ఎమ్బీయస్‍: బిహార్‌లో ఎన్డీఏ విజయం ఎవరి ఖాతాలో?

ఫలితాలు వెలువడిన నెల్లాళ్ల తర్వాత కూడా యింకా యీ విశ్లేషణలేమిటి? తెలుసుకోవడం దండగ అనుకునేవారు యీ వ్యాసపరంపరను చదవనక్కర లేదు. ఏ ఫలితం ఎందుకు, ఎలా వచ్చిందో తెలుసుకుందా మనుకునేవారు మాత్రమే ముందుకు సాగండి.…

ఫలితాలు వెలువడిన నెల్లాళ్ల తర్వాత కూడా యింకా యీ విశ్లేషణలేమిటి? తెలుసుకోవడం దండగ అనుకునేవారు యీ వ్యాసపరంపరను చదవనక్కర లేదు. ఏ ఫలితం ఎందుకు, ఎలా వచ్చిందో తెలుసుకుందా మనుకునేవారు మాత్రమే ముందుకు సాగండి. మన తెలుగు మీడియా పక్క రాష్ట్రాల న్యూస్‌ను పెద్దగా కవర్ చేయదు. ఎన్నికల సమయంలో మాత్రమే అక్కడి సమస్యలు, పరిస్థితులు అవీ కవర్ చేస్తుంది. అయితే వాటి పూర్వాపరాలు చెప్పకుండా, ఖండఖండాలుగా అందిస్తుంది. వాటన్నిటినీ ఒక చోట కూర్చి అర్థం చేసుకోవడం పెద్ద పనే. నేను ఆ సమయంలో ఒకటి రెండు రాష్ట్రాల గురించి తప్ప తక్కిన వాటి గురించి పెద్దగా రాయలేదు, సమయాభావం వలన! ఫలితాల విశ్లేషణ అనే పేరుతో ఆ రాష్ట్రాల స్థితిగతులను తెలుసుకుంటే రాబోయే ఎన్నికలలో అవి ఎటు ఓటేస్తాయో అర్థం చేసుకోవడానికి యీ వ్యాసాలు పనికి వస్తాయని నా లెక్క.

తూర్పు ప్రాంతంతో మొదలు పెట్టి బెంగాల్ గురించి రాశాను. దాని తర్వాత పెద్ద రాష్ట్రమైన బిహార్ గురించి యిప్పుడు రాస్తున్నాను. బిహార్ విశ్లేషకులను తికమక పెట్టింది. నీతీశ్ పిల్లిమొగ్గలను చూసి అసహ్యించుకుని ప్రజలు బుద్ధి చెప్తారని కొందరన్నారు. కులగణన చేపట్టాడు కాబట్టి శభాషంటాడని మరి కొందరన్నారు. జనాభాలో ముస్లింల శాతం ఎక్కువ కాబట్టి వారు సిఏఏ, ముస్లిం రిజర్వేషన్ రద్దు వంటి బిజెపి పాలసీలకు వ్యతిరేకంగా ఎన్డీఏను ఓడిస్తారని కొందరన్నారు. ఎన్డీఏలో భాగస్వాములైన నీతీశ్, చిరాగ్ పాశ్వాన్‌ల మధ్య పొసగదు కాబట్టి, అవతల తేజస్వి దూసుకు పోతున్నాడు కాబట్టి, భారత్ జోడో తర్వాత రాహుల్ యిమేజి మెరుగైంది కాబట్టి, ఎన్డీఏకు భారీగా సీట్లు తగ్గుతాయని అంచనాలు వేశారు. స్థానిక నాయకుల బలాబలాలతో పని లేదని, మోదీ యిమేజే అందర్నీ గట్టెక్కిస్తుందని యింకొందరు జోస్యం చెప్పారు.

