శ్రీవారి ఆర్జిత సేవలు ఎప్పుడు.. బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారయ్యాయా లేదా.. దర్శన టికెట్లు దొరుకుతున్నాయా లేదా.. ఎన్ని గదులు ఖాళీగా ఉన్నాయి.. హుండీ ఆదాయం ఎంత, భక్తులు ఎంతమంది స్వామివారిని దర్శించుకున్నారు.. తిరుమలకు సంబంధించిన అప్ డేట్స్ అంటే ఎవరికైనా ఇవే.
కానీ ప్రస్తుతం తిరుమల చుట్టూ గాసిప్స్ రాజ్యమేలుతున్నాయి. అప్ డేట్స్ కంటే పుకార్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. మొన్నటికిమొన్న తిరుమల లడ్డూ ధరపై, ప్రత్యేక ప్రవేశ దర్శనంపై జరిగిన అసత్య ప్రచారం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అలాంటిదే మరో ప్రచారం మొదలైంది.
శ్రీవారిని దర్శించుకున్నత తర్వాత భక్తులందరికీ ప్రసాదం ఇస్తారు. ఇలా ఇచ్చే ప్రసాదాన్ని పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పండించిన బియ్యంతోనే చేస్తారు. ఇకపై అలాంటి బియ్యం కాకుండా, సాధారణ బియ్యంతోనే ప్రసాదం చేయాలని టీటీడీ నిర్ణయించిందట.
ఈ ప్రచారాన్ని కొద్దిసేపటి కిందట టీటీడీ ఖండించింది. ఈమధ్య కాలంలో ఇలాంటి ఖండన ప్రకటనలు ఇవ్వడానికే తన సోషల్ మీడియా ఖాతాల్ని ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తర్వాతే ఈ ఊహాగానాలు ఎక్కువయ్యాయి.
అసత్య ప్రచారాలు ఇప్పుడు కామన్ అయిపోయాయి. సోషల్ మీడియా వాడకం ఎక్కువైన తర్వాత, ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు చాలామంది ఇలాంటి పుకార్లను సృష్టిస్తున్నారు. చాలా రంగాలకు విస్తరించిన ఈ జాడ్యం, ఇప్పుడు తిరుమలను కూడా వదలడం లేదు.