చంద్రబాబు సర్కార్ కొలువుదీరి నెల దాటింది. ఈ దఫా ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో చంద్రబాబునాయుడు నోటికొచ్చిన హామీ ఇచ్చారు. అసాధారణ మెజార్టీతో కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఇచ్చిన హామీలు కూటమికి అపరిమితమైన అధికారం దక్కడానికి కారణం. ఇదే సందర్భంలో జగన్ సర్కార్ చేసిన కొన్ని తప్పులు కూడా కూటమికి కలిసొచ్చాయి.
ఇల్లు అలకగానే పండుగ కాదని, హామీల్ని నెరవేర్చడం అతి పెద్ద చాలెంజ్ అని పవన్‌కల్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ హామీల్ని అమలు చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. ఉచిత ఇసుక విషయంలో చంద్రబాబు సర్కార్ ఫెయిల్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. తాజాగా తల్లికి వందనం పథకంపై రచ్చ మొదలైంది. లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. చంద్రబాబునాయుడు ఇంట్లో ఎంత మంది విద్యార్థులు చదువుకుంటుంటే అంతమందికి ఇస్తామని చెబితేనే ఓట్లు వేశామని తల్లులు అంటున్నారు.
ప్రతి తల్లికీ రెండు వేలు పెంచి రూ.17 వేలు ఇస్తామని చెప్పిన జగన్‌ను కాదని కూటమి వైపు మెజార్టీ తల్లులు నిలబడ్డారు. ఇప్పుడేమో ప్రతి తల్లికీ రూ.15 వేలు మాత్రమే చంద్రబాబు సర్కార్ ఇస్తామని చెబుతోందని లబోదిబోమంటున్నారు. చంద్రబాబు సర్కార్‌పై వ్యతిరేకత మొదలైందనే చర్చకు తెరలేచింది.
అయితే చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకతను రాజకీయంగా సొమ్ము చేసుకునే తెలివితేటలు వైసీపీకి ఉన్నాయా? అనేదిప్పుడు ప్రధాన ప్రశ్న. వైసీపీలో రాజకీయంగా ఒక పద్ధతి, ప్రణాళిక అసలు కనిపించవు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు తమకు తాముగా గొంతు చించుకోవాలే తప్ప, ప్రతిపక్ష పార్టీగా వైసీపీ అందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చే సీన్ లేదు. ఎందుకంటే వైసీపీ అధినేత జగన్ అందర్నీ కలుపుకుని వెళ్లేలా ఎప్పుడూ వ్యవహరించిన దాఖలాలు లేవు.
ఒక్కడిగానే వెళ్లడం ఆయన స్వభావం. భవిష్యత్‌లో కూడా జగన్ రాజకీయ పంథా మారుతుందని అనుకోలేం. అందుకే రానున్న రోజుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను ఏ మేరకు వైసీపీ క్యాష్ చేసుకుంటుందనే చర్చ జరుగుతోంది. కనీసం ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని వెళ్లాలి. అప్పుడే వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం కలుగుతుంది.
వైసీపీ స్వభావరీత్యా ఎవరితోనూ కలిసే గుణం లేదు. విచిత్రం ఏమంటే, వైసీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అందరికీ శత్రువే. ఈ ధోరణే కూటమికి కలిసొచ్చే అవకాశం వుంది. ఇప్పటికైనా వైసీపీ రాజకీయ నడతలో మార్పు రావాలి. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అని మొండిగా వాదిస్తే ప్రయోజనం వుండదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా పట్టువిడుపులతో వెళ్లాలి. వైసీపీ భవిష్యత్ ఆ పార్టీ అధినేత జగన్ వ్యవహరించే తీరుపై ఆధారపడి వుంది. ఆయన మారితే ఓకే, లేదంటే ఆయన్ను ఆ స్థానం నుంచి కూడా మార్చుకోడానికి జగన్ సిద్ధం.