విశాఖ ఉక్కు పరిశ్రమ లెక్కను తేల్చడానికి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి వస్తున్నారా అన్న చర్చ కార్మిక లోకంలో మొదలైంది. కర్నాటక మాజీ సీఎం కుమారస్వామికి ఈ కీలకమైన శాఖను కేంద్రం అప్పగించింది. ఆయనను ఏపీ బీజేపీ నేతలతో పాటు ఉక్కు కార్మిల సంఘాలు కలసి ప్రైవేటు పరం కాకుండా ఉక్కుని కాపాడాలని వినతి చేశాయి.
ఈ నేపధ్యంలో కుమారస్వామి విశాఖ ఉక్కు పరిశ్రమని ఈ నెల 11న సందర్శించనున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అవుతుందన్న వార్తల నేపధ్యంలో కేబినెట్ స్థాయి కలిగిన ఉక్కు శాఖ మంత్రి ప్లాంట్ ని సందర్శించడం ఇదే ప్రధమం. కుమారస్వామి జేడీఎస్ కి చెందిన వారు. బీజేపీలా ఆయనకు ఉక్కు విషయంలో పట్టుదల ఉండదని అంతా భావిస్తున్నారు. దాంతో ఆయన మీద ఉక్కు కార్మిక లోకం అంతా ఆశలు పెట్టుకుంది.
ఇదిలా ఉంటే కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ లో పర్యటించి అక్కడ పరిస్థితుల మీద అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్ష అనంతరం కేంద్ర మంత్రి కీలకమైన నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని సొంతంగా కొనసాగించకపోయినా సెయిల్ లో విలీనం చేసినా ప్రభుత్వ రంగ సంస్థగా ఉంటుందని ఉక్కు కార్మికులు మరో ఆప్షన్ ఇచ్చారు. దాంతో ఈ రెండవ ప్రతిపాదనకు కుమారస్వామి నుంచి ఆశావహమైన జవాబు లభించవచ్చు అని అంటున్నారు.
సెయిల్ లో కనుక విశాఖ స్టీల్ ప్లాంట్ విలీనం అయితే సొంత గనులకు ఇబ్బంది ఉండదు, పైగా ప్రభుత్వ రంగ సంస్థగానే మనుగడ సాగిస్తుంది. విశాఖ ఉక్కు చరిత్ర చెక్కు చెదరకుండా ఉంటుంది. కుమారస్వామి ఈ విషయంలో సానుకూలంగా ఉన్నారు అన్న వార్తల నేపధ్యంలో ఆయన పర్యటనలో ఏ ప్రకటన రాబోతుంది అన్నది అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.