కేజీఎఫ్ కథ మనకు తెలిసిందే. 2 భాగాలు చూశాం. కోలార్ బంగారు గనులు చుట్టూ తిరిగే రాకీ భాయ్ కథ అది. అయితే అది ఫిక్షన్. కానీ ఇప్పుడు అదే బంగారు గనుల నేపథ్యంలో, యదార్థ ఘటనలతో ఓ సినిమా వస్తోంది. ఈసారి చాలా వెనక్కు వెళ్లారు. పేరు తంగలాన్. హీరో విక్రమ్.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో బంగారం వేట మొదలుపెడతారు బ్రిటిషర్లు. స్థానికంగా ఉండే గిరిజన తెగ సహాయం కోరతారు. ఈ క్రమంలో 2 గిరిజన జాతుల మధ్య వైరం మొదలవుతుంది. తన వారిని కాపాడుకునేందుకు ప్రాణాలకు సైతం తెగించే పాత్రలో విక్రమ్ కనిపించాడు.
ఈరోజు రిలీజైన ట్రయిలర్ లో విక్రమ్ పాత్రను, సినిమా నేపథ్యాన్ని పూర్తిస్థాయిలో ఆవిష్కరించారు. విభిన్న పాత్రలు, కొత్తకొత్త గెటప్స్ కు పెట్టింది పేరైన విక్రమ్, తంగలాన్ లో మరోసారి తన నటవిశ్వరూపాన్ని చూపించాడు. మరో కీలక పాత్రలో, డీ-గ్లామర్ రోల్ లో మాళవిక మోహనన్ కనిపిస్తోంది.
కోలార్ గనుల చుట్టూ చరిత్రలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనలకు సినిమాటిక్ టచ్ ఇస్తూ దర్శకుడు పా రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. చాన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను ఎట్టకేలకు, ఆగస్ట్ 15న విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే ఈ తేదీని ట్రయిలర్ లో ప్రకటించలేదు.