ఈ ఎన్నికలలో ప్రీ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా అన్నీ తప్పినా, యోగేంద్ర యాదవ్ ఒక్కడు మాత్రమే ఏ సర్వేలు చేయకుండా జనంలో తిరిగి కరక్టుగా గెస్ చేశాడని అందరూ మెచ్చుకున్నారు. కానీ అతను కూడా బిహార్, యుపిల విషయంలో తన అంచనా తప్పిందని చెప్పుకున్నాడు. బిహార్‌లో ఎన్డీఏకు తను అనుకున్న దానికంటె ఎక్కువ వచ్చాయని, యుపిలో అనుకున్న దాని కంటె తక్కువ వచ్చాయని, అలా ఆ రెండు పొరపాట్లు ఒకదాన్ని మరొకటి కాన్సిల్ చేసుకుని ఫైనల్‌గా తను చెప్పిన అంకెకు ఎన్డీఏ చేరుకుందని అతను వివరించాడు. బిహార్ ఫలితాలను ఊహించడం అంత క్లిష్టంగా ఎందుకు మారిందని తెలుసుకోవడం అవసరం.

ఎందుకంటే కొత్త ప్రభుత్వం మనుగడకు చంద్రబాబు లాగానే, నీతీశ్ మద్దతు కూడా కీలకంగా మారింది. చంద్రబాబు ఏ షరతులూ పెట్టడం లేదు, బిజెపి ఏ విధానాన్నీ వ్యతిరేకించడం లేదు. కానీ నీతీశ్ మాత్రం బిహార్ ప్రత్యేక హోదా గురించి, ముస్లిం ప్రయోజనాలను కాపాడడానికి బిజెపి ముందు షరతులు పెడుతున్నాడు. 2025 నవంబరులో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తను కాకపోతే తన పార్టీ ఐనా గెలవడానికి ‘బిహార్ ప్రయోజనాలు కాపాడుతున్నా’ అనే నినాదం యిస్తూ ఎన్డీఏ కూటమిలోంచి బయటకు వెళ్లి ఆర్జెడితో కలిసినా ఆశ్చర్య పడనక్కర లేదు. నీతీశ్‌కు యిది వెన్నతో పెట్టిన విద్య. అలాటి పరిస్థితుల్లో ఏం జరగవచ్చు? స్థానిక నాయకుల బలం మీద బిజెపి గెలవగలదా? అనే ప్రశ్న మనకు కలుగుతుంది. దానికి సమాధానం కావాలంటే బిహార్‌లో ఉన్న పార్టీల బలాబలాలు తెలుసుకుని తీరాలి.

ముందుగా యీ ఎన్నికలలో ఫలితాలు ఎలా వచ్చాయో తెలుసుకుందాం. అక్కడ మొత్తం ఎంపీ స్థానాలు 40. 2019లో 39 స్థానాలను ఎన్డీఏ గెలుచుకుంది. దాని భాగస్వాములైన బిజెపికి 17, జెడియుకి 16, రాం విలాస్ పాశ్వాన్ ఎల్‌జెపికి 6 వచ్చాయి. కాంగ్రెసుకి 1 దక్కింది. ఈసారి కూడా ఎన్డీఏలో బిజెపి, జెడియు ఉన్నాయి. రాం విలాస్ మరణానంతరం ఎల్జెపి రెండుగా చీలి, దాని లోని చిరాగ్ వర్గం (ఎల్జెపి-ఆర్‌వి) ఎన్డీఏలో కొనసాగింది. జితన్ రామ్ మాఝీ పార్టీ ఐన హేమ్ (హిందూస్తానీ అవామీ మోర్చా- సెక్యులర్),  ఉపేంద్ర కుశావహా నాయకత్వం లోని రాష్ట్రీయ లోక్ మోర్చా ఆర్ఎల్ఎమ్( దీని పాత పేరు ఆర్‌ఎల్ఎస్‌పి (రాష్ట్రీయ లోక సమతా పార్టీ) ప్రతిపక్ష కూటమి నుంచి విడిపోయి వీరితో చేరాయి.

అయినా ఎన్డీఏకు 10 సీట్లు తగ్గాయి. బిజెపి 5 సీట్లు, జెడియు 4, ఎల్జెపి 1 పోగొట్టుకున్నాయి. ఆర్జెడి నాయకత్వంలోని కూటమికి 9 వచ్చాయి, ఒక కాంగ్రెసు రెబెల్ గెలిచాడు. అనేక కేసులు నెత్తి మీద ఉన్న వివాదాస్పదుడు కాంగ్రెసు నాయకుడు పప్పూ యాదవ్ పూర్ణియా నుంచి కాంగ్రెసు తనకు టిక్కెట్టు యివ్వకపోవడంతో స్వతంత్రుడిగా పోటీ చేసి గెలిచాడు.  ఈ విధంగా 47% ఓట్లు, 75% సీట్లు తెచ్చుకున్న ఎన్డీఏ, గతంలో కంటె 6% ఓట్లు, 8 సీట్లు ఎక్కువగా తెచ్చుకున్న ఇండియా కూటములు రెండూ ఒకందుకు సంతోషించాయి, మరొకందుకు ఖేదపడ్డాయి.

