చంద్రబాబు మంత్రి వర్గం ఏర్పాటు చేసి ఒక్క సీటు ఖాళీ అలా ఉంచేశారు. దాంతో ఆ ఒక్క ఖాళీ కోసం ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు. ఉత్తరాంధ్రలో చూస్తే శ్రీకాకుళం జిల్లాలో ఒక కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి పదవి దక్కాయి. విజయనగరంలో రెండు రాష్ట్ర మంత్రి పదవులు లభించాయి.
విశాఖ రూరల్ జిల్లాకు మాత్రం ఒకే ఒక్క మంత్రి పదవితో సరిపుచ్చారు అన్న ఆవేదన ఉంది. విశాఖ సిటీ నుంచి మంత్రి ఎవరూ లేరు అన్నది కూడా ఉంది. స్పీకర్ పదవిని ఇచ్చినా అది రూరల్ జిల్లాకు ఇచ్చారని విశాఖ సిటీకి ప్రాతినిధ్యం ఇవ్వాలన్న డిమాండ్ ఉంది.
విశాఖ రానున్న రోజులలో మరింతగా అభివృద్ధి చెందుతుందని అలాంటి జిల్లాలో మంత్రి పదవి ఉంటేనే కో ఆర్డినేషన్ బాగుంటుందని అంటున్నారు. ఓసీ కాపులకు ఈసారి ఉత్తరాంధ్రలో మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం దక్కలేదు. దాంతో ఆ కోటాలో భీమిలీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వర్గీయులు ఆశలు పెంచుకుంటున్నారు.
కూటమి నుంచి గెలిచిన మరో ఇద్దరు తమకు లక్కు చిక్కుతుందా అని చూస్తున్నారు. పెందుర్తి నుంచి గెలిచిన జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు మంత్రి యోగం ఉందని ఆయన అనుచరులు అంటున్నారు. సౌత్ నుంచి గెలిచిన జనసేన ఎమ్మెల్యే వంశీ క్రిష్ణ శ్రీనివాస్ కూడా బలమైన యాదవ సామాజిక వర్గం నుంచి తనకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నారు.
ఒక్క ఖాళీ మీద విశాఖ జిల్లాలో పోటీ ఉంటే శ్రీకాకుళం నుంచి ఎస్సీ కోటాలో రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహనరావు చూస్తున్నారు అని అంటున్నారు. విజయనగరం నుంచి మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు ఆశలు కూడా అలాగే ఉన్నాయని చెబుతున్నారు. ఈసారి ఉత్తరాంధ్ర కూటమిని భారీ విజయం అందించిందని ఇది మరచిపోలేను అని ఉత్తరాంధ్రకే తన ప్రాధాన్యత అని చంద్రబాబు తాజా పర్యటనలో చెప్పడంతో ఆశావహుల్లో సరికొత్త ఆశలు మొలుస్తున్నాయని అంటున్నారు.