అమెరికాలో ఉన్నదేంటి- ఇండియాలో లేనిదేంటి?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం 2023-24 ఆర్ధిక సంవత్సరంలో భారతదేశంలో 4 కోట్ల 66 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించబడ్డాయి.  Advertisement అదే జే.పీ మోర్గాన్ లెక్క ప్రకారం అమెరికాలో 2023…

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం 2023-24 ఆర్ధిక సంవత్సరంలో భారతదేశంలో 4 కోట్ల 66 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించబడ్డాయి. 

అదే జే.పీ మోర్గాన్ లెక్క ప్రకారం అమెరికాలో 2023 లో కొత్తగా సృష్టించబడిన ఉద్యోగాలు 27 లక్షలు. ఇది 2022లో అయితే 48 లక్షలు. అంటే ఏడాదిలో దాదాపు సగానికి పడ్డాయన్నమాట కొత్త ఉద్యోగావకాశాలు.

ఎక్కడ ఇండియాలో నాలుగున్నర పై చిలుకు ఉద్యోగాలు, ఎక్కడ అమెరికాలో 27 లక్షలు? 

అమెరికా అంటే “ల్యాండ్ ఆఫ్ ఆపర్ట్యునిటీస్”. అయితే అది  ఒకప్పటి మాట. అంతకంటే పెద్ద ల్యాండ్ ఇప్పుడు ఇండియానే అనుకోవాలి పైన చెప్పుకున్న అంకెల్ని బట్టి. 

మరెందుకు భారతీయ యువత ఇంకా అమెరికావైపు పరుగులు తీద్దామనుకుంటున్నారు?

ఒకటి కొత్త దేశం మోజు..
రెండు డాలర్ వేల్యూ..
మూడు విశాలమైన రోడ్లు మౌలిక వసతులు..
ఇంతకు మించి మరొక పెద్దకారణం ఏదీ ఉండదు. 

ఎందుకంటే అక్కడ ఉన్న గన్ కల్చర్, డ్రగ్స్ కల్చర్, సేఫ్టీ లేని జీవితాలు, సొంత దేశంతో దూరభారం, పనివాళ్లు దొరక్కపోవడం…ఇవన్నీ మైనస్సులే. 

ఇండియాలో సృష్టింపబడిన ఉద్యోగాల్లో అధికశాతం హై స్కిల్ జాబ్స్ ఉండడం గమనార్హం. అది కూడా సర్వీస్ సెక్టార్స్ అయిన ఫైనాన్స్, బిజినెస్, విద్య, హెల్త్ కేర్ విభాగాల్లో విస్తృతంగా ఉద్యోగాలు పొందినవారున్నారు. పైగా నిరుద్యోగ నిష్పత్తి 2018లో 2.2గా ఉంటే అది 2024 నాటికి 1.4కి పడిపోయింది. ఇది కచ్చితంగా దేశాభివృద్ధి సూచికే. 

ఇదిలా ఉంటే వ్యాపారావకాశాలు విపరీతంగా పెరిగాయి. డోర్ డెలివరీ సర్వీసెస్ నుంచి, బ్యూటీ పార్లర్ సర్వీసులు..సెలూన్ సేవలు..అన్నీ ఎట్ హోం సర్వీసెస్ పేరుతో ఇంటికొచ్చేసాయి. అలా యువత ఎన్నో ఉపాధి అవకాశాలను సృష్టించుకుంటోంది. 

డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలే కానీ ఇండియాలో సంపాదన పెద్ద కష్టమేమీ కాదు. సిటీల్లో రోడ్ సైడ్ బజ్జీల బండో, చాట్ బండో పెట్టుకుని ఖర్చులు పోను నెలకి మూడులక్షలు ఇంటికి తీసుకెళ్తున్న వారున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుమారి ఆంటీ లాంటి వాళ్ల సంపాదన అయితే నెలకి పదిహేను లక్షల పైమాటే అని దగ్గరుండి గమనించినవారు చెబుతున్నారు. ఆమె రోజుకి రూ 10000 కంటే మిగలవని మీడియా ముందు చెప్పినా అది నిజం కాదనే వారున్నారు. పోనీ ఆమె చెప్పిందే తీసుకున్నా నెలకి మూడు లక్షల సంపాదన. తక్కువేం కాదు కదా. ఆవిడికొచ్చిన ఫ్రీ పబ్లిసిటీ వల్ల అంత సంపాదిస్తోంది అనుకున్నా, తక్కిన రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ వాళ్లు కూడా తక్కువేమీ సంపాదించట్లేదు. 

