శ్రీవాణి చుట్టూ టీడీపీ రాజ‌కీయం… బూమ‌రాంగ్‌!

జ‌గ‌న్ స‌ర్కార్ హ‌యాంలో  తిరుమ‌ల‌లో సామాన్య భ‌క్తుల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌నే విమ‌ర్శ బ‌లంగా వుంది. ముఖ్య‌మంత్రిగా నారా చంద్ర‌బాబునాయుడు బాధ్య‌త తీసుకున్న వెంట‌నే తిరుమ‌ల‌కు వెళ్లారు. తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శ‌నం చేసుకున్న అనంత‌రం మీడియాతో…

జ‌గ‌న్ స‌ర్కార్ హ‌యాంలో  తిరుమ‌ల‌లో సామాన్య భ‌క్తుల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌నే విమ‌ర్శ బ‌లంగా వుంది. ముఖ్య‌మంత్రిగా నారా చంద్ర‌బాబునాయుడు బాధ్య‌త తీసుకున్న వెంట‌నే తిరుమ‌ల‌కు వెళ్లారు. తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శ‌నం చేసుకున్న అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ ఇక్క‌డి నుంచే రాష్ట్రంలో సంస్క‌ర‌ణ‌లు తీసుకొస్తామ‌ని ఘ‌నంగా చెప్పారు. నిజ‌మే అని జ‌నం న‌మ్మారు.

అయితే చంద్ర‌బాబు చెప్పింది, తిరుమ‌ల‌లో జ‌రుగుతున్న‌ది వేరు. సామాన్య భ‌క్తుల‌కు ద‌ర్శ‌న భాగ్యం క‌లిగించ‌కుండా, శ్రీ‌వాణి పేరుతో ఇష్టానుసారం టికెట్లు అమ్ముకున్నార‌ని ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కూ టీడీపీ, జ‌న‌సేన నేత‌లు విమ‌ర్శించారు. శ్రీ‌వాణి ద్వారా వ‌చ్చిన సొమ్మంతా ప‌క్క‌దారి ప‌ట్టింద‌ని జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. ప‌వ‌న్ విమ‌ర్శ‌లు తీవ్ర వివాదాస్ప‌ద‌మయ్యాయి.

అయితే ప‌వ‌న్ విమ‌ర్శ‌ల్లో నిజం లేద‌ని తిరుప‌తికి చెందిన బీజేపీ నాయ‌కుడు భానుప్ర‌కాశ్‌రెడ్డి మీడియా ముందుకొచ్చి మ‌రీ ఖండించారు. అప్ప‌ట్లో భానుపై స్థానిక జ‌న‌సేన నాయ‌కులు భ‌గ్గుమ‌న్నారు. శ్రీ‌వాణిపై గ‌తంలో జ‌రిగింది ఇదీ. అయితే ప్ర‌స్తుతం శ్రీ‌వాణిలో అవ‌క‌త‌వ‌క‌లపై విజిలెన్స్ క్షుణ్ణంగా త‌నిఖీలు చేస్తోంది.

ఈ నేప‌థ్యంలో శ్రీ‌వాణిపై ఆస‌క్తిక‌ర విష‌యాలు విజిలెన్స్ త‌నిఖీలో వెలుగు చూసిన‌ట్టు స‌మాచారం. 2019 ఎన్నిక‌ల ముందు నాటి టీటీడీ చైర్మ‌న్ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ నేతృత్వంలోని పాల‌క మండ‌లి శ్రీ‌వాణి ద‌ర్శ‌నంపై తీర్మానం చేసింది. అయితే ఎన్నిక‌లు రావ‌డంతో అది అమ‌లుకు నోచుకోలేదు. ఆ త‌ర్వాత వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం శ్రీ‌వాణి అమ‌లు చేప‌ట్టింది.

తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌గ్గ‌ర‌గా ద‌ర్శించుకోవాల‌ని భ‌క్తులు కోరుకుంటారు. అయితే అంద‌రూ సిఫార్సు లేఖ‌లు సంపాదించుకునే వెస‌లుబాటు వుండ‌దు. అలాంటి వారు శ్రీ‌వాణి కింద రూ.10,500 చెల్లించి బ్రేక్ ద‌ర్శ‌నం చేసుకుంటారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వ హ‌యాంలో శ్రీ‌వాణి టికెట్ల‌ను ఆఫ్‌లైన్‌లో మొద‌ట రోజుకు దాదాపు 1000 జారీ చేసేవారు. అయితే ఆ త‌ర్వాత రోజుల్లో సాధార‌ణ భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేసేందుకు శ్రీ‌వాణి టికెట్ల‌ను స‌గానికి స‌గం త‌గ్గించారు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వ హ‌యాంలో శ్రీ‌వాణి టికెట్ల‌ను ఇష్టానుసారం అమ్మార‌ని, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సు లేఖ‌ల‌కు పెద్ద ఎత్తున ద‌ర్శ‌నాలు క‌ల్పించార‌ని టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. సంస్క‌ర‌ణ‌లు తీసుకొస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పిన నేప‌థ్యంలో అద్భుతాలేవో జ‌రుగుతాయ‌ని అంతా భావించారు.

కానీ ఆచ‌ర‌ణ మాత్రం వేరుగా వుంది. శ్రీ‌వాణి టికెట్ల‌ను గ‌తం కంటే ఎక్కువ‌గా దాదాపు 1100కు పైగా రోజుకు విక్ర‌యిస్తున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అలాగే చంద్ర‌బాబునాయుడి బామ్మ‌ర్ది నంద‌మూరి బాల‌కృష్ణ శ్రీ‌వాణి ట్ర‌స్ట్ నిధుల్ని త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో ఆల‌యాల నిర్మాణాల‌కు ఇవ్వాల‌ని సిఫార్సు లేఖ‌లు ఇస్తున్న‌ట్టు తెలిసింది. దీన్ని త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. కానీ ఎవ‌రినో ఇరికించ‌డానికి శ్రీ‌వాణి ట్ర‌స్ట్‌ను వివాదం చేసి, ఇప్పుడు వాళ్లే దోషిగా నిల‌బడే ప‌రిస్థితి వ‌చ్చింది. ఎందుకంటే శ్రీ‌వాణి ట్ర‌స్ట్‌ను ప్రారంభించ‌డానికి తీర్మానించింది పుట్టా సుధాక‌ర్ నేతృత్వంలోని పాల‌క మండ‌లే.