ఆంధ్రప్రదేశ్‌లో ఉచితంగా ఇసుక సరఫరా చేయలేదంటారా? ఏం మాటలవి? ఎల్లో గ్లాస్‌లు పెట్టుకుని చూస్తే, రాష్ట్రమంతా ఉచితంగా ఇసుక సరఫరా చేస్తున్నట్టు, ప్రజలంతా ఆనందంతో నృత్యం చేస్తున్నట్టు కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఎల్లో గ్లాస్‌లు కాకుండా, మరేవో పెట్టుకుని చూస్తే, టన్నుకు రూ.1200 నుంచి రూ.1500 వరకు విక్రయిస్తున్నట్టు కనిపిస్తుంది మరి! ఏదైనా చూసే దృష్టిలో వుంటుంది మాస్టారూ!
తమకు అధికారం ఇస్తే ప్రతి ఒక్కరికీ ఉచిత ఇసుక సరఫరా చేస్తామని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. జగన్ ప్రభుత్వం ఇసుక పేరుతో దోపిడీకి పాల్పడుతోందని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ మాటల్ని జనం నమ్మారు. కూటమికి పట్టం కట్టారు. హామీల్ని నెరవేర్చే సమయం రానే వచ్చింది.
సామాజిక సాధికారత పింఛన్లను రూ.4 వేలకు పెంచి శభాష్ అనిపించుకున్నారు. అలాగే మెగా డీఎస్పీ అంటూ జగన్ సర్కార్ విడుదల చేసిన పోస్టులకు అదనంగా 10 వేల టీచర్ పోస్టులను కలిపి ప్రకటన చేశారు. ఇప్పుడు ఉచిత ఇసుక వంతు వచ్చింది. గతంలో వైఎస్సార్ విమర్శించినట్టుగా ఆల్ ఫ్రీ బాబు ఏం చేశారంటే… ఈ నెల 8 నుంచి ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని అట్టహాసంగా ప్రకటించారు. ప్రజలకు మంచి జరిగితే అంతకంటే ఆనందం ఏముంటుంది?
బాబు ఏదైనా ఫ్రీ అన్నారంటే, దానికి ఓ మెలిక వుంటుందనే అనుమానమే నిజమైంది. రకరకాల చార్జీల పేరుతో, చివరికి జగన్ సర్కార్ హయాంలో ఏ రేటు అయితే చెల్లించాల్సి వచ్చిందో, ఇంచుమించు అదే ధరను ఇప్పుడు కూడా ఇసుకకు పెట్టాల్సి వచ్చింది. ఉచిత ఇసుక కదా అని ఉత్త జేబులతో ఊగుతూ వెళ్లిన వారికి టీడీపీ నేతలు, అధికారులు గట్టి షాక్ ఇచ్చారు.
ఉచిత ఇసుక అన్నారు, కానీ డబ్బు తీసుకుంటున్నారేంటి? అని చంద్రబాబు సార్‌ను మీడియా ప్రతినిధులు అడగ్గా, ఆయనకు కోపం వచ్చింది. ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తుంటే, వింత పశువులు, బుద్ధిలేని వైసీపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు చెప్పింది నిజమే కదా? ప్రభుత్వ దృష్టితో చూస్తే, ఇసుక ఉచితంగా ఇస్తున్నట్టే కనిపిస్తుంది.