తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం దర్శనం టికెట్లను తిరుపతి విమానాశ్రయంలో ఇప్పించేందుకు ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కృషి చేస్తున్నారు. గతంలో విమాన ప్రయాణం చేసే భక్తులకు విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్లు జారీ చేసేలా డాక్టర్ గురుమూర్తి చర్యలు తీసుకున్నారు. ఈ ఏర్పాటు విమాన ప్రయాణం చేసే భక్తులకు ఎంతో ఉపయోగపడింది.
ఈ క్రమంలో శ్రీవాణి టికెట్లతో పాటు వీఐపీ బ్రేక్, సుపథం (రూ.300) దర్శన టికెట్లను కూడా విమానాశ్రయంలో జారీ చేసేలా ఆయన టీటీడీ ఉన్నతాధికారితో చర్చిస్తున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవో శ్యామలారావుతో తిరుపతి ఎంపీ భేటీ అయ్యారు. ప్రతి రోజూ తిరుమలకు వివిధ ప్రాంతాల నుంచి ఎంత మంది భక్తులు వస్తున్నారు, అలాగే విమానంలో వచ్చే వారి వివరాలను కూడా ఈవోకు అందజేసినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో తిరుపతి విమానాశ్రయంలో మూడు రకాల దర్శనం టికెట్ల జారీ ఆవశ్యకతను టీటీడీ ఈవోకు తిరుపతి ఎంపీ వివరించారు. కలియుగ దైవాన్ని దర్శించుకోడానికి వచ్చే భక్తుల కోసం తప్పకుండా విమానాశ్రయంలో టికెట్ల జారీకి చర్యలు తీసుకోవాలనే తిరుపతి ఎంపీ విజ్ఞప్తికి టీటీడీ ఈవో సానుకూలంగా స్పందించారని సమాచారం.
టీటీడీ పాలక మండలి ఏర్పాటైన తర్వాత విమానాశ్రయంలో మూడు రకాల దర్శనం టికెట్లు జారీ చేయడంపై అడుగులు ముందుకు పడొచ్చని తిరుపతి ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు.