మూవీ రివ్యూ: దిల్ రూబ

సినిమాలో ఎక్కడా కూర్చోపెట్టేసే ట్రాక్ కానీ తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ కానీ లేవు.

చిత్రం: దిల్ రూబ
రేటింగ్: 2/5
తారాగణం: కిరణ్ అబ్బవరం, రుక్సర్‌ ధిల్లాన్‌, కాథీ డావిసన్, జాన్ విజయ్, సమ్రాట్, తులసి తదితరులు
సంగీతం: సామ్ సి.ఎస్
నిర్మాతలు: సిద్ధార్థ్ ఆనంద్ కుమార్, జోజో జోస్, రవి, విక్రం మెహ్ర
దర్శకత్వం: విశ్వ కరుణ్
విడుదల: 14 మార్చి 2025

“క” తర్వాత కిరణ్ అబ్బవరం మీద అంచనాలు ఇంకాస్త పెరిగాయి. అతను ఏ సినిమాతో ముందుకొచ్చినా ఏదో ఒక ప్రత్యేకత లేకుండా ఉండదు అనే అభిప్రాయం మొదటి నుంచీ ఉంది. ఈ చిత్రం ట్రైలర్ చూస్తే రొటీన్ కమర్షియల్ సినిమాయే తప్ప కొత్తగా కోరుకునేది ఏదీ ఉండకపోవచ్చు అనే అభిప్రాయం కలుగుతుంది. ఇంతకీ ఎలా ఉందో చూద్దాం.

తన తండ్రి చనిపోవడం, ప్రియురాలు మాగి అలియాస్ మేఘన (కాథీ డావిసన్) హ్యాండివ్వడంతో సిద్ధూ (కిరణ్ అబ్బవరం) జీవితంలో ఎవరికీ సారీ కానీ, థాంక్స్ కానీ చెప్పకూడదని నిర్ణయం తీసుకుంటాడు.

జీవితాన్ని మంగళూరు కాలేజీలో ఫ్రెష్ గా మొద‌లుపెడతాడు. అక్కడ అంజలి (రిక్షర్) ప్రేమలో పడతాడు. ఆమె ఒక సి.ఐ కూతురు. కాలేజీలో విక్కీ అనే ఒక రౌడీ స్టూడెంట్ ఉంటాడు. అతనితో సిద్ధూ క్లాష్ అవుతాడు. ఇద్దరూ కొట్టుకుంటారు. సిద్ధూ, అంజలిల ప్రేమ మళ్లీ చిగురించాలని అమెరికాలో ఉన్న మ్యాగీ ఆరునెలల కడుపుతో ఇండియా వచ్చి సిద్ధూతోనే కలిసి ఉంటుంది. ఆమెకి దగ్గరుండి సపర్యలు చేస్తూంటాడు సిద్ధూ. అంతే కాదు ఆమె సిద్ధూ కాలేజ్ లోనే లెక్చరర్ గా చేరుతుంది.

ఇలా సా….గే కథకి ఎండ్ కార్డెప్పుడు పడుతుందో చూడడమే ప్రేక్షకులకి దర్శ‌కుడు పెట్టిన పని.

ఈ కథలో ఎంత నాన్-సింక్ ఉందో వేరే చెప్పక్కర్లేదు. ఎక్కడా ఆర్గానిక్ ఫ్లో లేకుండా, నానా రకాల ట్రాకుల్ని జొప్పించి గందరగోళపరచడమే ఉంది.

సినిమా మొదలైనప్పటినుంచి ఇంటర్వెల్ వరకు మనసుకి హత్తుకోదు. ఇంటర్వల్ అయ్యాక ఇబ్బంది రెండింతలయ్యింది. కథలో తగిన కంటెంట్ లేకుండా, కథనానికి సరిపడా కటౌట్ హీరోకి లేకుండా, దర్శకత్వంలో స్టైలే తప్ప సబ్స్టాన్స్ లేకుండా, ఏ జానర్ చూస్తున్నామో అర్ధం కాకుండా ఉండాలంటే ఈ సినిమా చూస్తే సరిపోతుంది.

థాంక్యూ యూ, సారీ చెప్పడమనే ప్లాట్ పాయింట్; కాలిపోయి తుప్పు పట్టిన బైక్ ని క్లీన్ చేసి బైటకు తెస్తే హీరోయిన్ మళ్లీ కనెక్టవుతుందనుకునే “సర్ప్రైజ్” పాయింట్, జోకర్ అనే డ్రగ్ కింగ్ పిన్ ఎందుకు ఎంటరయ్యాడో తెలియని సస్పెన్స్ పాయింట్, కడుపుతో ఉన్న హీరోగారి “ఎక్స్”, కాలేజీలో లెక్చరెర్ గా వచ్చి అతని ప్రేమని పునరుద్ధరించాలనుకునే సబ్ ప్లాట్ పాయింట్, మధ్యలో కడప బ్యాక్ డ్రాప్… ఇవన్నీ ఎంత ఎమెచ్యురిష్ గా ఉన్నాయంటే చూస్తున్నంతసేపూ సహనాన్ని పరీక్షించాయి.

