టీడీపీ కూటమి నేతలు నెల రోజుల తరువాతనైనా నిజాలు ఒప్పుకుంటున్నారు. టీడీపీ కూటమి భారీ విజయం వెనక తమ సొంత శక్తితో పాటు జగన్ చేసిన భారీ తప్పిదాలే కారణం అని విశ్లేషిస్తున్నారు. బీజేపీకి చెందిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ దీని మీద మాట్లాడుతూ జగన్ వేయి తప్పులే చేశారు అని విమర్శించారు. జగన్ చేసిన తప్పులే కూటమిని వరాలుగా మారాయని అన్నారు. ఏపీలో ఒక ఇరవై దాకా నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్ధులకు భారీ మెజారిటీలు వచ్చాయంటే అది జగన్ పుణ్యమే అని అన్నారు.
ఎవరూ ఊహించని మెజారిటీలు వచ్చాయని ఇంత మెజారిటీలు మళ్లీ భవిష్యత్తులో సైతం ఏ పార్టీ నుంచి ఊహించలేక పోవచ్చు అని ఆయన అన్నారు. ఒక్కో అభ్యర్థికి తొంబై వేల పైబడి భారీ మెజారిటీలు వచ్చాయంటే జగన్ చేసిన తప్పులే అన్న విశ్లేషణను ఈ ఎంపీ వినిపించారు.
టీడీపీ- బీజేపీ- జనసేన కూటమి కలిస్తే విజయం తధ్యమని అనుకున్నారు. టైట్ ఫైట్ అయినా ఎడ్జి కూటమికే ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే అది కచ్చితంగా జగన్ కూటమికి తానుగా ఇచ్చుకున్న బహుమతి అని చాలా మంది అంటూ వచ్చారు. ఇపుడు సీఎం రమేష్ లాంటి వారు అదే అంటున్నారు.
జగన్ చేసిన అనేక పొరపాట్లు కూటమి గెలుపునకు సోఫానాలుగా మారాయని అంటున్నారు. జగన్ చేసిన ఆ వేయి తప్పులు పాలనాపరమైనవా రాజకీయ పరమైనవా లేక కుటుంబ పరమైనవా అన్నది ఆయన చెప్పలేదు. అయితే తప్పులు వైసీపీ చేసింది అని ఆ పార్టీ నేతలకు తెలుసు. వారిప్పుడైనా దీని మీద విశ్లేషణ చేసుకుంటేనే రేపటి వెలుగు అన్నది అంతా చెబుతున్న మాట.