షర్మిల సింగిల్ పాయింట్ ఎజెండా అదేనా!

ఆవు వ్యాసం మాత్రమే వచ్చిన వాడు, ఏం అడిగినా ఏదోలా అక్కడికే వెళ్లిపోతాడు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర లీడర్ వైఎస్ షర్మిల వ్యవహారం అలాగే వుంది. అన్నతో అన్నీ బాగున్నన్ని నాళ్లు, అన్న అంత…

ఆవు వ్యాసం మాత్రమే వచ్చిన వాడు, ఏం అడిగినా ఏదోలా అక్కడికే వెళ్లిపోతాడు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర లీడర్ వైఎస్ షర్మిల వ్యవహారం అలాగే వుంది. అన్నతో అన్నీ బాగున్నన్ని నాళ్లు, అన్న అంత మంచోడు లేడు. అన్నతో తేడా వచ్చిన తరువాత అన్ని విషయాల్లోనూ అన్న చెడ్డోడే.

సరే, ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక కలత వుంటుంది. అన్నదమ్ములు, అన్న చెల్లెళ్లు గొడవలు మామూలే. అందుకే ఈ విషయంలో జగన్ ను, షర్మిలను ఎవరిది తప్పు పట్టలేము. ఎన్నికల ముందు షర్మిల తనకు అంటూ ఓ బాట ఎంచుకుని ఆ దిశగా వెళ్లారు. అన్నను ప్రతి చిన్న విషయంలో దుయ్య బట్టారు. తూర్పారబట్టారు. అంతా బాగుంది.

ఎన్నికలు ముగిసాయి. షర్మిల ఇప్పుడు జస్ట్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మాత్రమే. అంతకు మించి ఏమీ లేదు. అది ఎన్నాళ్లు వుంటుందో తెలియదు. అందువల్ల ఇప్పుడు షర్మిల చేయాల్సింది ఏమిటి? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి స్ధానాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? రాష్ట్రం అంత పార్టీని ఎలా బలోపేతం చేసుకునే దిశగా ముందుకు వెళ్లాలి? ప్రజల్లో తనకు, తన పార్టీకి ఓ ఇండివిడ్యువాలిటీ వచ్చేలా ఎలా చేసుకోవాలి? అధికార, ప్రతిపక్షాలు అన్నింటికి ఎలా సమాన దూరం మెయింటెయిన్ చేయాలి. ఇది కదా చేయాల్సింది.

పాడిందే పాడరా అన్నట్లుగా తండ్రి సంతాప సభలో కూడా అన్న మీద మళ్లీ అవే పాత విమర్ళలు చేస్తే, వినేవాళ్లకు కొత్తదనం లేకపోగా వెగటుగా వుంటుంది. తనకు అప్పగించిన డ్యూటీ అదే, అలా చేస్తేనే తను సర్వైవ్ అవుతాను అనుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు. ఇప్పుడు వెనుక వుండి కేవలం యాంటీ జగన్ ఫ్రమ్ ఓన్ ఫ్యామిలీ అనే ప్రాజెక్ట్ ను నడిపిస్తున్న వారు, రేపు భవిష్యత్ లో పక్కకు తప్పుకుంటే షర్మిల పరిస్థితి ఏమిటి? అలా తప్పుకోరు అన్న గ్యారంటీ లేదు. అలా తప్పుకుంటే షర్మిల రెంటికి చెడ్డ రేవడి అవుతారు కదా.

భాజపాతో వున్న చంద్రబాబును విమర్శించాలా? జగన్ ను విమర్శించాలా?

కాంగ్రెస్ కు శతృవు భాజపా అనే ఎన్ డి ఏ కూటమినా? జగన్ నా?

ఈ మాత్రం ఓనమాలు తెలియకుండా షర్మిల ఆంధ్ర రాజకీయాల్లో సాధించేది ఏమిటి? ఆమె నే ఆలోచించుకోవాలి.