‘ఫ్రం ది స్క్రాచ్’ అంటూ కల్కి సినిమాను మొదలుపెట్టారు. నిర్మాణానికి దాదాపు మూడేళ్ల సమయం తీసుకున్నారు. మధ్యలో కల్కి రెండు భాగాలుగా వస్తుందంటూ ప్రకటించారు. మొత్తానికి సినిమా థియేటర్లలోకి వచ్చింది, భారీ వసూళ్లు సాధిస్తోంది. మరి పార్ట్-2 సంగతేంటి?
కల్కి సినిమాలో బాగా కనెక్ట్ అయిన ఎపిసోడ్, అందరికీ కామన్ గా నచ్చిన ఎలిమెంట్ క్లయిమాక్స్. ఆ ఒక్క ఎపిసోడ్ తో పార్ట్-2పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి పార్ట్-2 ఎప్పుడు? దీనిపై కీలక ప్రకటన చేశారు నిర్మాత అశ్వనీదత్.
సరిగ్గా ఏడాదికి, అంటే వచ్చే ఏడాది జూన్ నాటికి కల్కి పార్ట్-2 థియేటర్లలోకి వస్తుందంటున్నారు. ఏడాదిలోగా కల్కి-2 ఫస్ట్ కాపీ రెడీ అవుతుందా అనేది ఇప్పుడు అందరి సందేహం.
మొన్నటికిమొన్న పుష్ప విషయంలో ఇదే జరిగింది. ఏడాదిలోగా రిలీజ్ అన్నారు. పార్ట్-2 ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు. ఆ మాటకొస్తే, ఇంకా చిన్నచిన్న ప్యాచ్ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి.
సలార్-2 పరిస్థితి కూడా అలానే కనిపిస్తోంది. సెటప్ సిద్ధంగా ఉంది, ఏడాదిలోగా పార్ట్-2 రిలీజ్ అవుతుందని హోంబలే ప్రకటించింది. కానీ సినిమా రిలీజై ఇన్నాళ్లయినా ఇప్పటివరకు షూటింగ్ అప్ డేట్ కూడా ఇవ్వలేకపోతున్నారు.
ఓవైపు ఇలా చాలా సినిమాలు కళ్లముందు కనిపిస్తుంటే, కల్కి పార్ట్-2 మాత్రం వచ్చే ఏడాది ఈ టైమ్ కు వచ్చేస్తుందంటున్నారు నిర్మాత. ఈ ఏడాది చివర్లోనే పార్ట్-2 షూటింగ్ మొదలుపెడతారు. 20శాతం మినహా, దాదాపు 80శాతం షూట్ చేయాల్సిందే అనేది ఇన్ సైడ్ టాక్.
అసలే భారీ తారాగణం, భారీ సెటప్, సెట్స్, గ్రాఫిక్స్.. ఇవన్నీ ఏడాదిలోగా పూర్తవుతుందా అనేది సందేహం. దీనికితోడు కాల్షీట్ల సమస్య ఉండనే ఉంది. అయినప్పటికీ మేకర్స్ మాత్రం ఏడాది టైమ్ సరిపోతుందంటున్నారు.