అమర్ నాధ్ యాత్రికులకు చేదు వార్త. ఈ ఏడాది అమరనాధుడి దర్శనభాగ్య కలగకపోవచ్చు. దీనికి రెండు కారణాలు. ఒకటి శివలింగం కరిగిపోయింది. రెండోది ఆ ప్రాంతాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి.
హిమాలయ పర్వతసానువుల్లో కొలువుదీరిన అమరనాధుడ్ని దర్శించుకునేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు బారులుతీరుతారు. దీని కోసం 2-3 నెలల ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికేట్లు, రిజర్వేషన్లు.. ఇలా అన్నీ సమకూర్చుకుంటారు.
అలా పూర్తిస్థాయిలో సన్నద్ధమైనప్పటికీ దర్శనభాగ్య కలుగుతుందనే గ్యారెంటీ లేదు. ఈ ఏడాది కూడా కొంతమంది భక్తులకు నిరాశ తప్పలేదు. అమర్ నాధ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేకులేశారు.
జమ్ముకశ్మీర్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అమరనాధ్ రూట్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా యాత్రను నిలిపివేస్తున్నట్టు ఈరోజు అధికారులు ప్రకటించారు. జమ్ముకశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని ఎత్తైన గుహలో సహజసిద్ధంగా ఏర్పడిన మంచు విగ్రహాన్ని దర్శించే భాగ్య ఈసారి చాలామందికి దక్కలేదు.
తిరిగి యాత్రను ఎప్పుడు పునఃప్రారంభిస్తారనే అంశంపై అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ ప్రారంభించినా దర్శన భాగ్య దక్కకపోవచ్చు. ఎందుకంటే, ఈ ఏడాది మంచు లింగం పూర్తిస్థాయిలో తయారవ్వలేదు. తొలి రోజు దర్శించుకున్న భక్తులకే చిన్న పరిమాణంలో దర్శనమిచ్చాడు అమరనాధుడు. సో.. యాత్రను తిరిగి తెరిచినా మంచు లింగం అలానే ఉంటుందనే గ్యారెంటీ లేదు.
జూన్ 29న యాత్ర ప్రారంభం కాగా.. తొలి వారం రోజుల్లోనే లక్షన్నర మంది భక్తులు అమరేశ్వరుడ్ని దర్శించుకున్నారు. ఇకపై భక్తులకు అవకాశం లేకుండా పోయింది. బాల్తాల్, పెహల్గామ్ మార్గాలు రెండింటినీ మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.