జ‌గ‌న్- ష‌ర్మిల- బంగారు బాతు గుడ్డు!

రాజ‌కీయాల్లో ఇప్పుడు అంద‌రి కంటే ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల ప‌ని బాగుంది. రాజ‌కీయాల్ని సొమ్ము చేసుకోవ‌డం ఎలా? అనే ప్ర‌శ్న‌కు… ష‌ర్మిల రాజ‌కీయాల్ని స‌మాధానంగా చెప్పొచ్చు. తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం తీసుకొస్తానంటూ వైఎస్సార్‌టీపీ…

రాజ‌కీయాల్లో ఇప్పుడు అంద‌రి కంటే ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల ప‌ని బాగుంది. రాజ‌కీయాల్ని సొమ్ము చేసుకోవ‌డం ఎలా? అనే ప్ర‌శ్న‌కు… ష‌ర్మిల రాజ‌కీయాల్ని స‌మాధానంగా చెప్పొచ్చు. తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం తీసుకొస్తానంటూ వైఎస్సార్‌టీపీ పేరుతో సొంత రాజ‌కీయ పార్టీ పెట్టారు. రెండుమూడేళ్లు కాళ్ల‌రిగేలా తెలంగాణ అంతా తిరిగినా, కేసీఆర్ స‌ర్కార్‌పై గొంతు చించుకుని విమ‌ర్శ‌లు చేసినా, చివ‌రికి ఎలాంటి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల్ని ఆమె పొంద‌లేక‌పోయారు.

చివ‌రికి తెలంగాణ‌లో చేదు అనుభ‌వాల్ని గుణ‌పాఠాలుగా నేర్చుకున్నారామె. స‌రికొత్త రాజ‌కీయ పంథా ఎంచుకున్నారు. జాతీయ పార్టీ కాంగ్రెస్‌లో చేరడం ద్వారా మొద‌ట చేతి నుంచి డ‌బ్బు ఖ‌ర్చు కాకుండా చూసుకున్నారు. ఏపీలో త‌న అన్న‌కు వ్య‌తిరేకంగా రాజ‌కీయాలు చేయ‌డం మొద‌లు పెట్టారు. ర‌క‌ర‌కాల ప్ర‌యోజ‌నాల్ని ఆమె రుచి చూశారు.

క‌డ‌ప‌కు వెళ్లాలంటే చంద్ర‌బాబు శిష్యుడైన బీజేపీ ఎంపీ సీఎం ర‌మేశ్‌నాయుడి విమానం సిద్ధం.  పైసా ఖ‌ర్చు లేకుండా ఇదేదో బాగుందే అని అనుకున్నారు. పైగా ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు పెట్ట‌డానికి కాంగ్రెస్ అధిష్టానం చెప్పుకోద‌గ్గ సొమ్మునే ష‌ర్మిల‌కు ఇవ్వ‌గా, ఆమె ఒక‌రిద్ద‌రికి ఇచ్చి, మిగిలిన సొమ్మంతా సొంతం చేసుకున్నార‌ని అదే పార్టీకి చెందిన సుంక‌ర ప‌ద్మ‌శ్రీ, మ‌రికొంద‌రు నేత‌లు ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. వారు అంత‌టితో ఆగ‌లేదు. ఏకంగా ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్ద‌ల‌కు ఫిర్యాదు చేశారు.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో ష‌ర్మిల ఒక కీల‌క విష‌యాన్ని ప‌సిగ‌ట్టారు. త‌న అన్న జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా రాజ‌కీయాలు చేసినంత కాలం.. ప్ర‌యోజ‌నాలు స‌మ‌కూరుతాయ‌ని ప‌సిగ‌ట్టారు. కోటి విద్య‌లు కూటి కోసమో అన్న చందంగా, రాజ‌కీయాల్లోకి సేవ చేయ‌డానికి వ‌చ్చామనే మాటే త‌ప్ప‌, డ‌బ్బు మిగిల్చుకోడానికి అని అంద‌రికీ తెలిసిందే. జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ష‌ర్మిల రాజ‌కీయాలు చేయ‌డం వ‌ల్ల ఎవ‌రైతే లాభ‌ప‌డుతారో, అందుకు త‌గ్గ ప్ర‌తిఫ‌లంగా ఆమె మంచీచెడ్డ‌లు చూసుకుంటారు. ఇప్ప‌టికే ఇది నిరూపిత‌మైంది.

జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా రాజ‌కీయ టాస్క్ స‌క్సెస్‌ఫుల్‌గా చేయ‌డం ఎంత క‌ష్ట‌మో ష‌ర్మిల‌కు తెలుసు. ఇందులోకి అప్పుడ‌ప్పుడు త‌న త‌ల్లిని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన బాధ్య‌త‌ను కూడా ష‌ర్మిల‌పై కొంద‌రు మోపారు. మ‌రి ష‌ర్మిల‌కు ఊరికే ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే ఎలా? అని కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఏది ఏమైనా జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా రాజ‌కీయాలు చేయ‌డం కంటే ఉత్త‌మ‌మైన మార్గం లేద‌ని ఆమె గ్ర‌హించారు. చిన్న‌ప్పుడు ప్ర‌తి ఒక్క‌రూ బంగారు బాతు గుడ్ల క‌థ వినే వింటారు. ఇప్పుడు జ‌గ‌న్ పేరు చెప్పి ష‌ర్మిల బంగారు బాతు గుడ్డును ప్ర‌తి రోజూ సొంతం చేసుకుంటున్నార‌నే సెటైర్ ఆలోచింప‌ద‌గ్గ‌దే.