ముఖ్యమంత్రిగా నాలుగవ సారి ప్రమాణం చేసిన తరువాత చంద్రబాబు తొలిసారి ఉమ్మడి విశాఖ జిల్లాకు రానున్నారు. ఆయన ఈ నెల 11న విశాఖ జిల్లాలో పర్యటిస్తారు. ఆయన విశాఖలోని మెడిటెక్, ఫార్మా ఎస్ఈజెడ్ లను సందర్శించనున్నారు. అలాగే పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర కు వచ్చే నీటి ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులను సమీక్షిస్తారు అని తెలుస్తోంది.
విశాఖలో ఆయన అధికారులతో సమీక్షలు చేపడతారు అని అంటున్నారు. చంద్రబాబు పర్యటనలో రుషికొండ సందర్శన ఉంటుందా అన్నది కూడా చూడాల్సి ఉంది. అయితే ఈ పర్యటనలో కాకపోతే ప్రత్యేకంగా రుషికొండ భవనాలను సందర్శించడం కోసం పూర్తిగా దాని మీదనే ఫోకస్ పెట్టేలా బాబు మరోసారి వస్తారని అంటున్నారు.
సీఎం హోదాలో విశాఖ వస్తున్న బాబు విశాఖ అభివృద్ధి గురించి ఏ రకమైన ప్రకటనలు చేస్తారు అన్నది కూడా చర్చగా ఉంది. అలాగే విశాఖను ఐటీ రాజధాని ఆర్ధిక రాజధాని కల్చరల్ క్యాపిటల్ అంటూ వచ్చిన టీడీపీ పెద్దలు ఇపుడు ఏ రకంగా అభివృద్ధి చేస్తారు దానికి ప్రాతిపదిక ఏమిటి, యాక్షన్ ప్లాన్ ఏమిటి అన్నది చంద్రబాబు తన పర్యటనలో వెల్లడిస్తారా అన్నది కూడా అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో విశాఖకు సంబంధించి కీలక ప్రకటనలే ఉండవచ్చు అని అంటున్నారు. విశాఖ ఎవరు కాదన్నా ఏపీకి గ్రోత్ ఇంజన్ లాంటిది దాంతో విశాఖను అభివృద్ధి చేసేందుకు టీడీపీ ప్రభుత్వం ఏమి చేయనుంది అన్నది కూడా చూడాల్సి ఉంది.