ఈ మధ్యకాలంలో తరచూ ఒక హెడ్డింగ్ వార్తల్లో కనిపిస్తూ ఉంటుంది. ఫలానా సెలబ్రిటీని ఫలానా సెలబ్రిటీ ఇన్ స్టాగ్రమ్ లో అన్ ఫాలో చేశాడు! అనేది ఆ వార్త సారాంశం! విరాట్ ను రోహిత్ అన్ ఫాలో చేశాడు, రోహిత్ ను ఇంకొకరు అన్ ఫాలో చేశారు! ఫలానా హీరోయిన్ ఇన్ స్టాలో ఏకంగా తన భర్తనే అన్ ఫాలో చేసింది! ఇంకో ఇద్దరు మ్యూచువల్ గా అన్ ఫాలో చేసుకున్నారు! ఈ తరహా వార్తలు తరచూ కనిపిస్తూ ఉంటాయి.
ఇవి ట్రెండింగ్ లో ఉంటాయి! మరి ఎవరి ఇద్దరి మధ్యన అయినా ఏ తరహాలో తేడాలొచ్చినా.. అన్ ఫాలో చేసుకోవడం, నంబర్లు డిలీట్ చేసుకోవడం, బ్లాక్ చేసుకోవడం.. ఇవన్నీ సరైన చర్యలేనా? అనేది ఒక ఆసక్తిదాయకమైన చర్చ!
వివాదం ఉన్నంత మాత్రాన సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకోవాలా, ఫోన్ నంబర్ లు డిలీట్ చేసేయాలా అంటే.. అవతలి వారికి తమ అసహనాన్ని చాటడానికి అయితే ఇది తగు చర్య అవుతుంది! సెలబ్రిటీలు ఇలాంటి పనులు చేస్తే అది మీడియాలో వార్త కూడా అవుతుంది. అయితే ఇలాంటి రచ్చలు కేవలం సెలబ్రిటీలకే కాదు సామాన్యులకు కూడా ఉంటాయి.
ఇది సోషల్ మీడియా యుగం. ఇప్పుడు ఎక్స్ ప్రెషన్లు అన్నీ సోషల్ మీడియాలోనే! మన ఫొటోకు ఎవరెవరు లైక్ లు కొట్టారు, మన ఫోటోలకు ఎవరు కామెంట్లు పెడుతున్నారు, ఎవరు మన ఫొటోలను పట్టించుకోవడం లేదు అని మొదలుపెడితే, మన వాట్సాప్ స్టేటస్ లు ఎవరు చూస్తున్నారు, ఎవరు చూసీ చూడనట్టుగా వదిలేస్తున్నారు, పది ఫొటోలు రైలు పెట్టెల్లా పెడితే ఎంతమంది వాటిని మొత్తం చూస్తున్నారు, ఎవరు సగంలో ఆపేస్తున్నారు, ఎవరు ఆన్ లైన్ లోకి వచ్చి కూడా మన స్టేటస్ చూడటం లేదు.. ఇవన్నీ సదరు వ్యక్తుల విషయంలో మన భావోద్వేగాలను నియంత్రించే అంశాలు అయిపోయాయి!
ఆఫ్ లైన్లో స్నేహంగా ఉన్నా, ఆన్ లైన్లో దాన్ని చాటకపోతే.. కోపతాపాలు పెంచుకునే రోజులు ఇవి! ఇలా చూసినప్పుడు స్టేటస్ లు సరిగా చూడటం లేదని అవతలి వారి కాంటాక్ట్ ను డిలీట్ చేసేయడం, మన స్టేటస్ చూడటం లేదు కాబట్టి వారి స్టేటస్ ను మ్యూట్లో పెట్టేయడం, వీలైతే వారి స్టేటస్ లను చూడకుండా నెగ్లెక్ట్ చేయడం.. ఇవన్నీ అందరూ చేస్తున్నవే! 15 సంవత్సరాల కిందటి వరకూ మనుషుల మధ్యన ఇలాంటి గొడవల్లేవు! అయితే ఇప్పుడు ఇదో సామాజిక సమస్య!
ఆఫీసులో మనం ట్రై చేస్తున్న అమ్మాయి మన వాట్సాప్ మెసేజ్ కు సరిగా రిప్లై ఇవ్వకపోతే ఇమ్మీడియట్ గా తన కాంటాక్ట్ ను డిలీట్ చేయడం తమ మగతనానికి నిదర్శంగా భావించే వారూ ఉన్నారు! అబ్బాయిల స్టేటస్ లను చూడకుండా అతడిపై తమకు ఏ ఆసక్తి లేదని చాటాలని భావించే అమ్మాయిలూ ఉన్నారు! ఆఫ్ లైన్లో సాన్నిహిత్యం ఉన్న వారి మధ్యన కూడా ఇప్పుడు సోషల్ సాన్నిహిత్యం లేకపోతే తేడాలు వచ్చేస్తాయి. ఒక ఆఫ్ లైన్లో తేడాలొచ్చాయంటే అవి ఆన్ లైన్లో చూపడం చాలా సహజంగా మారింది!
అయితే ఇవన్నీ చిన్న పిల్లల చేష్టలే! ఎంత పెద్ద వయసు ఉన్న వారు అయినా ఇలాంటి చర్యలకు పాల్పడటం నిజంగా చిన్న పిల్లల చేష్టే! ఒక మనిషిది ఒక నంబరే నేను సేవ్ చేసుకుంటా, రెండో నంబర్ ను సేవ్ చేసుకోను అనేంత చాదస్తం మనుషులు ఉన్నారు ఇండియాలో! రెండో నంబర్ ను సేవ్ చేసుకుంటే అవతలి వాడికి తను చాలా ప్రిఫరెన్స్ ఇచ్చేస్తున్నట్టుగా భావించేంత మూర్ఖపు మంద మధ్యన మన గమనం సాగుతూ ఉంది! ఈ స్టేటస్ లు చూడటం చూడకపోవడం, చూస్తే ఒక ఉద్దేశాన్ని ఆపాదించేసుకోవడం, చూడకపోతే మరో ఉద్దేశాన్ని ఆపాదించుకోవడం ఇవన్నీ కూడా ఆ చాదస్తపు తాలూకు లక్షణాలే!
ధృడమైన మనస్తత్వం ఉన్న వారెవరూ ఈ నంబర్లను డిలీట్ చేయడం, అన్ ఫాలోలు చేసుకోవడం, స్టేటస్ సమరాలు సాగించడం వంటివి చేయరు! ఆ మాత్రం మెచ్యూరిటీ లేని వారి నంబర్లైనా డిలీట్ లు చేసుకోకుండా, వారిని తేలికగా తీసుకుని ముందుకు సాగే వారే నిశ్చితమైన తత్వం కలిగిన వారు!