ఏపీ ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఎందుకనో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. చంద్రబాబుకు దూరం… దూరం అన్నట్టుగా పవన్ వైఖరి వుందని జనసేన నాయకులు కూడా అంటున్న మాట. అందుకే విభజన సమస్యలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులతో నిర్వహించిన కీలక సమావేశానికి పవన్‌కల్యాణ్ వెళ్లకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
సీఎం తర్వాతి స్థానంలో ఉన్న పవన్‌కల్యాణ్‌ను చంద్రబాబు దూరం పెట్టారా? లేక ఆయన దూరంగా ఉన్నారా? అనే చర్చ విస్తృతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.
ఆస్తుల పంపకాలపై ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ జోక్యం చేసుకోవాలని చలసాని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అదానీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేస్తోందని సంచలన ఆరోపణ చేశారు. ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. గుజరాత్ పాలకుల కాళ్ల కింద తెలుగు రాష్ట్రాలు ఉండాలా? అని చలసాని శ్రీనివాస్ నిలదీశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపై వుందని ఆయన గుర్తు చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల ఆస్తులు, ఇతరత్రా సమస్యల పరిష్కారం కోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కమిటీ వేయాలని కోరితే, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోలేదని ఆయన నిలదీశారు.
ఇదిలా వుండగా గతంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులపై నిగ్గు తేల్చేందుకు పవన్‌కల్యాణ్ స్టడీ చేశారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ఆయన సమావేశమై, విభజన సమస్యలపై చర్చించారు. అందుకే తెలంగాణ సీఎంతో చర్చ సందర్భంలో పవన్‌ను తీసుకెళ్లకపోవడంపై చలసాని ప్రశ్నించడం వెనుక సంథింగ్… సంథింగ్ అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.