తెలంగాణలో తమ ప్రత్యర్థి భారత రాష్ట్ర సమితిని ఖాళీ చేసేసే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ప్రతి దెబ్బ గుట్టు చప్పుడు కాకుండా కొడుతున్నారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కాంగ్రెసులో చేర్చుకోవడంలో చాలా గోప్యత పాటిస్తున్నారు. రెండో కంటికి తెలియకుండా ఒక్కొక్క ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకుంటున్నారు. కండువా కప్పి ఫోటో విడుదల చేసే వరకు, ఎవరు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెసులో చేరుతున్నారా.. ఎవ్వరికీ ఆచూకీ తెలియెకుండా జాగ్రత్త పడుతున్నారు.
బిఆర్ఎస్ ను దెబ్బ కొడుతున్నారు. అలాంటిది.. పిడుగులాంటి అతిపెద్ద దెబ్బ కూడా గుట్టుచప్పుడు కాకుండా.. అత్యంత రహస్యంగా పూర్తిచేయడం తాజా పరిణామం. భారాసకు చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన ఇంటికి వెళ్లి మరీ కాంగ్రెసులో చేరిపోయారు. ఇంత రహస్యంగా జరగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.
భారాస పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, దండె విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ తాజాగా కాంగ్రెసులో చేరారు. ఈ చేరికలు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగాయి.
గురువారం సాయంత్రం హైదరాబాదులోని ఒక హోటల్ లో ఎమ్మెల్సీలు సమావేశం అయ్యారు. దాదాపు అర్ధరాత్రి అయ్యేదాకా వారంతా అక్కడే వేచి ఉన్నారు. ఈలోగా ఢిల్లీ పర్యటన ముగించుకున్న రేవంత్ రెడ్డి హైదరాబాదులోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయన నివాసానికి వచ్చిన వెంటనే.. ఈ ఆరుగురు ఎమ్మెల్సీలు హోటల్ నుంచి సీఎం ఇంటికి వెళ్లారు. అక్కడ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డి, సురేందర్రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ ఎమ్మెల్సీల చేరిక, కండువాలు కప్పుకోవడం అనే లాంఛనం సింపుల్ గా అర్ధరాత్రి వేళలోనే పూర్తయిపోయింది.
సాధారణంగా ఎక్కడైనా పిడుగుపడితే.. దానికి సంకేతంగా ముందు మెరుపు మెరుస్తుంది.. ఆ తర్వాత పిడుగుపడిన చప్పుడు వినిపిస్తుంది. కానీ.. రేవంత్ రెడ్డి భారాసాను ఒక్కొక్క పిడుగులాంటి దెబ్బ కొడుతుండగా.. మెరుపు సంకేతాలు కాదు కదా, కించిత్తు చప్పుడు కూడా వినిపించడం లేదని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
ఒకవైపు కాంగ్రెసు పార్టీ పని అయిపోయిందని, రాబోయే ఎన్నికల్లో ఘనంగా తమ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందని ప్రగల్భాలు పలుకుతూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ కేడర్ లో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా వారితో సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈలోగా పెద్ద పిడుగులాంటి దెబ్బకొట్టారు రేవంత్ రెడ్డి.
ఈ చేరికలతో శాసనమండలిలో బలాలు గణనీయంగా మారుతాయి. నలభై మంది సభ్యులున్న కౌన్సిల్ లో కాంగ్రెస్ ప్రస్తుతం బలం 4. కొత్త చేరికలతో 10 అవుతోంది. అదే సమయంలో భారాస బలం 29 నుంచి 23 కు తగ్గింది. తమకు స్పష్టమైన మెజారిటీ వచ్చేదాకా కాంగ్రెస్ లోకి వలసలు కంటిన్యూ అవుతాయని పలువురు అంచనా వేస్తున్నారు.