దర్శకుడు రాజమౌళి మీడియా స్ట్రాటజీ వేరుగా వుంటుంది. సినిమా ఆరంభం ముందు ఓ మీడియా మీట్ పెడతారు. అంతే ఆ తరువాత మరేం వుండదు. సినిమా విడుదలకు ముందు మళ్లీ ఓసారి తెలుగు మీడియాను సామూహికంగా కలుస్తారు. సుమతో ఓ ఇంటర్వూ లేదా తనే తన హీరోలతో ఇంటర్వూ చేస్తారు. అంతే.. ఇక మిగిలిందంతా బాలీవుడ్ లోనే. బాలీవుడ్ లో ఇవ్వగలిగినన్ని ఇంటర్వూలు ఇస్తారు. బాలీవుడ్ క్రిటిక్స్ కు ముందుగా సినిమా చూపిస్తారు. బాలీవుడ్ క్రిటిక్స్ చేత ట్వీట్ లు వేయిస్తారు. తెలుగు మీడియా ఫీలవకుండా జస్ట్ ఒక మీట్ మాత్రం వుంటుంది.
ఇప్పుడు నాగ్ అశ్విన్ కూడా అదే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. సినిమా విడుదలకు ముందు ఆయన అస్సలు తెలుగు మీడియాను కలవనే లేదు. విడుదలైన వారం తరువాత ముంబాయి వెళ్లి వీలయినన్ని వన్ టు వన్ ఇంటర్వూలు ఇచ్చి వచ్చారు. అలా వస్తూనే మళ్లీ తెలుగు మీడియా జనాలు ఎక్కడ ఫీలవుతారో అని ఓ సామూహిక మీడియా పేరంటం పెట్టేసారు. అక్కడితో సరి.
మరి వన్ టు వన్ తెలుగు మీడియాకు లేదా అంటే పీఆర్ టీమ్ నుంచి వచ్చిన సమాధానం గమ్మత్తు గా వుంది. ఇక్కడ ఇంటర్వూలు ఇవ్వడం మొదలుపెడితే 50 మందికి ఇవ్వాలి. అయ్యే పని కాదు. కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకుంటే అదో తలనొప్పి. అందువల్ల మొత్తానికే లేకుండా చేసారన్న మాట. నేషనల్ మీడియాలో అరడజను మందికి ఇస్తే మిగిలిన వారు ఏమీ అనుకోరు అన్నమాట. ఇక్కడ మాత్రం అలా కాదన్న మాటేగా.
మొత్తం మీద మన నాగ్ అశ్విన్ ఇంటర్వూలను మనం ఇంగ్లీష్ లో చూసి తరించాల్సిందే.