మూవీ రివ్యూ: కోర్ట్

ఎప్పుడూ ఊకదంపుడు కమర్షియల్ కథనాలు కాకుండా కాస్త విషయమున్న ఇలాంటి చిత్రాలు కూడా తెలుగుతెర మీద రావాల్సిన అవసరముంది.

చిత్రం: కోర్ట్
రేటింగ్: 2.75/5
తారాగణం: ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజి, సాయికుమార్, హర్షవర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, రాజసేఖర్ అనింగి తదితరులు
సంగీతం: విజయ్ బుల్గానిన్
కెమెరా: దినేష్ పురుషోత్తమన్
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
రచన-దర్శకత్వం: రాం జగదీష్
విడుదల: మార్చ్ 14, 2025

హీరో, దర్శకుడు, నిర్మాత..వీరిలో ఎవరిదో ఒకరిది పెద్ద పేరైనప్పుడు, కనీసం పెద్ద బ్యానర్ మీద రిలీజ్ అయినప్పుడు చిన్న సినిమా కూడా పెద్దగా అనిపిస్తుంది. ఏదో ప్రత్యేకత ఉంటుందనే అంచనాలు మొదలువుతాయి. “కోర్ట్” పేరుతో వచ్చిన ఈ సినిమాకి ఆకర్షణ నిర్మాత పేరు. హీరో నాని నిర్మాతగా తీసిన చిత్రం ఇది. సో, అంచనాలు ఎంతవరకు అందుకుందో చూద్దాం.

చందు, జాబిలి అనే టీనేజ్ జంట ప్రేమలో పడుతుంది. చందు ఒక వాచ్ మ్యాన్ కొడుకు. జాబిలి ఒక ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి.

జాబిలి మామయ్య మంగపతి (శివాజి) పురుషాహంకారం నరనరానా నింపుకున్న వ్యక్తి. ఆడపిల్ల అంటే ఇలానే ఉండాలి అని శాసించే సగటు మగాడు. ఇంటి గౌరవం మొత్తం ఆడపిల్ల పెంపకంలోనూ, ఆమె నడవడికలోనూ మాత్రమే ఉంటుందని నమ్మి..తాను నమ్మిన గౌరవం కోసం ఎంత పనైనా చేసే కర్కశుడు.

తన మేనకోడలు ఒక కింది స్థాయి వాడితో తిరుగుతోందని అతనిపై దొంగ కేసులు బనాయించి పోక్సో చట్టంలో ఇరికించి పర్మనెంట్ గా కటకటాల పాలు చెయ్యాలనుకుంటాడు.

తేజ (ప్రియదర్శి) అనే జూనియర్ లాయర్ చందూ కేసుని తన మొదటి కేసుగా తీసుకుని అతని తరపున ఎలా నిలబడతాడు..చివరకు ఏమయింది అనేదే ఈ కథ.

సాధారణంగా ఇలాంటి కోర్ట్ రూం డ్రామాలు తమిళ, మళయాళ ఓటీటీల్లో చాలానే వస్తుంటాయి. తెలుగు తెరమీద కూడా నాంది, వకీల్ సాబ్ వంటివి వచ్చాయి. ఆ స్థాయి చిత్రాన్ని చూడాలనుకునేవారి కోరిక తీర్చే ప్రయత్నమే ఈ చిత్రం.

తమిళంలో విచారణ, జై భీం; మలయాళంలో నేరు చిత్రాలు కోర్ట్ రూం డ్రామాల్లో మంచి మార్కులేయించుకున్నాయి. వాటిల్లో కేసు తీవ్రత బలీయంగా ఉండి, ఇరుపక్షాల వాదనలు ఎంతో బలంగా ఉండి..సహజత్వానికి చాలా దగ్గరగా ఉండి రక్తికట్టించిన కథనం ఉంటుంది. అదే ప్రయత్నం ఇక్కడ దర్శక రచయిత కూడా చేయడం జరిగింది. చాలా వరకు పకడ్బందీగానే నడిపినా ద్వితీయార్ధంలో కాస్త పట్టు తప్పి కమర్షియల్ టచ్ తో నడిచే పర్ఫార్మెన్సులతో కొంచెం గ్రాఫ్ పడినట్టయ్యింది. ఆ చిన్న తేడా కూడా లేకుండా ఉండుంటే దీని స్థాయి మరింత పెరిగి ఉండేది. ఈ చిత్రంలో ఏదైనా నెగటివ్ చెప్పుకోవాలంటే అదొక్కటే తప్ప ఇంకేవీ కనపడవు.

