సాధారణ మధ్యతరగతి కుటుంబాలు సైతం పెళ్లిళ్ల విషయంలో ఆర్భాటాలకు పోతుంటారు. అలాంటిది కుబేరుడి ఇంట పెళ్లి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ముకేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఈ పెళ్లి కోసం ముకేష్ అంబానీ కళ్లుచెదిరే మొత్తం ఖర్చు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, తన గత రికార్డుల్ని తానే బ్రేక్ చేస్తున్నారు.
2018లో కూతురు పెళ్లి చేశారు ముకేష్ అంబానీ. అప్పట్లో ఆ పెళ్లి హాట్ టాపిక్. ఒక్కో శుభలేఖకు 3 లక్షలు ఖర్చు చేశారు. దేశ విదేశాల నుంచి ప్రముఖుల్ని రప్పించారు. ఈ భూమ్మీద అత్యంత ఖరీదైన సింగర్స్ లో ఒకరైన బియాన్స్, అంబానీ కూతురు పెళ్లిలో పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అప్పట్లోనే ఆమెకు దాదాపు 50 కోట్లు ఇచ్చారు. ఓవరాల్ గా కూతురు పెళ్లికి ముకేష్ అంబానీ అప్పట్లోనే 830 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇండియాలో ఓ పెళ్లి కోసం ఇంత మొత్తం ఖర్చు చేయడం అదే తొలిసారి. అదే బిగ్గెస్ట్ ఎమౌంట్.
ఆ తర్వాత 2019లో కొడుకు ఆకాష్ అంబానీ పెళ్లి చేశారు. ఈసారి తన రికార్డ్ ను తానే బ్రేక్ చేశారు. కొడుకు ప్రీ-వెడ్డింగ్ సంబరాల్ని స్విట్జర్లాండ్ లో ఏర్పాటు చేసిన అంబానీ, కేవలం ఆ 3 రోజుల ఫంక్షన్ కే 800 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు చెబుతారు. ఆ తర్వాత ముంబయిలో మరో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. గూగుల్ సీఈవో, బ్రిటన్ ప్రధాని లాంటి ప్రముఖులు హాజరయ్యారు ఆ పెళ్లికి. అలా 2019లో కొడుకు పెళ్లి కోసం దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అంబానీ.
ఇప్పుడు మరో కొడుక్కి పెళ్లి చేస్తున్నారు. సరిగ్గా వారంలో అనంత్ అంబానీ పెళ్లి. ఈ పెళ్లి కోసం ముకేష్ అంబానీ పెడుతున్న ఖర్చు చూస్తే కళ్లు తిరగాల్సిందే. ఇప్పటివరకు జరిగిన ప్రీ-వెడ్డింగ్ వేడుకలకే అక్షరాలా 1260 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. పెళ్లి తంతు ముగిసేనాటికి ఖర్చు 1500 కోట్ల రూపాయలకు చేరుతుందని ఓ అంచనా. ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా నిలిచిపోనుంది అనంత్ అంబానీ వివాహం.