ఎన్డీఏ పార్టీల విషయానికి వస్తే – బిజెపి 17 సీట్లు పోటీ చేసి 12 సీట్లు, 20.5% (గతంలో కంటె 3.5% తగ్గాయి) ఓట్లు తెచ్చుకుంది. జెడియు 16 సీట్లు పోటీ చేసి 12 సీట్లు, 18.5% (గతంలో కంటె 3.7% తగ్గాయి) ఓట్లు తెచ్చుకుంది. ఎల్జెపిఆర్‌వి 5 సీట్లు పోటీ చేసి 5 సీట్లు, 6.5% (గతంలో ఎల్జెపి కంటె 1.4% తగ్గాయి) ఓట్లు తెచ్చుకుంది. హేమ్ ఒకటి పోటీ చేసి, దాన్ని గెలిచింది. ఆర్ఎల్ఎమ్ ఒక స్థానంలో పోటీ చేసి, ఓడిపోయింది.

ఇండియా కూటమి పార్టీలకు వస్తే – ఆర్జెడి 23 సీట్లు పోటీ చేసి 4 సీట్లు (గతంలో 0), 22.1% (గతంలో కంటె 6.5% పెరిగాయి) ఓట్లు తెచ్చుకుంది. కాంగ్రెసు 9 సీట్లు పోటీ చేసి 3 సీట్లు (గతంలో 1), 9.2% (గతంలో కంటె 1.4% పెరిగాయి) ఓట్లు తెచ్చుకుంది. సిపిఎంఎల్-ఎల్(లిబరేషన్) 3 సీట్లు పోటీ చేసి 2 (గతంలో 0) సీట్లు, 3.0% (గతంలో కంటె 1.6% పెరిగాయి) ఓట్లు తెచ్చుకుంది. వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ 3 పోటీ చేయగా, సిపిఐ, సిపిఎం చెరోటీ పోటీ చేశాయి. వీటికి ఏ సీటూ దక్కలేదు.

ఈ పార్లమెంటు ఫలితాలను అసెంబ్లీ సెగ్మెంట్లగా అనువదించి చూస్తే మొత్తం 243 సెగ్మెంట్లలో జెడియు 74టిలో (ప్రస్తుతం అసెంబ్లీలో దాని బలం 45), బిజెపి 67టిలో (78), ఎల్జెపిఆర్వీ 29టిలో (0), హేమ్ 4టిలో (4) బలంగా ఉంది. అంటే ప్రస్తుతం 127 మంది ఎమ్మెల్యేలున్న ఎన్డీఏకు 174 సెగ్మెంట్లలో బలం ఉందన్నమాట. ఇక ఇండియా కూటమి పక్షాలకు వస్తే ఆర్జెడి 36టిలో (79), కాంగ్రెసు 12టిలో (19), సిపిఎంఎల్-ఎల్ 12టిలో (12), సిపిఐ 1 దానిలో (2), సిపిఎం 0 వాటిలో (2), విఐపి 1 దానిలో (0) బలంగా ఉన్నాయి. అంటే ప్రస్తుతం 114 మంది ఎమ్మెల్యేలున్న ఇండియా కూటమి 62 సెగ్మెంట్లలో మాత్రమే బలంగా ఉంది. అసెంబ్లీ నాటికి మోదీ ఫ్యాక్టర్, జాతీయ సమస్యల ప్రాధాన్యత తగ్గుతుంది కాబట్టి పరిస్థితి వేరేలా ఉండవచ్చు. ముఖ్యంగా నీతీశ్ ఎవరితో చేతులు కలుపుతాడనేది కూడా ముఖ్యాంశమౌతుంది.

