వైసీపీ దారుణమైన ఓటమిని చవి చూసింది. నెల రోజుల పాటు నేతలు అంతా ఇళ్ళకే పరిమితం అయ్యారు. ఈ మధ్యలో టీడీపీ కూటమి కార్యకర్తల దాడులు వంటివి జరిగినా కొందరు మాత్రమే స్పందించారు. విశాఖ జిల్లా విషయానికి వస్తే మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ లీడ్ తీసుకుంటున్నారు.
ఆయన రుషికొండ ప్యాలెస్ మీద అధికార కూటమి నేతలు రచ్చ చేస్తే ఖండించారు. ధీటైన బదులు ఇచ్చారు. కానీ రుషికొండ భీమిలీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. పైగా మూడేళ్ళ పాటు పర్యాటక శాఖ మంత్రిగా భీమిలీ మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన మంత్రిగా ఉండగానే రుషికొండలో పాత భవనాలను కూలగొట్టారు.
అయితే ఆయన నుంచి రియాక్షన్ రాకపోవడం పట్ల చర్చ చాలా సాగింది. ఈ మధ్యలో పార్టీ యాక్టివిటీలో కూడా అవంతి పెద్దగా పాల్గొనడం లేదని అంటున్నారు. వైసీపీలో గుడివాడకు అవంతికి మధ్య విభేదాలు ఉన్నాయని గతంలో పార్టీ పవర్ లో ఉండగానే చర్చ సాగింది.
పైగా అవంతిని తప్పించి గుడివాడకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఈ పరిణామాల నేపధ్యంలో విశాఖ జిల్లాకు సంబంధించి వైసీపీ అధినాయకత్వం గుడివాడనే ముందు పెట్టి నడిపిస్తోంది. అది మాజీ మంత్రి అవంతికి నచ్చడం లేదా అని కూడా చర్చ సాగుతోంది.
వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన పార్టీ సమావేశానికి విశాఖ జిల్లాకు చెందిన నాయకులు మాజీ ఎమ్మెల్యేలు అంతా వచ్చారు. కానీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు రాకపోవడం చర్చనీయాంశం అయింది. అవంతి ఎందుకు రాలేదూ అని అంతా తర్కించుకుంటున్నారు.
అవంతి గతంలో టీడీపీలో ఉన్నారు. ఆయన మళ్లీ టీడీపీలోకి వెళ్తారా అన్న ప్రచారం సాగుతోంది. అయితే ఇటీవలనే ఆయన పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టి అయిదేళ్ళూ ప్రతిపక్షంగా పోరాడుదామని పిలుపు ఇచ్చారు. దాంతో ఆయన వైసీపీలోనే ఉంటారని అంటున్నారు. అయితే గుడివాడకు పార్టీ ఆధిపత్యం ఇవ్వడం పట్ల ఆయన అసహనంగా ఉన్నారని అంటున్న వారూ ఉన్నారు.
విపక్షంలో వైసీపీ ఉంది కాబట్టి చొరవ తీసుకునే వారికే చాన్స్ అన్నది పార్టీ పెద్దల మాటగా ఉంది. పార్టీ తాజాగా సమావేశం పెడితే సగానికి సగం మంది నేతలు గైర్ హాజరు కావడం చూస్తే చాలా మంది నేతలు పక్క చూపులు చూస్తున్నారు అన్న టీడీపీ ప్రచారం నిజమవుతుందా అని వైసీపీలో తర్కించుకుంటున్నారు.