రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా చేసిన మీదట విశాఖ జిల్లా అతి చిన్న జిల్లాగా మారిపోయింది. భౌగోళిక స్వరూపంలో కూడా తేడా వచ్చింది. కేవలం అర్బన్ సెక్టార్ నూటికి తొంబై శాతం పైగా ఉంది.
దాంతో సమతూల్యతతో లోపం ఉందని అంతా ఆనాడే చర్చించారు. రూరల్ సెక్టార్ కూడా ఉంటే జిల్లాకు సమగ్రమైన రూపం వస్తుందని కూడా అంతా సూచించారు. ఇదిలా ఉంటే విశాఖ జిల్లాలో ప్రస్తుతం ఉన్నవి ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలే. భీమిలీ, విశాఖ సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్, గాజువాక మాత్రమే ఉన్నాయి.
అదే విశాఖ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధి తీసుకుంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. అందులో విజయనగరం జిల్లాకు చెందిన ఎస్ కోట ఉంది. ఎస్ కోట విశాఖకు ఆనుకుని ఉంది. దాంతో పాటుగా అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇపుడు పెద్ద ఎత్తున సాగుతోంది.
దాంతో ఎన్నికల ముందే రియల్టర్లు బిల్డర్లు దానిని విశాఖలో విలీనం చేయమని టీడీపీ కూటమి నేతలను కోరారు. దానికి వారు అంగీకరించారు. ఇపుడు ఆ ప్రతిపాదన వేగంగా ముందుకు కదులుతోంది. విశాఖ జిల్లాలో ఎస్ కోటను విలీనం చేస్తారు అన్న ప్రచారం సాగుతోంది.
అది కనుక జరిగితే రియల్ బూమ్ మరింతగా పుంజుకుంటుందని విశాఖ జిల్లాలో ఎస్ కోట చేరడం వల్ల బిజినెస్ పెరుగుతుందని వారు భావిస్తున్నారు. విశాఖలో రూరల్ సెక్టార్ కలవడం వల్ల సమగ్ర రూపం వస్తుందని కూడా అంటున్నారు.
విశాఖలో పెందుర్తి నియోజకవర్గాన్ని కూడా కలపాలని మరో ప్రతిపాదన కూడా వస్తోంది. పెందుర్తి విశాఖలో అంతర్భాగంగా ఉన్నా దాన్ని కొత్త జిలాల ఏర్పాటుతో అనకాపల్లి జిల్లాలో విలీనం చేశారు. అయితే పాలనాపరంగా అనకాపల్లి కంటే విశాఖ మాత్రమే దగ్గర అని అంటున్నారు. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఇక్కడ కూడా రియల్టర్ల డిమాండ్ విశాఖలో విలీనం చేయాలనే ఉంది.
కొత్త ప్రభుత్వం ఈ విషయాల్లో త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటుంది అని అంటున్నారు. విశాఖలో ఈ రెండు నియోజకవర్గాలు విలీనం అయితే అనకాపల్లి లో ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లే ఉంటాయి. అలాగే విజయనగరం జిల్లా కూడా అయిదు అసెంబ్లీ సెగ్మెంట్లకు తగ్గిపోతుంది. ఆయా జిల్లాల స్వరూప స్వభావాల సంగతి కూడా చూడాలని అంటున్నారు.