తాను కూడా కాలేజ్ లవర్ బాయ్ అనిపించుకోవాలని, సాలిడ్ ఫైట్లు చేసే మాస్ హీరో అని పిలిపించుకోవాలని, ఇద్దరు హీరోయిన్ల ముద్దుల హీరోలా కనిపించాలని చేసిన ప్రయత్నంలా ఉంది తప్ప సోల్ ఉన్న కథని ఎంచుకుని ప్రేక్షకులకి కొత్త అనుభూతిని ఇవ్వాలనే ప్రయత్నం మాత్రం కనపడలేదు కిరణ్ అబ్బవరంలో.

ప్రధమార్ధంలో కాలేజ్ లవ్ స్టోరీ, ఫైట్లు లాంటివి ఉంటే; సెకండాఫులో జోకర్ పాత్ర ఎంట్రీతో మొత్తం సినిమా ఆఫ్ ట్రాక్ పట్టింది. టెక్నికల్ గా నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి కానీ కథలో పట్టు లేనప్పుడు ఎన్ని షోకులు చేస్తే మాత్రం ప్రయోజనం ఏముంటుంది?

కిరణ్ అబ్బవరం కి ఈ క్యారెక్టర్ అస్సలు సరిపోలేదు. గట్టిగా అరుస్తూ డైలాగ్ చెప్తున్నప్పుడు ఇంపాక్ట్ కనిపించలేదు. అరవడమే పర్ఫామెన్స్ అనుకుంటున్నాడా అనే అనుమానమొస్తుంది. డ్యాన్సులు ఓకే కానీ.. ఆ రేంజ్ ఫైట్స్ కథకి, తనకి నాన్ సింక్ లా ఉన్నాయి.

రుక్సర్‌ ధిల్లాన్‌ స్క్రీన్ ప్రెజెన్స్ ఓకే కానీ నటించడానికి బలం లేని పాత్ర.

మరో నటి కాథీ డావిసన్ కథకే అడ్డంగా ఉందనిపించిన “ఎక్స్”ట్రా పాత్ర. “పొలం నీది.. విత్తనం నీదు.. కౌలు మాత్రం నన్ను కాయమంటున్నావ్” అని హీరో చేత మ్యాగీ (కాథీ డావిసన్) భర్తతో అనిపించాడంటే ఆ ట్రాక్ ఎంత అర్ధరహితంగా ఉందో దర్శకుడికి కూడా అర్ధమయ్యే ఉంటుంది. అయినా పెట్టాడంటే కథ డిమాండ్ చేయకపోయినా ఫార్ములా డిమాండ్ చేసిందనుకోవాలి.

సినిమా మొత్తంలో ఇరిటేషన్ కి గురి చేసిన కేరక్టర్ ఏదంటే జోకర్ (జాన్ విజయ్). ఇతని ఎంట్రీ నుంచి వేరే సినిమా చూస్తున్న ఫీలింగొస్తుంది.

టాప్ కమెడియన్ సత్య ఉన్నా కూడా అతనిని వాడులేకపోవడం బాధాకరం. కనీసం తన మీద సరైన సీన్లు రాసుకుని ఉన్నా ప్రేక్షకులకి మంచి రిలీఫ్ ఉండేది.

ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ఏకైక పాజిటివ్ ఫ్యాక్టర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. “హే జింగిలి” అనే పాట క్యాచీగా ఉంది.

సినిమాలో ఎక్కడా కూర్చోపెట్టేసే ట్రాక్ కానీ తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ కానీ లేవు. టికెట్ కొని హాల్లోకి వచ్చినందుకు చివరివరకు తెర మీద కదిలే దృశ్యాలు చూడాలంతే. స్టైలిష్ గా కనిపిస్తున్నా కండబలం తప్ప బుద్ధిబలం కనపడని హీరోయిజాన్ని ఇష్టపడేవాళ్లకి ఏమో కానీ తక్కిన ప్రేక్షకులకి మాత్రం కష్టం. కిరణ్ అబ్బవరం సినిమాల్లో ఏదో ఒక వెరైటీ ఉంటుందని ఒక పేరుంది. వ్రతం చెడినా ఫలితం దక్కే విధంగా.. హాల్లో తన సినిమాలు ఆడినా ఆడకపోయినా, మంచి ప్రయత్నమైతే చేస్తాడు అనే మినిమం బ్రాండింగ్ ఉంది. అయితే అది తప్పని నిరూపించుకోవడానికి, తాను కూడా విషయంలేని సినిమాల్లో నటించగలనని చాటుకోవడానికి “దిల్ రూబా” అంటూ గూబ పగలగొట్టే ఈ చిత్రంలో నటించాడేమో అనిపిస్తుంది.

బాటం లైన్: పగిలింది గూబ

3 Replies to “మూవీ రివ్యూ: దిల్ రూబ”

Comments are closed.