వీరాభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయి, ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నాడు కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్. ఈ కేసులో కేంద్రబిందువు దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ. కేసు వెలుగులోకి వచ్చిన కొత్తలో పవిత్రను, దర్శన్ భార్యగా పేర్కొన్నారు చాలామంది. స్వయంగా కొంతమంది పోలీసులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
ఎట్టకేలకు ఈ అంశంపై దర్శన్ భార్య విజయలక్ష్మి స్పందించారు. ఆమె బెంగళూరు పోలీస్ కమిషనర్ కు లేఖ రాశారు. ఈ కేసుకు సంబంధించిన రికార్డుల్లో దర్శన్ భార్యగా సవరణలు చేయాలని, పవిత్రను దర్శన్ భార్యగా పేర్కొనవద్దని ఆమె కోరారు.
మీడియా సమావేశంలో పవిత్రను దర్శన్ భార్యగా పేర్కొన్నారని, ఆ తర్వాత కర్నాటక హోం శాఖతో పాటు జాతీయ మీడియా కూడా దాన్నే రిపీట్ చేసిందని.. దీని వల్ల తనకు, తన కొడుకు మనుగడకు ఇబ్బందిగా ఉందని ఆమె పేర్కొన్నారు.
పవిత్రకు గతంలోనే సంజయ్ సింగ్ అనే వ్యక్తితో వివాహం అయిందని, వాళ్లకు ఓ కుమార్తె కూడా ఉందని.. ఈ విషయాన్ని పోలీసు రికార్డుల్లో కచ్చితంగా నమోదు చేయాలని ఆమె కోరారు. 2003, మే 19న ధర్మస్థలలో హిందూ సంప్రదాయం ప్రకారం, ఆ తర్వాత చట్టబద్దంగాను తమ పెళ్లి జరిగిందని, పవిత్రను దర్శన్ కు కేవలం ఫ్రెండ్ గా మాత్రమే సంభోదించాలని, ఆ మేరకు రికార్డులు సవరించాలని ఆమె కోరారు.
రిమాండ్ పొడిగింపు…
మరోవైపు ఈ కేసుకు సంబంధించి దర్శన్ తో పాటు 17 మంది నిందితులకు విధించిన రిమాండ్ ఈరోజుతో ముగిసింది. దీంతో మరోసారి అంతా కోర్టు ముందు వర్చువల్ గా హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసును విచారించిన కోర్టు.. జ్యూడిషియల్ రిమాండ్ ను 18వ తేదీ వరకు పొడిగించింది.
ఈ సందర్భంగా కేసు పురోగతిని కోర్టు ముందుంచారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటివరకు రూ.83.65 లక్షలు జప్తు చేశారు. సాంకేతిక ఆధారాల్లో నిందితులందరికీ ప్రమేయం ఉన్నట్లు తేలింది. 8వ, 15వ, 17వ నిందితులతో సీన్-రీ కనస్ట్రక్షన్ పెండింగ్ లో ఉంది. మరోవైపువీళ్లు వాడిన వాహనాలను ఆర్టీవో తనిఖీ చేయాల్సి ఉంది.
ఇంకోవైపు నిందితుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీళ్లలో కొంతమంది వేరే పేర్లతో సిమ్ కార్డులు తీసుకున్నట్టు తేలింది. సిమ్ యజమానుల స్టేట్ మెంట్స్ రికార్డ్ చేయాల్సి ఉంది. అటు హైదరాబాద్ నుంచి ఫోరెన్సిక్ నివేదికలు కొన్ని రావాల్సి ఉంది.
ఇలా కేసు పురోగతిని కోర్టు ముందుంచారు. ఇవన్నీ లెక్కలోకి తీసుకున్న కోర్టు, దర్శన్-పవిత్రతో పాటు మిగతా నిందితులందరికీ రిమాండ్ గడువును పెంచింది.