ఉచిత ఇసుక ముసుగులో దొంగ చాటు వడ్డింపులు!

రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఇసుక ఇచ్చేస్తాం అని చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సమయంలో చాలా ఘనంగా ప్రకటించారు. ఉచిత ఇసుక విక్రయాలు అనే ప్రహసనప్రాయమైన నాటకాన్ని లాంఛనంగా ప్రారంభించారు కూడా. మంగళవారం నుంచి…

రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఇసుక ఇచ్చేస్తాం అని చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సమయంలో చాలా ఘనంగా ప్రకటించారు. ఉచిత ఇసుక విక్రయాలు అనే ప్రహసనప్రాయమైన నాటకాన్ని లాంఛనంగా ప్రారంభించారు కూడా. మంగళవారం నుంచి రెగ్యులర్ ఉచిత విక్రయా జరుగుతాయి.

ప్రస్తుతం నిల్వ పాయింట్లో ఉన్న ఇసుక మొత్తం విక్రయాలు పూర్తయ్యేలోగా కొత్త ఇసుక విధానాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం రూపొందిస్తుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో 2019, 2021 సంవత్సరాలలో తెచ్చిన ఇసుక విధానాలను ఈ సర్కారు రద్దు చేసింది. కానీ ఉచిత ఇసుక అనే ముసుగులో ఏదో మాయామర్మం దోబూచులాట ఉన్నదని ప్రజలు అనుమానిస్తున్నారు. ఉచితం అంటూనే ప్రకటిస్తున్న ధరలు అనూహ్యంగా ఉంటున్నాయని వారు నివ్వెరపోతున్నారు.

ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వడం అనే ప్రయత్నం మంచిదే. ఇసుక తవ్వకానికి అయ్యే ఖర్చులు, సీవరేజీ చార్జీలు, నిర్వహణ ఖర్చులు మాత్రమే వసూలు చేయాలనేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని విధానం. టన్ను ఇసుక తవ్వకానికి ఇది వరకు రూ. 30 వంతున కాంట్రాక్టర్లకు చెల్లించేవారు. అలాగే టన్ను ఇసుకకు సీవరేజీ చార్జీలు కింద 88 రూపాయలు, నిర్వహణ ఖర్చుల కింద మరో 20 రూపాయలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మాత్రం చార్జీలు వసూలు చేయడాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కన ఒక ట్రాక్టర్లో  5 టన్నుల వరకు ఇసుక పడుతుందని అనుకుంటే.. 700- 800 రూపాయల ధరకే ఇసుక ట్రాక్టర్ దొరకాలి. కానీ ఇప్పుడు కూడా ట్రాక్టర్ ఇసుక ధర వేలల్లో ఎందుకు పలుకుతోందో అర్థం కాని సంగతి.

ఇసుక ధరలను ఎక్కడికక్కడ నిర్ణయించే అధికారాన్ని జిల్లా స్థాయి కమిటీలకు కట్టబెడుతున్నారు. ఈ కమిటీలు స్థానిక కారణాల ముసుగులో రకరకాల నిబంధనలను రూపొందించి మళ్లీ ప్రజల నడ్డి విరిచే ధరలను నిర్ణయించే ప్రమాదం ఉన్నదని ప్రజలు అనుమానిస్తున్నారు. ఇసుక తవ్వకాల ధరలు ఒక్కోచోట ఒక్కోరకంగా ఉంటాయి కనుక ప్రజలపైన అధిక భారం మోపే ప్రమాదం ఉన్నదని భయపడుతున్నారు.

కొత్తగా ప్రారంభించిన ఉచిత ఇసుక వ్యాపారంలో కొన్నిచోట్ల ఒక ట్రాక్టర్ 4000 వరకు ధర పలికే పరిణామాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కొత్త ఇసుక విధానంలో అన్ని విషయాలను సమగ్రంగా పేర్కొన్న తర్వాత గాని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తున్నదా? చేటు చేస్తున్నదా అర్థం కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఏది ఏమైనప్పటికీ- ఇసుక వ్యాపారం పేరుతో దోచేశారని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిందించిన సంగతి అందరికీ తెలుసు. అలాంటప్పుడు.. జగన్ రాక ముందు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏ ధరకు ఇసుక దొరికేదో.. ఇప్పుడు కూడా అదే ధరకు దొరికే విధంగా ఇసుక విధానాన్ని రూపొందిస్తే తప్ప.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తున్నదని నమ్మలేము అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.