థియేటర్లకు జనాలు రావడం లేదు. రండి బాబూ రండి అని ఓ పక్క నినాదాలు ఇస్తున్నారు. మీటింగ్ లు పెడుతున్నారు. ప్రభుత్వాలను కలిసి మాట్లాడుతున్నారు. ఇదంతా ఒక వైపు. మరో వైపు మాత్రం టికెట్ రేట్లు సామాన్యులకు అందుబాటులో లేకుండా పెంచేస్తున్నారు. పెంచాల్సిన అవసరం వున్న సినిమాలు వున్నాయి. అవసరం లేని సినిమాలు వున్నాయి. కానీ ఇలా అవసరం వున్నా, లేకున్నా పెంచడం వల్ల కేవలం థియేటర్లకు మాత్రనే నష్టం కాదు. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు కూడా.
కల్కి లాంటి సినిమాలకు టికెట్ రేట్లు అవసరం. ఎందుకంటే వందల కోట్లు పెట్టి సినిమా తీసారు. రికవరీ కష్టం అవుతుందేమో అన్న భయం. నైజాం 75 కోట్ల మేరకు అడ్వాన్స్ ఇచ్చిన సినిమా. హక్కులు కొన్న సినిమా కాదు. కానీ రేట్లు పెంచారు. జనం చూసారు. డబ్బులు అన్నీ వెనక్కు వచ్చాయి. హ్యాపీ.
ఇప్పుడు ఈవారం విడుదలయ్యే ఇండియన్ 2 సినిమాకు కూడా రేట్లు పెంచేసారు. వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్ లు 225 రూపాయలు, మల్టీ ఫ్లెక్స్ లు 350 రూపాయలు టికెట్ రేట్లు వసూలు చేయబోతున్నాయి. ఇండియన్ 2 తెలుగు సినిమా కాదు. పైగా కల్కి మాదిరిగా నైజాంలో 75 కోట్ల మేరకు అడ్వాన్స్ ఇచ్చిన సినిమా కాదు. జస్ట్ 20 కోట్లు రికవరీ అడ్వాన్స్ ఇచ్చిన సినిమా. దానికి కూడా ఇంతంత రేట్లు అంటే జనం రావద్దా? కల్కి అంటే ఆ క్రేజ్, బజ్, మోజు అన్నీ వున్నాయి కనుక వచ్చారు. ఇండియన్ 2 మీద అలాంటి క్రేజ్, మోజు, బజ్ వున్నాయా? అంటే అనుమానమే.
ఇదిలా వుంటే కల్కి విడుదలయింది. ఇండియన్ 2 విడుదలవుతుంది. భారీ రేట్లతో ప్రేక్షకులను లాగేస్తారు. మరి ఆ తరువాత వరుసగా చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు వున్నాయి. డార్లింగ్, బడ్డీ ఇలా వరుసగా. వాటికి తక్కువ రేట్లు పెడితే మాత్రం జనాలు ఎలా వస్తారు. అప్పటికే కల్కి, ఇండియన్ 2 లకు జేబులు ఖాళీ అయిపోయి వుంటాయి. ఇక ఈ చిన్న సినిమాలు ఓటిటి లో చూడవచ్చులే అని ఫిక్స్ అయిపోతారు.
అప్పుడు మళ్లీ జనాలు థియేటర్లకు రావడం లేదు అనే సన్నాయి నొక్కలు మొదలవుతాయి. టాలీవుడ్ లో అంతే.. టాలీవుడ్ లో అంతే.