తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా మొత్తం సీట్లు గెలుచుకుంది. ఆ పార్టీకి విశాఖ జనాలు నీరాజనాలే పలికారు. అయితే టీడీపీ పోటీ చేయని సీట్లలో ఇంచార్జిల పోస్టుల కోసం పోటీ సాగుతోంది. అధికారంలో ఉన్న పార్టీ నియోజకవర్గం ఇంచార్జి అయితే ఎమ్మెల్యే స్థాయిలో అధికార హవా చలాయించవచ్చు అని తమ్ముళ్ళు భావిస్తున్నారు. దాంతో చాలా పెద్ద కాంపిటీషన్ కనిపిస్తోంది.
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 2019లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గెలిచారు. ఈసారి పొత్తులో ఆ సీటు బీజేపీకి వెళ్ళింది. అయితే ఈ నియోజకవర్గంలో ఇంచార్జిల నియామకం టీడీపీ చేయాల్సి ఉంది. దాంతో ఈ పోస్టు కోసం పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గం పొత్తులో జనసేనకు కేటాయించారు. ఇక్కడ టీడీపీ ఇంచార్జి పోస్టు కూడా ఊరిస్తోంది. దాని కోసం పార్టీలో చాలా మంది నేతలే ముందుకు వస్తున్నారు.
పెందుర్తి నుంచి జనసేన గెలిచింది. ఇక్కడ కూడా టీడీపీ ఇంచార్జిని నియమించాల్సి ఉంది. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సొంత నియోజకవర్గం కావడంతో తన కుమారుడికి ఇప్పించుకోవాలని చూస్తున్నారు. విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ కూడా ఈ పోస్టు ఆశిస్తున్నారు.
ఇలా కీలకమైన అసెంబ్లీ సెగ్మెంట్లలో తమ్ముళ్ళు ఇంచార్జి పోస్టు కోసం పోటీలోకి వస్తున్నారు. ఇంచార్జి ఈక్వల్ టూ ఎమ్మెల్యే అని బలంగా నమ్ముతున్న వారంతా తమకు ఆ పదవి దక్కితే అదే పదివేలు అన్నట్లుగా అధినాయకత్వం కరుణ కోసం చూస్తున్నారు.
టీడీపీ హై కమాండ్ కూడా అనేక విధాలుగా ఆలోచించి అంగ బలం అర్ధ బలం సామాజిక బలం ఉన్న వారికే ఇంచార్జి పదవులు ఇస్తుందని అంటున్నారు. పొత్తులు సంగతి ఎలా ఉన్నా ఆయా నియోజకవర్గాలలో స్ట్రాంగ్ గా పార్టీ నిలబడాలన్న ఆలోచనతోనే ఆచీ తూచీ ఎంపిక చేస్తుందని అంటున్నారు.