్ ర‌ద్దుపై విప‌రీతంగా ప్ర‌చారం చేశార‌ని తెలిసి కూడా జీవో జారీ అయ్యిందంటే, అస‌లు ఈ ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన ఆదేశాల‌పై నిఘా కొర‌వ‌డింద‌ని అర్థ‌మ‌వుతోంది. జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకొచ్చిన జీపీఎస్‌నే కొన‌సాగించ‌డ‌మే చంద్ర‌బాబు స‌ర్కార్ ఉద్దేశంగా క‌నిపిస్తోంది. ఇప్పుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్పంద‌న‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కుంది.