అమరావతి రైతుల గోడు చంద్రబాబుకు పట్టదా?

చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని మీద శ్వేతపత్రం ప్రకటించారు. ఈ శ్వేతపత్రం ప్రకటించిన తరువాత కూడా, అది ఎప్పటికి పూర్తవుతుందనే విషయంలో ప్రజలకు వచ్చిన క్లారిటీ ఏమీ లేదు. జగన్ మీద నిందలకే తప్ప…

చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని మీద శ్వేతపత్రం ప్రకటించారు. ఈ శ్వేతపత్రం ప్రకటించిన తరువాత కూడా, అది ఎప్పటికి పూర్తవుతుందనే విషయంలో ప్రజలకు వచ్చిన క్లారిటీ ఏమీ లేదు. జగన్ మీద నిందలకే తప్ప మరో విషయానికి ఆయన ప్రాధాన్యం ఇవ్వలేదు. కేవలం డెడ్ లైన్ విషయంలో క్లారిటీ మాత్రమే కాదు.. చంద్రబాబుకు, తెలుగుదేశానికి చాలా మద్దతు ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు కూడా ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. వరం ప్రకటించలేదు.

రాజధాని ప్రాంతం కోసం భూములు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లింపు గడువు పొడిగిస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పలేదు. దీనిపై ఆలోచించి వారికి న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటాం అని మాత్రమే చంద్రబాబు అన్నారు. ఇలాంటి డొంకతిరుగుడు సమాధానం బహుశా అమరావతి రైతులు చంద్రబాబునుంచి ఆశించి ఉండరు.

చంద్రబాబు నాయుడుకు అమరావతి రైతులు ఎంత మద్దతు ఇచ్చారో.. జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాల్జేయడంలో వారు ఎంతగా కష్టపడ్డారో అందరికీ తెలుసు. పైగా.. పదేళ్లు ఇస్తామని చెప్పిన కౌలు చెల్లింపు విషయంలో.. జగన్ ప్రభుత్వం అయిదేళ్ల పాటు అసలు నగర అభివృద్ధి పట్టించుకోకుండా వదిలేస్తే.. ఆ తప్పు రైతులది కాదు. జగన్ పట్టించుకోకపోవడం వల్ల.. నిర్మాణాల్లో ఇన్ని వందల కోట్ల భారం పెరుగుతున్నదని చంద్రబాబు ఏ రకంగా అయితే.. శ్వేతపత్రం రూపంలో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారో.. అదే మాటలు రైతులకు కౌలు విషయంలో కూడా చెప్పాలి.

కావలిస్తే.. జగన్ వలన రైతులకు కౌలు చెల్లింపు అదనంగా కొన్నాళ్లు ఇవ్వాల్సి వస్తున్నదని, అందువల్ల ఇంత భారం పడుతోందని మళ్లీ జగన్ మీద నింద వేయవచ్చు. కానీ.. కాంట్రాక్టర్లకు దోచిపెట్టే విషయంలో పెరుగుతున్న భారం నివేదించిన చంద్రబాబు, రైతులకు చెల్లింపు విషయంలో అలాంటి లెక్క ఎందుకు చెప్పలేకపోయారు? తనకు అండగా నిలిచిన రైతుల న్యాయమైన డిమాండ్ ను కూడా పట్టించుకునే ఉద్దేశం ఆయనకు లేదా?

అమరావతి రైతులపై జగన్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్ని తొలగించేందుకు చర్యలు చేపడతాం- అని చంద్రబాబు అంటున్నారు. అసలు ఇప్పటి దాకా ఆ పని చేయకుండా ఉండడమే పెద్ద నేరం. కేసులు ఎత్తేయడమే వారికి చేస్తున్న అతి పెద్ద మేలులాగా బిల్డప్ ఇవ్వడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారా? అనే అనుమానం పలువురికి కలుగుతోంది.