నీతులు వల్లిస్తున్న బండి !

ఎమ్మెల్యేలు తాము ఏ పార్టీ టికెట్ మీద గెలిచారో.. ఆ పార్టీని వీడి  మరొక పార్టీలో చేరినప్పుడు వారితో రాజీనామా చేయించి ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి…

ఎమ్మెల్యేలు తాము ఏ పార్టీ టికెట్ మీద గెలిచారో.. ఆ పార్టీని వీడి  మరొక పార్టీలో చేరినప్పుడు వారితో రాజీనామా చేయించి ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటున్నారు.

దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఏ అవకాశం ఉన్నా సరే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను గంపగుత్తగా ఫిరాయింపజేసి, ఉన్న  ప్రభుత్వాలను కూల్చేసి తమ పార్టీని గద్దె మీదకు తీసుకురావడానికి తపన పడుతూ ఉండే భారతీయ జనతా పార్టీ నాయకుడు బండి సంజయ్ ఇలా మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు గా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రత్యేకించి తెలంగాణ రాజకీయాలలో ప్రస్తుతానికి జోరుమీదున్న కాంగ్రెస్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తున్నది. కాంగ్రెస్, బిజెపిలకు ఉమ్మడి శత్రువు అయిన భారాస ఖాళీ అయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తమ పార్టీకి రాజీనామాలు చేస్తూ అందరూ కాంగ్రెస్ వైపు నడుస్తున్నారు. ఈ పరిణామాలు బిజెపికి మింగుడు పడడం లేదు. కొందరైనా తమ పార్టీలోకి వస్తే బాగుంటుందని వారు కోరుకుంటున్నట్టుగా ఉంది.

తెలంగాణలో ఈ ఎన్నికలలోనే అధికారంలోకి వచ్చేయాలని కలలుగన్న బిజెపి ఆ మెజారిటీకి చాలా దూరంలో ఆగిపోయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బిఆర్ఎస్ ను  టార్గెట్ చేశారు. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీని వదిలి కాంగ్రెస్ లో చేరిపోయారు. కొత్తగా బిఆర్ఎస్ ను వదిలిపెడుతున్న వారెవరూ కూడా బిజెపి వైపు నామమాత్రంగా కూడా చూడడం లేదు. ఇలాంటి నేపథ్యంలో బండి సంజయ్ విలువలతో ముడిపడిన డిమాండ్ ని వినిపించడం గమనార్హం.

ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద వేటు వేయడానికి గతంలో చాలా పటిష్టమైన చట్టాలు వచ్చాయి. అయితే వైఫల్యం అంతా ఆచరణలో మాత్రమే ఉంది. సాధారణంగా స్పీకర్లు అధికార పార్టీకి చెందిన వారు మాత్రమే ఉంటారు. ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ఫిరాయించినప్పుడు ఆయా పార్టీలు చేసే ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోకుండా వారు కాలయాపన చేస్తుంటారు.

హైకోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినా కూడా వారు పట్టించుకోకుండా కాలయాపన చేస్తుంటారు. ఏతావతా చట్టం మాత్రం అమలు కావడం లేదు. అందుకే బండి సంజయ్ ఇప్పుడు విలువల రూపంలో మాట్లాడుతున్నారు. ఆయన వల్లిస్తున్న విలువలు, రాజీనామా చేసిన తర్వాతే వేరే పార్టీలోకి వెళ్లాలని అనడం ఇవన్నీ కేవలం తెలంగాణ కు మాత్రమేనా అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

కేంద్రంలో వారి పార్టీనే అధికారంలోకి ఉంది. మూడవ పర్యాయం ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్నారు. అలాంటప్పుడు కేంద్రం ద్వారా ఫిరాయింపులను నిరోధించేందుకు ఒక పటిష్టమైన చట్టమే తీసుకురావచ్చు కదా అనేది ప్రజల అభిప్రాయంగా ఉంది. బండి సంజయ్ ఈ సూక్తులను తెలంగాణకు మాత్రమే చెపుతున్నారా దేశమంతా వర్తిస్తాయని భావిస్తున్నారా అనేది కూడా ప్రశ్నే. ఎందుకంటే బిజెపి అధికారంలో ఉన్న చాలా రాష్ట్రాలలో వారి పార్టీలోకి ఫిరాయింపులు జరుగుతూనే ఉన్నాయి. బండి సంజయ్ కోరిక లో నిజాయితీ ఉంటు గనుక.. కేంద్రం ద్వారా గొప్ప చట్టమే తీసుకురావాలని ప్రజలు అంటున్నారు.