నిజానికి ఇలాంటి చిత్రాలు నేటి తరానికి చాలా ఉపయోగం. లీగల్ నాలెడ్జ్ సమాజానికి ఎంతో అవసరం. ఈ సినిమా చూస్తే మైనర్ బాలికలతో ఎలా మసలుకోవాలి, న్యాయపరంగా వాళ్లకున్న రక్షణ వలయం ఎలా ఉంది అనే అంశాలతో పాటు అసలు న్యాయం ఏమిటి, ధర్మం ఏమిటి, రాజ్యాంగం ఏమిటి, మనస్సాక్షి ఏమిటి..అనేవి విడివిడిగా అర్ధమవుతాయి.

లీగల్ నాలెడ్జ్ తో కూడిన మంచి చెడులు స్కూళ్లల్లో చెప్పట్లేదు. కనీసం ఇలాంటి సినిమాలైనా చెప్తున్నందుకు సంతోషించాలి, స్వాగతించాలి.

సినిమా ప్రధమార్ధంలో టీనేజ్ ప్రేమాయణం చాలా సహజంగా చిత్రీకరించాడు దర్శకుడు. తెలియనితనంతో కూడిన సరదాలు, ప్రమాదాలను ఊహించలేని స్నేహాలు, చదువు లేకపోయినా సంస్కారమున్న హీరో, కొంటెతనంతో పరిచమయ్యి సున్నితమైన మనసుతో ప్రేయసిగా మారే హీరోయిన్…వీటితో ఆ జంటపై సాఫ్ట్ ఫీలింగ్ కలిగేలా చేసాడు దర్శకుడు.

మంగపతి పాత్ర సమాజంలో ఉన్న ఒక వర్గం మగజాతికి ప్రతీక. ఇలాంటి వాళ్లే పరువుహత్యలు చేస్తున్న వారిగా వార్తల్లోకి ఎక్కుతున్నారు.

అలాగే డబ్బుకి అమ్ముడుపోయే చట్టం, న్యాయం; భయానికి లొంగిపోయే పేదరికం కూడా సమాజంలో ఉన్నవే. వాటన్నిటినీ ఒక కథతో పెనవేసి తెర మీద చూపిస్తుంటే ఏం చదివినా చదవకపోయినా ప్రతి ఒక్కరూ కొంతవరకైనా న్యాయశాస్త్రం చదవాలి అనిపించేలా చేస్తుంది ఈ సినిమా.

టెక్నికల్ గా కెమెరా, ఎడిటింగ్ అన్నీ సమపాళ్ళల్లో పనిచేసాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూడ్ ని ఎలివేట్ చేసింది. పాటల్లో “వేల వేల వెన్నెలంత..” సాహిత్యం మెప్పిస్తుంది. కాస్త ఆర్కెస్ట్రా సౌండ్ తగ్గించి ఉంటే లిరిక్స్ మరింత బాగా వినపడి ఉండేవి. “కళ్లు రెండు పుస్తకాలు..భాషలేని అక్షరాలు..” వంటి మంచి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి ఈ ప్రేమగీతంలో.

కొత్త జంట ఇద్దరూ బాగా నటించారు. జాబిలి ఫ్రెండ్స్ గా నటించిన అమ్మాయిలు కూడా పరిణతి ఉన్న నటీమణుల్లాగానే ఈజ్ తో నటించారు. ప్రతి చిన్న పాత్ర కూడా తెర మీద పర్ఫక్ట్ గా ఉంది.

