మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేస్తారని విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై వైసీపీ నుంచి ఎలాంటి స్పందన లేదు. వైసీపీ మౌనం అంగీకారమా? లేక ఎప్పట్లాగే ఉదాసీనత? అనేది అర్థం కావడం లేదని ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. జగన్ రాజీనామా ప్రచారం వైసీపీ శ్రేణుల్లో గందరగోళానికి దారి తీస్తోంది.
వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైఎస్ జగన్ లేఖ రాసినా సానుకూల స్పందన రాలేదు. దీంతో అసెంబ్లీకి వెళ్లి చేసేదేమీ లేదని జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో జగన్‌కు ఢిల్లీ రాజకీయాలపై ఆసక్తి ఏర్పడిందని ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, కడప ఎంపీగా పోటీ చేయడం అంటే పెద్ద రిస్క్. ముఖ్యంగా కడప ఎంపీగా వైఎస్ అవినాష్‌రెడ్డి 60 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ఇప్పుడు కూటమి చేతిలో అధికారం వుంది. ఒకవేళ కడపకు ఉప ఎన్నిక అనివార్యమైతే … పరిస్థితి ఎలా వుంటుందో తెలియనంత అమాయకత్వం జగన్‌ది కాదు. ఉప ఎన్నికలకు వెళ్లడం అంటే… సొంత పార్టీ శ్రేణులకు తీవ్ర ఇబ్బందులను జగన్ కొని తీసుకురావడమే అవుతుంది.
జగన్ రాజీనామా, ఉప ఎన్నికలపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ నుంచి మౌనమే సమాధానం కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలాంటి ప్రచారాన్ని ఆ పార్టీ ఎందుకు కోరుకుంటున్నదో ఎవరికీ అర్థం కాదు. వైసీపీ మౌనం, జగన్ రాజీనామాపై మరింత విష ప్రచారానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. జగన్ రాజీనామాతో పులివెందుల నుంచి ఆయన తల్లి విజయమ్మ పోటీ చేస్తారని చెబుతున్నారు. అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయించుకున్న తర్వాత విజయమ్మ గెలిస్తే మాత్రం ఏం ప్రయోజనం? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఇప్పటికైనా జగన్ రాజీనామాపై వైసీపీ మౌనం వీడాలి. లేదంటే వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో గందరగోళానికి ఆ పార్టీని కారణమవుతుంది. ఇది ముమ్మాటికీ తప్పిదమే అవుతుంది. ప్రత్యర్థుల మైండ్‌గేమ్‌కు వైసీపీ మౌనం అగ్గికి ఆజ్యం పోసినట్టు అవుతుందని గ్రహించాలి. కావున జగన్ రాజీనామా ప్రచారంపై ఇప్పటికైనా వైసీపీ పెద్దలు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం వుంది.