అంబానీ ఇంట పెళ్లికి అంతర్జాతీయ ప్రముఖులు

ముకేశ్ అంబానీ ఇంట ఎప్పుడు పెళ్లి జరిగినా అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులు హాజరవుతారు. కూతురు పెళ్లి చేసినప్పుడు, పెద్ద కొడుకు పెళ్లి చేసినప్పుడు ఇదే జరిగింది. ఏకంగా బ్రిటన్ ప్రధాని సైతం హాజరైన సందర్భం…

ముకేశ్ అంబానీ ఇంట ఎప్పుడు పెళ్లి జరిగినా అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులు హాజరవుతారు. కూతురు పెళ్లి చేసినప్పుడు, పెద్ద కొడుకు పెళ్లి చేసినప్పుడు ఇదే జరిగింది. ఏకంగా బ్రిటన్ ప్రధాని సైతం హాజరైన సందర్భం ఉంది. ఇప్పుడు చిన్న కొడుకు పెళ్లికి కూడా ఇదే ఆనవాయితీ ఫాలో అవుతోంది అంబానీ ఫ్యామిలీ.

అనంత్ అంబానీ పెళ్లికి అంతర్జాతీయ ప్రముఖులు హాజరవుతున్నారు. వీళ్లలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ వ్యక్తి ఫుట్ బాల్ దిగ్గజం డేవిడ్ బెక్ హామ్. గతేడాది ముకేశ్ అంబానీని కలిసిన బెక్ హాం, ఈ ఏడాది కూడా అనంత్ పెళ్లి కోసం మరోసారి ఇండియా రాబోతున్నాడు.

కెనడియన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఇప్పటికే అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకల్లో మెరిశాడు. తన ప్రదర్శనతో అందర్నీ ఉర్రూతలూగించాడు. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లోని గ్రాండ్ థియేటర్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

ఇతడి కంటే ముందు రిహన్నా, క్యాటీపెర్రీ, బ్యాక్ స్ట్రీట్ బాయ్స్, ఆండ్రియా బోసెల్లి లాంటి ఎంతోమంది ప్రముఖులు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెళ్లి తంతు మరో 4 రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో మరింత మంది విదేశీ ప్రముఖుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది.

అనంత్ అంబానీ పెళ్లి కారణంగా బీకేసీ (బాంద్రా కుర్లా కాంప్లెక్స్) ప్రాంతానికి చుట్టుపక్కలున్న హోటల్స్ అన్నీ నిండిపోయాయి. అంతేకాదు, రేట్లు కూడా భారీగా పెంచేశారు. ఓ స్టార్ హోటల్ లోనైతే ఒక్క రాత్రికి లక్ష రూపాయలు కూడా ఛార్జ్ చేస్తున్నారు. ట్రైడెంట్, ఒబెరాయ్ లాంటి స్టార్ హోటల్స్ లో జులై 10 నుంచి 14వ తేదీ వరకు రూమ్స్ లేవు.

ఈనెల 12న పెళ్లి చేసుకోబోతున్నాడు అనంత్ అంబానీ. దీని కోసం మార్చి 1 నుంచే ప్రీ-వెడ్డింగ్ వేడుకలు షురూ చేశారు. అలా ఈ కుబేరుడి పెళ్లి వేడుకలు 4 నెలలకు పైగా సాగాయి. నెలలో ప్రతివారం ఏదో ఒక వేడుక జరిగింది. ఇక అసలైన పెళ్లి వేడుక 12వ తేదీన జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనుంది. ఈ పెళ్లి ఖర్చు 1500 కోట్ల రూపాయలు ఉంటుందని ఓ అంచనా.