చంద్రబాబు అంటే మాటలకు చేతలకు సంబంధం లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తామని ఈ రోజున చెబుతున్న చంద్రబాబు గతంలో 14 ఏళ్ళ పాటు సీఎంగా ఉండగా ఏ ఒక్క కార్యక్రమం అయినా చేశారా అని గుడివాడ ప్రశ్నించారు.
ఉత్తరాంధ్రలో మూలపేట పోర్టు కానీచ భోగాపురం ఎయిర్ పోర్టు కానీచ జిల్లాలో మెడికల్ కాలేజీ కానీ వైసీపీ హయాంలోనే వచ్చాయన్న సంగతి బాబు మరచిపోతే ఎలా అన్నారు. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను తనవిగా చెప్పుకోవడమేంటి అని ఫైర్ అయ్యారు.
భోగాపురం ఎయిర్ పోర్టుకు టెంకాయ కొట్టడం తప్ప బాబు చేసింది ఏంటి అని ప్రశ్నించారు. తాము అన్ని అనుమతులూ సాధించిన మీదట ఎయిర్ పోర్టు పనులను స్టార్ట్ చేశామని మాజీ మంత్రి చెప్పారు. ఏమీ చేయకుండా అన్నీ నేనే చేశాను అని చెప్పుకుని ప్రచారం చేసుకునే దాంట్లో బాబుని మించిన వారు ఎవరూ లేరని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు అధికారంలోకి రావాలని ఇచ్చిన అనేక హామీలను ఇపుడు అమలు చేసి చూపించాలని డిమాండ్ చేశారు తల్లికి వందనం పేరుతో ఒక్కరికే సాయం ఇవ్వాలని ఆలోచించడం కూడా తగదని అన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో జగన్ ని విమర్శించడం తప్ప బాబు ఏమి చేస్తారో ఎందుకు చెప్పడంలేదు అని గుడివాడ నిలదీశారు. బాబు మాటలకు చేతలకు పొంతన ఉండదన్నది తెలిసిందే అన్నారు.