దేశ రాజకీయాలు మోదీ చుట్టూ తిరిగినట్లే బిహార్ రాజకీయాలు నీతీశ్ చుట్టూ తిరుగుతున్నాయనేది వాస్తవం. విమర్శకులు అతన్ని ‘పల్టూ రామ్’ (పిల్లిమొగ్గలు వేసేవాడు) అని వెక్కిరించవచ్చు కానీ చాలా మంది ప్రజలు మాత్రం అతన్ని ‘సుశాసన్ బాబు’ (మంచి పరిపాలన అందించేవాడు)గా, మహిళలకు శక్తి సమకూర్చేవాడిగా గుర్తు పెట్టుకుంటున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికలలో జెడియు 43 సీట్లతో మూడో స్థానంలో (మొదటి స్థానం ఆర్జెడిది కాగా, రెండో స్థానం బిజెపిది) నిలిచింది కాబట్టి అతని పని ఆఖరు అనుకున్నవాళ్లు యీ ఫలితాలను చూసి నోరు వెళ్లబెట్టారు. ఎందుకంటే ఆ రెండు పార్టీల కంటె జెడియు స్ట్రయిక్ రేటు బాగుంది.

ఈ జనవరిలో నీతీశ్ ఎన్డీఏకు తిరిగి రావడంలో చాలా లెక్కలే ఉన్నాయి. ఇండియా కూటమిలో ముఖ్య భాగస్వామిగా ఉందామనుకున్నా కాంగ్రెసు తన స్థాయిని తగ్గిస్తోందని అతనికి తెలిసి పోయింది. ఇటు చూస్తే రాష్ట్ర బిజెపి తనను దగ్గరకు తీసుకోవడానికి సుముఖంగా లేదు. దాని అధ్యక్షుడు సామ్రాట్ చౌధురి నీతీశ్‌ని గద్దె నుంచి దింపేదాకా తలపాగా తీయనని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. ఆర్జెడితో తెంపుకుంటే వాళ్ల దగ్గరున్న 32% ముస్లిం-యాదవ్ ఓటు బ్యాంకు చేజార్చుకున్నట్లే అని సొంత పార్టీ నాయకులు హెచ్చరించారు. అయినా క్షేత్రస్థాయి నుంచి రిపోర్టులు తెప్పించుకుని చూస్తే ఆర్జెడితో కలవడం వలన ఒనగూడే లాభం లేదని నీతీశ్‌కు తెలిసింది. ఎందుకంటే తనకు మద్దతుగా నిలిచే 36% ఇబిసిలు (అత్యంత వెనకబడిన కులాలు) ఆధిపత్య ధోరణి కల ఆర్జెడీ యాదవులతో కలిసి ఒకే ఛత్రం కిందకు రావడం అసంభవం అనిపించింది.

ఇబిసిలకు తోడు నీతీశ్‌కు చాలాకాలంగా మహాదళితులు అండగా నిలబడ్డారు. వాళ్లతో పాటు మహిళలు కూడా. తను పాల్గొన్న 65 సమావేశాల్లో ప్రతి దానిలోనూ నీతీశ్ తను పంచాయితీలలో, అర్బన్ స్థానిక సంస్థలలో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించానని గుర్తు చేశాడు. ప్రభుత్వోద్యోగాలలో మహిళా రిజర్వేషన్ 35%కు పెంచాననీ, వారిలో విద్యార్హత పెంచడానికి స్కూలుకెళ్లే బాలికలకు సైకిళ్లు యిచ్చాననీ, అక్షరాస్యత పెరగడంతో జనాభా నియంత్రణ విధానాలను వారు అలవర్చుకున్నారనీ నొక్కి చెప్పాడు. ఇవన్నీ ఎవరూ కాదనలేనివి. దాంతో మహిళలు నీతీశ్‌కు మద్దతుగా నిలబడ్డారు.