సాయికుమార్ పాత్ర హుందాగా ఉంది. ఆ పాత్ర ద్వారా ఒక న్యాయవాది కావాల్సిన వాడికి ఉండాల్సిన లక్షణాలు, లా ని అర్ధం చేసుకునే విధానం చెప్పించడం బాగుంది. “బ్లాక్ కోట్ ఈజ్ ఆల్ అబౌట్ క్వశ్చనింగ్” అనే డైలాగ్ కి హాల్లో విజిల్స్ పడ్డాయి.

హర్షవర్ధన్ ప్రారంభంలో సటిల్ గానే చేసినా, ద్వితీయార్ధంలో కమర్షియల్ తరహా నటనని ప్రదర్శించాడు. “జై భీం” లో ప్రత్యర్ధి లాయర్ గా కనిపించిన రావురమేష్ పాత్ర కూడా ఈక్వల్లీ సీరియస్ గా ఉంటుంది. ఇక్కడ హర్షవర్ధన్ పాత్ర అలా లేదు.

మంగపతి పాత్రలో శివాజి జీవించాడు. కొన్ని చోట్ల అవసరానికి మించి నటించినా, ఓవరాల్ గా ఇంపాక్ట్ ఉన్న పాత్ర.

రోహిణి, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, రాజశేఖర్ అనింగి తమ తమ పాత్రల్లో ఒప్పించారు. కథకి ప్రధాన పాత్ర అయిన ప్రియదర్శి అందరికంటే బాగా మెప్పించాడు.

ఓటీటీల్లో వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకోవాల్సిన అవసరం లేకుండా హాల్లో చూసినా పైసావసూల్ అనిపించుకునే చిత్రమిది. ఈ జానర్లో ప్రసిద్ధిపొందిన ఇతర చిత్రాలతో పోలిస్తే ఆ స్థాయిని అందుకోలేదన్న పాయింట్ తప్ప ఇందులో వంక పెట్టడానికేం లేదు. పోస్కో చట్టం గురించి తెలుసుకోవడానికి, సున్నితమైన ప్రేమకథతో పాటూ ఆసక్తికరమైన లీగల్ పాఠం వినడానికి ఈ చిత్రం అందుబాటులో ఉంది. దీనికి టార్గెట్ ఆడియన్స్ ప్రధానంగా యువత. వారి ఆదరణ ఉంటే ఇలాంటివి మరిన్ని వస్తాయి. ఎప్పుడూ ఊకదంపుడు కమర్షియల్ కథనాలు కాకుండా కాస్త విషయమున్న ఇలాంటి చిత్రాలు కూడా తెలుగుతెర మీద రావాల్సిన అవసరముంది.

బాటం లైన్: కేస్ గెలిచినట్టే

12 Replies to “మూవీ రివ్యూ: కోర్ట్”

  1. పైసా వసూల్ మూవీ అని చెప్పుకునే చెప్పినావు కానీ నువ్వు రేటింగ్ ఎంత ఇచ్చినవ్ మంచి సినిమా అయినప్పుడు రేటింగ్ కూడా మంచి చేయాలి కదా మీ నాని గారు నీకు పైసలు వేయలేదేమో అందుకే రేటింగ్ తక్కువ చెప్తున్నావ్

  2. Review ఇస్తున్నట్లుగా లేదు cinema కి paper లో add చూసినట్లుగా అనిపిస్తుంది. cinema ని ott లో చూడాలా? Theatre లో చూడాలా? అనేది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు.. great andra reviews కూడా గాడి తప్పుతున్నాయ్ starting లోనే ఇది అర్ధం చేసుకొని ఆ review writer ని change చేస్తే better.

  3. అది పోస్కో కాదు పోక్సో యాక్ట్… ఇంగ్లీష్ రివ్యూ లో కూడా posco అని రాసారు.. Protection of children from sexual offences(POCSO)

  4. పోస్కో ఏందీ భాయ్. Pokso కదా. జగనన్న పేరు చెబితే పోస్కోడమా ఇది

Comments are closed.