ఇక సాఫ్ట్ వేర్ ని నమ్ముకుని అమెరికాలో వాలిపోవాలనుకునే వారికి కూడా ఇండియాలోనే చక్కని ఉద్యోగాలుంటున్నాయి. ఒక అంచనా ప్రకారం ఒక్క టీసీఎస్ లాంటి కంపెనీలోనే 80000లకి పైగా ఉద్యోగావకాశాలున్నాయని, కానీ సరైన అర్హత ఉన్నవాళ్లు దొరక్క ఫిల్ కావట్లేదని కొన్ని ప్లేస్ మెంట్ ఏజెన్సీలు చెబుతున్నాయి. కారణం- సబ్జెక్ట్ లో ఆశించిన గ్రిప్ లేక కొందరు..ఉన్నా ఇంటర్వ్యూల్లో సరిగ్గా పర్ఫార్మ్ చేయలేక కొందరు నెలకి ఆరెంకల జీతాలున్న ఉద్యోగాలు పొందలేక పోతున్నారు. వాటిపై కాస్త శ్రద్ధ పెడితే చాలు పెద్ద శాలరీతో ఇండియాలోనే జీవితం మొదలుపెట్టేయొచ్చు. కంపెనీ అవసరం మీద మరింత ప్రోత్సాహించి పంపితే ఆన్సైట్ జాబ్ గా అమెరికాకి తర్వాతైనా వెళ్లొచ్చు. అలా వెళ్లడంలో ఇబ్బందులుండవు. 

ఈ మార్గాన్ని వదిలేసి, బీ టెక్ పూర్త్వగానే పూర్తిగా అమెరికానే నమ్ముకుని, బ్యాంక్ లోన్స్ తీసుకుని అమెరికాలో చదువుకోసం వెళ్లి, అక్కడ ఉద్యోగాల్లేక ఇబ్బంది పడి నానా కష్టాలు పడుతున్న తెలుగు పిల్లలు ఎక్కువైపోయారు. ఈ పరిస్థితి గత రెండేళ్లుగానే మరింత ఎక్కువయ్యింది. పదేళ్ల క్రితం అమెరికాకి వచ్చి సెటిలైన అధిక శాతం మంది బాగానే ఉన్నారు. కానీ కొత్త తరానికే చిక్కులు. 

కారణం పైన చెప్పుకున్నదే. అమెరికాలో ఉద్యోగావకాశాలు సన్నగిల్లాయి. ఇంకా సన్నగిల్లుతున్నాయి. దానివల్ల ఉద్యోగాలు రాక ఏం చెయ్యాలో తెలియని వాళ్లని కొందరు పక్కదారి పట్టిస్తున్నారు. 

తాజాగా టెక్సాస్ లో నలుగురు తెలుగువాళ్లు 15 మంది అమ్మాయిల్ని ఒకే చోట ఉంచి ఇల్లీగల్ షెల్ కంపెనీలకి పని చేయిస్తుండడం వెలుగులోకొచ్చింది. వారిని పోలీసులు అరెస్ట్ చేసారు. పోలీసుల్ని ఆరా తీస్తే ఇలాంటి వాళ్లు వందల్లో దొరికారని, అయితే వారిలో అధిక శాతం మంది బాధితులే అని చెప్పారు. 

నేరస్థులుగా ముద్రపడితే జైలుకెళ్లాలి. బయటికి రావడానికి లాయర్లకి కోట్లల్లో ఖర్చుపెట్టాలి. పెట్టినా కొన్ని రకాల కేసుల్లో రాలేకపోవచ్చు. బాధితులుగా ముద్రపడినా తలవంపులే. ఆ అమాయకత్వంపై ఎవ్వరూ జాలి చూపించరు. శక్తి లేకపోయినా ఆకాశసౌధాలు కట్టుకుని తగుదునమ్మా అంటూ అమెరికాకి వెళ్లి చతికిలపడ్డాడు అని వెక్కిరించేవాళ్లే ఉంటారు. 

టాప్ యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించే అంతర్జాతీయ స్థాయి ప్రతిభావంతుల గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. “విద్వాన్ సర్వత్ర పూజ్యతే” అన్నట్టుగా ప్రతిభావంతుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా గౌరవింపబడతాడు. ఆ ప్రతిభని టాప్ యూనివర్సీటీలు గుర్తించాలి. అప్పుడే అది ఉన్నట్టు. లేకపోతే ఉందని ఊహించుకోవడమే తప్ప నిజంగా ఉన్నట్టు కాదు. అరకొర ప్రతిభతో, లోకజ్ఞాన లేమితో, కేవలం ఆశలతో అమెరికాకి ఎగురుకుంటూ వచ్చేవాళ్లకి భంగపాటు తప్పదనే సంకేతాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 

నిజంగా డబ్బు బాగా ఉండి, అమెరికా చూసి తీరాలని పట్టుదల ఉండి, ఏ మారుమూల యూనివర్సిటీ అయినా పర్లేదు అక్కడే చదువుకోవాలనే సరదా ఉంటే ఆ సరదా తీర్చుకుని వచ్చేసేవరకు ఓకే తప్ప, అక్కడ మంచి ఉద్యోగం సంపాదించి సెటిలవ్వాలనే కోరిక మాత్రం గత ఏడాదిగా అమెరికా వెళ్తున్నవారిలో చాలామందికి తీరదు. ఎందుకంటే వెళ్తున్న వాళ్ల సంఖ్యకి, అక్కడి ఉద్యోగాలకి పొంతన లేకుండా ఉంది. 

శ్రీనివాసమూర్తి