తనకున్న బలంతో బిజెపితో చేతులు కలిపితే బిజెపి అగ్రవర్ణాలను తెస్తుంది. బిజెపితో పాటు ఉన్న పాశ్వాన్ తన దళిత కులస్తులను తీసుకుని వస్తాడు. మొత్తమంతా కలిస్తే 50% దాకా ఓట్లు సంపాదించవచ్చు అని అనుకున్నాడు. చివరకు ఎన్డీఏ కూటమికి 47% ఓట్లు రాగా, ఇండియా కూటమికి 34% మాత్రమే వచ్చాయి. ఈ తేడా కారణంగా ఎన్డీఏకు 21 సీట్లు ఎక్కువగా వచ్చాయి. బిజెపి మోదీపైనే భారం వేసి, అభ్యర్థుల ఎంపిక సరిగ్గా చేయకపోవడంతో ఎక్కువ సీట్లు గెలుచుకోలేక పోయింది. సుశీల్ మోదీ మరణం తర్వాత స్థానికంగా బలమైన బిజెపి నాయకుడు ఎవరూ లేకుండా పోయారు. ఉప ముఖ్యమంత్రులుగా ఉన్న సామ్రాట్ చౌధురి, విజయ్ కుమార్ సిన్హా తమ కుశావహా, భూమిహార్ కులస్తుల ఓట్లు తేలేకపోయారు.

తేజస్వి 251 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నాడు. నడుం పడిపోవడంతో బెల్టు పెట్టుకుని, వీల్ ఛెయిర్‌లో కూర్చునీ ప్రచారం చేశాడు. మ్యాప్ కనుక చూస్తే పశ్చిమ బిహార్‌లో మహాగఠ్‌ బంధన్ బలంగా ఉన్నట్లు తోస్తుంది. మళ్లీ తూర్పున కాంగ్రెసు బలంగా ఉంది. మధ్యలో ఎన్డీఏ పక్షాలదే హవా. బిజెపి పోగొట్టుకున్న స్థానాల్లో బక్సర్, ఔరంగాబాద్, పాటలీపుత్ర (ఇక్కడ లాలూ కూతురు మీసా భారతి నెగ్గింది. ఆమె ప్రత్యర్థి ఒకప్పుడు ఆర్జెడి నాయకుడిగా ఉండి బిజెపికి ఫిరాయించిన రామ్ కృపాల్ యాదవ్) ఆర్జెడి ఖాతాలో పడ్డాయి. బిజెపి పోగొట్టుకున్న మరో రెండు స్థానాలు ఆరా, ససారాం సిపిఐఎంఎల్-ఎల్ ఖాతాలో పడ్డాయి. విడివిడిగా చూస్తే అన్ని పార్టీల కంటె ఆర్జెడికే ఎక్కువ ఓట్ల శాతం (22.1) వచ్చింది. 2019లో నుంచి 2024కి 6.5% ఎక్కువ తెచ్చుకోవడం గొప్పే!

తేజస్వికి కానీ, అఖిలేశ్‌కు కానీ పెద్ద గుదిబండ ఏమిటంటే వాళ్ల తండ్రులు పాలించిన తీరు! ‘ఆర్జెడికి ఓటేస్తే మళ్లీ జంగిల్ రాజ్ వస్తుంది చూస్కోండి’ అని ఎన్డీఏ బెదిరించ గలిగింది. యుపిలో కూడా ‘ఎస్పీకి ఓటేస్తే గూండా రాజ్యం తిరిగి వస్తుంది’ అనే ప్రచారం జరిగింది. ములాయం కాలంలోనే కాదు, అఖిలేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కూడా గూండా రాజ్యం నడిచింది. ఎందుకంటే పేరుకి అఖిలేశ్ ముఖ్యమంత్రే కానీ, ములాయం, అతని యితర బంధువులే రాజ్యం చేశారు. రెండున్నరేళ్లు గడిచాక, అఖిలేశ్ మేలుకొని కట్టడి చేయబోయాడు కానీ అది పెద్దగా ఫలించలేదు. ‘యోగి ఆదిత్యనాథ్ వచ్చాక శాంతిభద్రతలు నెలకొన్నాయి, గూండాలు జైలుకి వెళ్లారు’ అనే పాయింటుపై బిజెపి యుపిలో ఆ మాత్రమైనా సీట్లు తెచ్చుకోగలిగింది. అక్కడ అఖిలేశ్ పఠించిన పిడిఏ (పిఛ్‌డా – వెనకబడినవాళ్లు, దళిత్, అల్పసంఖ్యక్- మైనారిటీలు) మంత్రం ఫలించి, మతవాదాన్ని కులవాదాన్ని జయించింది.

