రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సమావేశానికి వస్తున్నారని తెలిసి… ఎంపీటీసీలు, జెడ్పీటీసీ గైర్హాజరయ్యారు. దీంతో వారిపై మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సిగ్గు శరం లేవా? అని ఆయన ఫైర్ అయ్యారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లిలో చోటు చేసుకుంది.
ఆదివారం సంబేపల్లి మండల సర్వసభ్య సమావేశాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి వస్తున్నారని తెలిసి వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టారు. దీంతో అధికారులు మినహాయించి ప్రజాప్రతినిధులెవరూ లేకపోవడం మంత్రికి కోపం తెప్పించింది. ఇదేమైనా టీడీపీ సమావేశమా… ప్రజాప్రతినిధులు ఎందుకు రాలేదని మంత్రి నిలదీశారు.
గతంలో మండల సమావేశాల్లో అధికారులపై పెత్తనం చెలాయించిన వైసీపీ ప్రజాప్రతినిధులు ఇప్పుడెక్కడ? అని మంత్రి ప్రశ్నించారు. అప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచిన వైసీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సమావేశానికి రాకపోవడానికి సిగ్గుశరం లేవా? అని తీవ్రస్థాయిలో మంత్రి విరుచుకుపడ్డారు. మండలాభివృద్ధి కోసం సర్వసభ్య సమావేశం నిర్వహిస్తే, రాకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
ఏ ప్రభుత్వం ఉన్నా, మండలాభివృద్ధికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. టీడీపీని ఆదరించిన సంబేపల్లి మండలాన్ని అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని ఆయన అన్నారు.