బాలకృష్ణ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది ఊర్వశి రౌతేలా. ఇంతకుముందు తను చేసిన ఐటెంసాంగ్స్ టైపులో కాకుండా, నటించడానికి ఆస్కారం ఉన్న పాత్ర పోషిస్తున్నట్టు గతంలోనే ప్రకటించింది. ఇప్పుడీ సినిమా సెట్స్ లో ఆమె గాయపడినట్టు తెలుస్తోంది.
బాలయ్య సినిమా సెట్స్ లో ఊర్వశికి ప్రమాదం జరిగినట్టు, ఆమెను వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేసినట్టు, ఆమె ప్రతినిధులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె తీవ్ర గాయాలతో ఇబ్బంది పడుతోందని కూడా వాళ్లు అంటున్నారు. అయితే నిర్మాణ సంస్థ నుంచి దీనిపై ఎలాంటి ప్రకటన లేదు.
బాబి దర్శకత్వంలో, సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది ఈ సినిమా. తాజాగా ఊర్వశి రౌతేలా ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది. అంతలోనే ఆమె గాయాల పాలైంది. ఓ యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు.
వాల్తేరు వీరయ్య సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్ తో టాలీవుడ్ హాట్ ఫేవరెట్ అయిపోయింది ఊర్వశి. ఆ తర్వాత ఏజెంట్, స్కంద సినిమాల్లో ఆమె ఐటెంసాంగ్స్ చేసింది. ఇప్పుడు బాలయ్య సినిమాలో కీలక పాత్రకు ఎంపికైంది.