బిహార్ విషయానికి వస్తే తేజస్వి ముఖ్యమంత్రిగా ఎప్పుడూ లేడు కానీ అతని తండ్రి లాలూ ఉండగా అక్షరాలా ఆటవిక పాలన సాగింది. ఆ పాపాన్ని తేజస్వి భరించాల్సి వచ్చింది. నీతీశ్ పాలనలో శాంతిభద్రతలు చాలా బాగుపడ్డాయి. ఎన్నికల ప్రచారసభల్లో ‘ప్రస్తుత స్థితి కొనసాగాలా? పాతకాలం నాంటి అంధయుగాలకు వెళ్లాలా?’ అనే ప్రశ్న సంధించడంతో ఆ కాలం గురించి పెద్దగా తెలియని యువత కూడా భయపడ్డారు. అందువలన తేజస్వి పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు. అతను పఠించిన బాప్ (బహుజన్, అగడా (అగ్రవర్ణాలు), ఆధీ ఆబాదీ (జనాభాలో సగం అనగా మహిళలు) పూర్ (పేదలు) మంత్రం పారలేదు. ఇతను అగ్రవర్ణాలను కలుపుకుందామని చూసినా, వాళ్లు కలిసి రాలేదు. యుపిలో అయితే అగ్రవర్ణాల్లో కొంతమంది బిజెపిని వీడి కాంగ్రెసు – ఎస్పీ కూటమి వైపు వచ్చారు. ఇక్కడ మాత్రం బిజెపితోనే ఉన్నారు.

బిహార్‌లో జరిగిన తాజా కులగణన ప్రకారం ఇబిసిలు 36%, దళితులు 14.6%, యాదవులు 14.3%, ముస్లిములు 17% ఉన్నారు. జనాభాలో 3.5% ఉన్న కుశావహా (కోయిరీ అని కూడా అంటారు)లలో కొందరు ఆర్జెడి వైపు వచ్చారు. గతంలో వాళ్లు జనాభాలో 2.9% ఉన్న కూర్మీలతో కలిసి ఉండి లవకుశు లనిపించుకున్నారు. నీతీశ్‌కు వాళ్ల మద్దతుండేది. ఈసారి వాళ్ల మధ్య విభేదాలు వచ్చాయి. కుశావహాలను ఆర్జెడి కూటమి దువ్వింది. జెడియు ముగ్గురికే టిక్కెట్లివ్వగా, ఇండియా కూటమి 7గురికి యిచ్చింది. వారిలో ముగ్గురు ఆర్జెడి నుంచే! బిహార్‌లో దళితులు మూకుమ్మడిగా ఓటెయ్యరు. ఉపకులాల వారీగా చీలిపోయి, కొందరు అటూ, కొందరు యిటూ ఉంటూంటారు. మోచీ (మాదిగ) కులస్తులు కాంగ్రెసుకు వేస్తూ వచ్చి బియస్పీ వైపు మళ్లారు. ముసాహర్లు జితన్ మాంఝీ పక్షాన నిలుస్తారు. కొన్ని చోట్ల సిపిఎంఎల్‌ను సమర్థిస్తారు.

ఎన్నికలలో అందరి కంటె హీరోలా నిలబడినవాడు దళితుల్లో పాశ్వాన్ (దుశధ్) కులనాయకుడు చిరాగ్ పాశ్వాన్. తను స్వయంగా హాజీపూర్‌లో గెలవడమే కాక, తమకు కేటాయించిన ఐదు స్థానాలూ గెలిచి నూటికి నూరు శాతం స్ట్రయిక్ రేట్ సాధించాడు. 2020లో అతని తండ్రి చనిపోయాక బాబాయి పశుపతి పాశ్వాన్ పార్టీని మొత్తంగా హైజాక్ చేసి, ఐదుగురు ఎంపీలతో సహా బిజెపికి మద్దతిచ్చి కేంద్ర మంత్రి అయిపోయాడు. బిజెపి అతనితో అంటకాగుతూనే చిరాగ్‌ను దువ్వి అతని ద్వారా అసెంబ్లీ ఎన్నికలలో నీతీశ్ పార్టీకి వచ్చే ఓట్లను చీల్చేట్లు చేసింది. 2024 వచ్చేసరికి బాబాయి కంటె అబ్బాయి బలంగా ఉన్నాడని గ్రహించి, బిజెపి చిరాగ్‌ను చేరదీసి, నీతీశ్‌కు నచ్చచెప్పి ఎన్డీఏలో చేర్పించింది. అతనికి జనాభాలో 5.3% ఓట్లున్న పాశ్వాన్‌ల ఓట్లతో పాటు, అన్ని కులాలలోని యువత ఓటేశారని తెలుస్తోంది.

