ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు వెళ్లారు. తెలంగాణ టీడీపీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మళ్లీ టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. టీడీపీ నాయకులు వెళ్లారే తప్ప, కార్యకర్తలు మాత్రమే పార్టీతోనే వుండారని ఆయన చెప్పారు. ఆంధ్ర రాజకీయాలపై కూడా ఆయన అద్భుత కామెంట్స్ చేశారు.
వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని టీడీపీతో జనసేన, బీజేపీ వచ్చి కలిశాయని సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకూ జనసేన, బీజేపీలను చంద్రబాబు కలుపుకెళ్లారని ఏపీ ప్రజలు అనుకుంటున్నారు. జగన్‌ను ఒంటరిగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు టీడీపీకి, చంద్రబాబుకు లేవని ఇప్పటికీ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వనని పవన్‌కల్యాణ్ పదేపదే అన్న మాట నిజమే.
కానీ ఈ దఫా అధికారంలోకి రావడం టీడీపీ భవిష్యత్ దృష్ట్యా అత్యవసరం. ఏ రకంగా చూసినా జనసేన, బీజేపీలతో చంద్రబాబుకు రాజకీయ అవసరం వుంది. అందుకే ఒన్‌సైడ్ లవ్ వల్ల ప్రయోజనం లేదని జనసేనను దృష్టిలో పెట్టుకుని కుప్పంలో చంద్రబాబు ఒక సందర్భంలో అన్నారు. పవన్‌తో పొత్తు కోసం చంద్రబాబు స్నేహహస్తం చాచారు. చంద్రబాబుతో పొత్తు కుదుర్చుకోడానికి బీజేపీకి ఏ మాత్రం ఇష్టం లేదని పవన్‌కల్యాణ్ బహిరంగంగా ప్రకటించారు. టీడీపీతో పొత్తు కుదర్చడానికి బీజేపీ పెద్దలతో చీవాట్లు తినాల్సి వచ్చిందని ఆయన నిర్మొహమాటంగా చెప్పారు.
చంద్రబాబుకు జనసేన, బీజేపీలతో రాజకీయ అవసరం తీరింది. కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రభుత్వ ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో పవన్‌కల్యాణ్, బీజేపీ నేతలతో తన దగ్గరికి వచ్చారనడంపై ఆ రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు. తమను కరివేపాకులా వాడుకుని, ఇప్పుడు కించపరిచేలా మాట్లాడ్డం ఏంటని జనసేన, బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.