అవసరం తీరిపోయిన తర్వాత- ఈసారి కష్టంలో ఉంటే చెప్పు నేను గట్టున పడేస్తా అని బూటకపు ప్రేమను చూపించే వాళ్ళు సమాజంలో చాలామంది మనకు కనిపిస్తుంటారు. అవసరానికి ఆశ్రయించినప్పుడు మొహం చాటేసి మోసం చేసి ఉంటారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తాను ఆ బాపతు నాయకుడినే అని నిరూపించుకుంటున్నారు.
కడప ఎంపీ ఎన్నికల విషయంలో షర్మిల బరిలోకి దిగి గెలవడం కోసం నానా కష్టాలు పడుతున్న సమయంలో ఆయన పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు- ఒకవేళ ఉపఎన్నిక వస్తే తప్పకుండా వచ్చి ప్రచారం చేస్తానని డాంబికపు హామీలు ఇస్తున్నారు. ఊహాజనితమైన పరిస్థితిని ప్రస్తావించి.. తాను హీరోయిజం చూపించడం ఆయనకే చెల్లింది.
మంగళగిరిలో ఏపీ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాజశేఖర్ రెడ్డి కూతురు వైయస్ షర్మిలకు ఒక అపురూపమైన వరాన్ని ప్రకటించారు. అదేమిటంటే కడప ఎంపీ సీటుకు ఉపఎన్నిక వస్తే గనుక వైఎస్ షర్మిలను గెలిపించే బాధ్యత తాము తీసుకుంటామని, కడపలో షర్మిలకు మద్దతుగా తన ప్రచారం చేస్తానని వెల్లడించారు.
ట్విస్టు ఏమిటంటే ఇటీవల సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసిన సమయంలో కడపలో ఎన్నికల ప్రచారానికి రావాల్సిందిగా షర్మిల రేవంత్ రెడ్డిని ఆశ్రయించారు. అయినా ఆయన పట్టించుకోలేదు. అటు రాహుల్ గాంధీ కోసం ప్రచారం చేయడానికి రెండు నియోజకవర్గాలకూ తిరిగారే తప్ప షర్మిలను పట్టించుకోలేదు. తీరా ఆమె దారుణంగా ఓడిపోయిన తరువాత ఇప్పుడు ఊహాజనితమైన ఉపఎన్నిక మాట ఎత్తుతున్నారు. కడప ఎంపీ స్థానానికి ఉపఎన్నిక వస్తుందని ఏ విధంగా ఆయన ఊహించుకుంటున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.
నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి షర్మిల చేసిన త్యాగం కూడా ఒక కారణం. ఆ రాష్ట్రంలో పార్టీని స్థాపించి ఒక ఊపు తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ కోసం సొంత పార్టీని బలి పెట్టారు షర్మిల. అందుకు ప్రతిఫలంగా ఆమెకు రాజ్యసభ స్థానం ఇచ్చి ఉండాల్సింది. అలాంటి మేలు ఏమీ తలపెట్టకపోగా.. ఇప్పుడు ఎలాంటి అవకాశం లేని ఉపఎన్నిక అనే మాట చెప్పి ఆమెను గెలిపించడానికి తాను పూనుకుంటానంటూ రేవంత్ రెడ్డి మాయ చేస్తున్నారని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.