ఎన్నికల అనంతరం జరిగిన లోకనీతి సర్వే ప్రకారం కులాల వారీ ఓటింగు యిలా ఉంది. అగ్రవర్ణాలు ఎన్డీఏకి 53% (గతంలో కంటె 15% తక్కువ), ఇండియా కూటమికి 10% (గతంలో కంటె 2% ఎక్కువ), కుశావహా ప్లస్ కూర్మి ఎన్డీఏకి 67% (గతంలో కంటె 12% తక్కువ), ఇండియా కూటమికి 19% (గతంలో కంటె 9% ఎక్కువ) యాదవులు ఎన్డీఏకి 26% (గతంలో కంటె 8% ఎక్కువ), ఇండియా కూటమికి 73% (గతంలో కంటె 9% ఎక్కువ) ఇతర ఒబిసిలు ఎన్డీఏకి 54% (గతంలో కంటె 21% తక్కువ), ఇండియా కూటమికి 14% (గతంలో కంటె 1% తక్కువ) వేశారు.

పాశ్వాన్‌లు ఎన్డీఏకి 65% (గతంలో కంటె 19% తక్కువ), ఇండియా కూటమికి 35% (గతంలో కంటె 28% ఎక్కువ), ఇతర దళితులు ఎన్డీఏకి 58% (గతంలో కంటె 18% తక్కువ), ఇండియా కూటమికి 42% (గతంలో కంటె 38% ఎక్కువ), ముస్లిములు ఎన్డీఏకి 12% (గతంలో కంటె 6% తక్కువ), ఇండియా కూటమికి 87% (గతంలో కంటె 7% ఎక్కువ) వేశారు. ముస్లిం ఓట్లు చీల్చి, బిజెపికి సాయపడడానికి మజ్లిస్ గట్టిగా ప్రయత్నించ లేదో, ముస్లిములు దాన్ని నమ్మలేదో తెలియదు. అది 11 స్థానాల్లో పోటీ చేసింది. ఒక్కటీ గెలవలేదు. కానీ 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో బలంగా ఉంది. ప్రస్తుతం దానికి ఉన్న ఎమ్మెల్యే ఒకడే.

సర్వేలో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఎన్డీఏకు ఓటేశామని చెప్పినవారిని ‘రాష్ట్ర ప్రభుత్వం పని తీరు నచ్చి వేశారా? కేంద్రం పని తీరు నచ్చి వేశారా?’ అని అడిగితే ‘రాష్ట్రం అని చెప్పినవారు 24%, కేంద్రం అని చెప్పినవారు 18%. మోదీ, నీతీశ్ చేతులు కలిపి ఉండకపోతే ఫలితాలు ఎలా ఉండేవో తెలియదు. గెలుపును మొత్తంగా ఒకరి ఖాతాలో వేయలేము. ఇక మహాగఠ్‌బంధన్ పాశ్వాన్‌లతో సహా అందరు దళితుల్లో తన ఓటింగును గణనీయంగా పెంచుకుంది. అగ్రవర్ణాల అండ సంపాదించు కోలేక పోయింది కాబట్టే వెనకబడింది. లేకపోతే ఎన్డీఏకు యీ స్థాయి విజయం దక్కేది కాదు. లాలూ మొరటుతనం, నీతీశ్ మృదుత్వం మధ్య అగ్రవర్ణాలు దేన్ని ఎంచుకుంటాయో ఊహించడం కష్టం కాదు. తేజస్వి తను తండ్రి కంటె భిన్నమైన వాణ్నని నిరూపించుకునేదాకా అతనికి అవకాశాలు తక్కువే!

– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2024)

[email protected]