కూటమి ప్రభుత్వ నియామకాలపై అప్పుడే అసంతృప్తి సెగలు. తిరుపతి కలెక్టర్‌గా డాక్టర్ వెంకటేశ్వర్ తమకు వద్దే వద్దని టీడీపీ నాయకులు ప్రభుత్వ పెద్దల వద్ద తెగేసి చెప్పినట్టు సమాచారం. కనీసం విచారించకుండా కలెక్టర్ల నియామకం ఎలా చేస్తారని ప్రభుత్వ పెద్దలను తిరుపతి జిల్లా టీడీపీ నేతలు ప్రశ్నించినట్టు సమాచారం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో డాక్టర్ వెంకటేశ్వర్ అంటకాగినట్టు టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
గత ప్రభుత్వ హయాంలో డాక్టర్ వెంకటేశ్వర్ చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా పని చేశారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొన్ని రోజుల ముందు పుంగనూరు నియోజకవర్గంలో 982 ఎకరాల్ని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ జేసీగా వెంకటేశ్వర్ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో ఉత్తర్వులు అమల్లోకి రాలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆశ్చర్యంగా ఆ ఉత్తర్వులు అమలుకు నోచుకున్నాయి.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులకు భారీగా లబ్ధి చేకూర్చేందుకే నిషేధిత జాబితా నుంచి 982 ఎకరాలను తొలగిస్తూ డాక్టర్ వెంకటేశ్వర్ ఉత్తర్వులు ఇచ్చారని టీడీపీ నేతలు ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేశారు. నిన్నమొన్నటి వరకూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో అంటకాగిన ఐఏఎస్ అధికారిని తీసుకొచ్చి తిరుపతి కలెక్టర్‌గా నియమించడం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడిన ఐఏఎస్ అధికారుల్ని గుర్తించి, గౌరవప్రదమైన పోస్టులను ఇవ్వాలని తిరుపతి జిల్లా టీడీపీ నేతలు చెప్పినట్టు తెలిసింది. తిరుపతి కలెక్టర్‌ను తక్షణం తప్పించాల్సిందే అని ప్రభుత్వ పెద్దలపై తిరుపతి టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఆదిలోనే ఇలాంటి పరిస్థితి ఎదురు కావడంతో ప్రభుత్వ పెద్దలు నాలుక కరుచుకున్నారని తెలిసింది. త్వరలో ఆయనపై బదిలీ వేటు పడే అవకాశం వుంది.