వైసీపీకి ఎమ్మెల్సీ ఆశ ఉందా?

వైసీపీకి అయిదేళ్ళ పాటు ఏ పదవులూ లేవు అన్నది తెలిసిందే. ఆ పార్టీకి ఏపీ అసెంబ్లీలో కేవలం 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతో ఒక ఎమ్మెల్సీని గెలిపించుకోవాలంటే 23 మంది దాకా…

వైసీపీకి అయిదేళ్ళ పాటు ఏ పదవులూ లేవు అన్నది తెలిసిందే. ఆ పార్టీకి ఏపీ అసెంబ్లీలో కేవలం 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతో ఒక ఎమ్మెల్సీని గెలిపించుకోవాలంటే 23 మంది దాకా అవసరం పడతారు. అంటే ఉన్న సంఖ్యకు రెట్టింపు కంటే ఎక్కువ. అలాంటిది ఎమ్మెల్సీ పదవి వైసీపీకి ఎలా వస్తుంది అంటే దానికో లెక్క ఉందిట.

విశాఖ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి ఒక ఎమ్మెల్సీ పదవి ఖాళీగా ఉంది. వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనకు వెళ్లడంతో ఆయన మీద శాసన మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. జనసేనలోకి వెళ్ళిన వంశీ క్రిష్ణ ఎమ్మెల్యే అయ్యారు.

ఈ స్థానానికి తొందరలోనే ఎన్నికలు జరుగుతాయి. స్థానిక సంస్థలలో వైసీపీకి ఈ రోజుకు బలం ఉంది. దాంతో ఆ సీటు కోసం కొంతమంది కన్నేశారు అని అంటున్నారు. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.

ఆయన గాజువాక నుంచి పోటీ చేసి తాజా ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. దాంతో ఆయన ఎమ్మెల్సీ అయ్యేందుకు చూస్తున్నారు అని వైసీపీలో మిగిలిన నేతలు గుస్సా అవుతున్నారు. ఓడిపోయిన వారికి ఎమ్మెల్సీ ఇవ్వవద్దు అని అప్పుడే ఎలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు హై కమాండ్ ని కోరినట్లుగా వార్తలు వచ్చాయి.

కొత్త ముఖాలకు ఈ పదవి ఇవ్వాలని కూడా అంటున్నారు. వైసీపీలో ఈ గోల ఇలా ఉంటే విశాఖ కార్పొరేషన్ జిల్లా పరిషత్ లలో వైసీపీకి మెజారిటీ ఉంది. అయితే వైసీపీలో ప్రస్తుతం ఉన్న వారు ఎంత మంది కొనసాగుతారు అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. కార్పోరేషన్ లో కార్పోరేటర్లు టీడీపీ వైపు వెళ్తారు అని ప్రచారం సాగుతోంది. అలాగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గోడ దూకేందుకు చూస్తున్నారు.

నిజంగా ఎన్నికలు అంటూ జరిగితే టీడీపీ ఈ ఎమ్మెల్సీని వదులుకుంటుందా అన్నది ప్రశ్న. అయితే వైసీపీలో మాత్రం ఒకే ఒక ఎమ్మెల్సీ పోస్ట్ మీద ఆశలు అయితే బాగానే ఉన్నాయి. అందులోనూ నాయకుల మధ్య పోటీ కూడానూ అని అంతా బుగ్గలు నొక్కుకునే పరిస్థితి ఉంది.