ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఇది పరీక్షా సమయం. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన ఆయనకు న్యాయ, అన్యాయాలపై స్పష్టమైన అవగాహన వుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాల్లో వీసీల రాజీనామా రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఏపీలో దాదాపు 12 విశ్వవిద్యాలయాల వీసీలు రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులు, దాడుల కారణంగా రాజీనామాలు చేశారు.
విశ్వ విద్యాలయాలకు టీడీపీ నాయకులు, ఆ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం నాయకులు వెళ్లి ఎంతగా అల్లరి చేశారో టీవీల్లో ప్రతి ఒక్కరూ చూసి షాక్‌కు గురయ్యారు. ఇదేంటి గతంలో ఎప్పుడూ ఇలా లేదే అని ముక్కున వేలేసుకున్నారు. వీసీలను బెదరగొట్టి రాజీనామాలు చేయించడంలో టీడీపీ నేతలు సక్సెస్ అయ్యారు. అయితే వాటిని ఆమోదించాల్సింది విశ్వవిద్యాలయాలకు బాస్ అయిన చాన్సలర్.
చాన్సలర్‌గా గవర్నర్ ఉన్నారు. వీసీల రాజీనామా బాల్ ఇప్పుడు గవర్నర్ కోర్టులో వుంది. ఒకేసారి 12 మంది వీసీలు రాజీనామాలు చేయడం బహుశా దేశంలో ఎక్కడా జరిగి వుండదు. ఈ నేపథ్యంలో వీసీల రాజీనామాల్ని ఆమోదించాలంటే… ముందుగా వారిని చాన్సలర్ హోదాలో ఉన్న గవర్నర్ పిలిపించుకుని మాట్లాడాల్సి వుంటుంది. ఏవైనా ఒత్తిళ్లు, బెదిరింపులా ఉన్నాయా? అని ఆయన ఆరా తీయాల్సి వుంటుంది.
రాజీనామాకు సహేతుక కారణం లేకపోతే, వారికి చాన్సలర్ నచ్చ చెప్పి, ఆ పదవిలో కొనసాగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాల్సి వుంటుంది. అందుకే వీసీల రాజీనామాలను ఆమోదించడం గవర్నర్‌కు ఒక సవాల్ అని చెప్పడం. ప్రభుత్వం మారగానే వీసీలతో బలవంతంగానే మార్పించడం లాంటి చెడు సంప్రదాయానికి గవర్నర్ ముగింపు పలుకుతారా? అనే చర్చకు తెర లేచింది.