ఏపీలో ఇసుక ఉచితం అని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే విశాఖ జిల్లా నర్శీపట్నంలో మాత్రం ఇసుక ఉచితం కాదా అని అంతా చర్చించుకుంటున్నారు. టన్ను ధర 1225 అని బోర్డు కూడా పెట్టారు. దీని మీద జనం గందరగోళంలో ఉంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ అయితే ఫైర్ అయ్యారు.
అపుడే టీడీపీ నేతలు ఇసుక దందాకు తెర తీశారని ఆయన ఆరోపించారు ఇసుక ఉచితం అని ఒక వైపు ప్రభుత్వం చెబుతూంటే మరో వైపు టన్నుకు ఇంత అని రేటు పెట్టడం ఏంటని ఆయన మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ఇసుక ఉచితం అన్న పదాన్ని తీసేయాలని ఆయన డిమాండ్ చేశారు.
నర్శీపట్నం మండలం గబ్బడ ఇసుక పాయింట్ లో ఇసుక దోపిడీకి టీడీపీ నేతలు భారీ స్కెచ్ గీశారు అని పెట్ల ఆరోపించారు. నర్శీపట్నానికి సుమారు లక్ష టన్నుల ఇసుక వస్తే అరవై టన్నులు అని మాత్రమే అధికారులు చెబుతున్నారని ఆయన విమర్శించారు.
దీని మీద తనకు పక్కా సమాచారం ఉందని ఇసుక దోపిడీకి తెర తీస్తున్నారు అని ఆయన అన్నారు. ఇసుక నిల్వలను అధికారులే కాపాడాలని లేకపోతే ఇసుక దందా పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. గబ్బడ ఇసుక దోపిడీ మీద సమగ్రమైన విచారణ జరిపించాలని కూడా పెట్ల డిమాండ్ చేశారు. ఇసుక ఉచితం అంటూ టన్నుకు 1225 రేటు పెట్టడమ్మాత్రం చర్చ సాగుతోంది.