చంద్రబాబుకు డైరక్టుగా చెప్పొచ్చు కదా సర్!

మంచి ఘనమైన వేదిక దొరికినప్పుడు ఎవ్వరికైనా సరే.. నలుగురికీ గుర్తుండిపోయే సందేశం ఇవ్వాలనే అనిపిస్తుంది. ఇలాంటి సందేశాలు, స్ఫూర్తిదాయక వచనాలు, వాట్సప్ లో షేర్ చేసుకోగలిగే గొప్ప సంగతులూ బహిరంగ వేదికల మీద నుంచి…

మంచి ఘనమైన వేదిక దొరికినప్పుడు ఎవ్వరికైనా సరే.. నలుగురికీ గుర్తుండిపోయే సందేశం ఇవ్వాలనే అనిపిస్తుంది. ఇలాంటి సందేశాలు, స్ఫూర్తిదాయక వచనాలు, వాట్సప్ లో షేర్ చేసుకోగలిగే గొప్ప సంగతులూ బహిరంగ వేదికల మీద నుంచి మాట్లాడడం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. సాధారణంగా మంచి అంత్యప్రాసలతో ఆయన సభలను రక్తి కట్టిస్తుంటారు. ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వాలు పరిపాలన సాగించే తీరుతెన్నుల మీద అనేక సెటైర్లు వేశారు.

పాలనలో ‘ఉచితం’ అనే పదం పూర్తిగా తొలగిపోవాలని.. వెంకయ్యనాయుడు ఉపదేశం చేశారు. ప్రజలకు రాజకీయ పార్టీలే ఈ ఉచితం అనే పదాన్ని అలవాటు చేశాయని అదే ఇప్పుడు గ్రహపాటుగా మారిందని వెంకయ్యనాయుడు సెలవిచ్చారు. ఉచిత పథకాలను వ్యతిరేకించే వాళ్లు సమాజంలో సగానికి పైగా ఉంటారు. కడుపు నిండిన ప్రతి ఒక్కడికీ ఉచిత పథకాల మీద కోపం ఉంటుంది. అలాంటప్పుడు వెంకయ్యనాయుడు కు ఉండడంలో ఆశ్చర్యం లేదు. మాటలు మాత్రమే ఉచితం అని ఆయన అన్నారు.

ఉచితం వద్దన్న ఆయన ప్రస్తావించింది మాత్రం ఒకే ఒక్క ఉచిత పథకం గురించి. ‘‘ఉచిత కరెంటు అంటారు. తర్వాత నో కరెంటు అంటారు..’’ అంటూ ఆయన సెటైర్లు వేశారు. ఆయన ప్రస్తావించింది ఒక్క కరెంటు పథకం మాత్రమే.. అది ఎవరి మీద విమర్శ అనేది అందరికీ తెలుసు. కాకపోతే వెంకయ్య మాత్రం.. నేను ఒక పార్టీనో, వ్యక్తినో అనడం లేదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ప్రజలకు మౌలిక వసతులు ఇవ్వాలి తప్ప.. ఉచిత పథకాలు ఇవ్వరాదన్నారు. ఇలాంటి ప్రకటనలతో పార్టీలు పోటీ పడుతున్నాయని అన్నారు.

ఉచిత పథకాలను ఇంతగా నిరసించే వెంకయ్యనాయుడు.. తనకు ఆత్మీయుడైన చంద్రబాబుకు అలాంటి సలహాలు ఎందుకు ఇవ్వడం లేదో తెలియదు. జగన్ కేవలం సంక్షేమ పథకాలను మాత్రమే ప్రవేశపెట్టారు. ఎన్నికల హామీలన్నీ ఉచిత పథకాలే! ఉచిత ప్రయాణం, ఉచిత గాస్ సిలిండర్లు, ఉచితంగా ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇవ్వడం లాంటివెన్నో ఉన్నాయి.

వెంకయ్యనాయుడుకు ఉచిత పథకాల మీద విరక్తి ఉంటే గనుక.. డైరక్టుగా చంద్రబాబునాయుడుకే సలహా ఇవ్వవచ్చు కదా.. అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇతరుల్ని నిందించేది కాకుండా.. స్పష్టంగా చంద్రబాబునాయుడు ప్రకటించిన అలవిమాలిన ఉచిత పథకాల విషయంలో ఆయనను హెచ్చరించవచ్చు కదా అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.