దేశం మొత్తం మీద భారం వేస్తున్న చంద్రబాబు!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యావత్ భారతదేశం మీద ఆటంబాంబు దాడి లాంటి ప్రతిపాదనను తీసుకొస్తున్నారు. కేంద్రంలో ఇప్పుడు రెండో అతిపెద్ద పార్టీ హోదాలో తనకున్న సత్సంబంధాల కారణంగా చక్రం తిప్పగలిగే స్థితిలో…

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యావత్ భారతదేశం మీద ఆటంబాంబు దాడి లాంటి ప్రతిపాదనను తీసుకొస్తున్నారు. కేంద్రంలో ఇప్పుడు రెండో అతిపెద్ద పార్టీ హోదాలో తనకున్న సత్సంబంధాల కారణంగా చక్రం తిప్పగలిగే స్థితిలో ఉన్న చంద్రబాబు దేశం మొత్తాన్ని తన ప్రతిపాదనతో భయపెడుతున్నారు.

మన దేశంలో అవినీతి డబ్బుతో వ్యవస్థలను కొనుగోలు చేయాలని చూస్తున్న వారి ఆట కట్టించడానికి 500, 200 రూపాయల నోట్లను కూడా రద్దు చేయాలని చంద్రబాబు అంటున్నారు. ప్రాక్టికల్ గా సాధ్యాసాధ్యాల సంగతి పెద్ద విషయం కాదు గానీ.. అలాంటి నిర్ణయం జరిగితే.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చంద్రబాబునాయుడు ఆలోచించడం లేదు.

నరేంద్రమోడీ ఉన్నపళంగా 2016లో ఒక రాత్రిపూట పెద్దనోట్ల రద్దును ప్రకటించిన వైనం ఇంకా ప్రజలకు గుర్తుంది. ఆ కారణంగా.. ఎన్ని వందల ప్రాణాలు కడతేరిపోయాయో కూడా అందరికీ తెలుసు. నోట్ల రద్దు తప్పు అనడం కాదు గానీ.. ఆచరణాత్మక పోకడ లేకుండా.. ఉన్నపళంగా ఆ నిర్ణయం తీసుకోవడం దేశాన్ని కుదేలు చేసేసింది. అప్పట్లో సలహాల కోసం మోడీ నియమించిన కమిటీకి చంద్రబాబునాయుడే సారథి.

దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరగాలంటే.. వాటి మీద బ్యాంకులు రుసుము వేయకుండా సిఫారసు చేశానని చంద్రబాబు నాయుడు అప్పట్లో ప్రకటించారు. కానీ ఇప్పటిదాకా ఏం జరుగుతోంది? ప్రతి డిజిటల్ లావాదేవీ మీద కూడా బ్యాంకులు వినియోగదారుల నుంచి రుసుములు వసూలు చేస్తున్నాయి. చంద్రబాబునాయుడు చెప్పిన సిఫారసులకు దిక్కులేదు.

ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు.. తాను నిజాయితీ పరుడిని అని చెప్పుకోడానికి అన్నట్టుగా.. 200, 500 నోట్లు కూడా రద్దు చేసేయాలని అంటున్నారు. 150 కోట్ల మంది జనాభా ఉన్న అతిపెద్ద దేశం మనది. ప్రజలను తమను గద్దె ఎక్కించే ఓటు బ్యాంకు గా తప్ప మరోరకంగా చూడలేని దుర్మార్గపు ప్రభుత్వాలు ఉన్న మన దేశంలో.. కనీసం ఆస్పత్రి, బడి కూడా లేని ప్రాంతాలు, కుగ్రామాలు, అటవీ ప్రాంతాల్లోని గ్రామాలు లక్షల్లో ఉంటాయి. ఈ దేశానికి సమస్తం డిజిటల్ కరెన్సీ ద్వారానే జరగాలని చంద్రబాబు ఎలా సూచించగలరు? అనేది ప్రశ్న.

అయినా 200, 500 నోట్ల రద్దు అనేది.. ఏదో క్రేజీగా ఉండడానికి చంద్రబాబు చెప్పిన మాటే తప్ప.. తన రాజకీయ ప్రత్యర్థుల్ని అవినీతిపరులుగా చిత్రీకరించడానికి చెప్పిన మాటే తప్ప.. దానిని కేంద్రం పట్టించుకునే అవకాశం కూడా లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. నల్లడబ్బు పోగేసే ధనబకాసురులను అరికట్టాలంటే.. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో 500 వంటి పెద్దనోట్లను కొత్తరూపంలో తీసుకురావడం ఒక మార్గం అవుతుంది. అంతే తప్ప.. ఏకంగా 200, 500 నోట్ల డినామినేషన్ పూర్తిగా రద్దు చేయాలని అనడం మంచి సూచన కాదని విశ్లేషకులు అంటున్నారు.