పవన్‌కళ్యాణ్ సినిమాల్లో రెండు పాపులర్ డైలాగులుంటాయి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి.. నాకు తిక్కుంది, దానికో లెక్కుంది
జగన్ సినిమాలు చూడడు. అందుకే ఈ డైలాగ్‌లు తెలియవు. ఒకవేళ తెలిసినా అర్థంకావు. మొదటి డైలాగ్ చంద్రబాబుకి వర్తిస్తుంది. రెండోది పవన్‌కళ్యాణ్‌కి.
తగ్గాల్సి వచ్చినపుడు, తగ్గడం చంద్రబాబు కంటే బాగా తెలిసిన వాళ్లు లేరు. 1983లో మామ ఎన్టీఆర్‌కి సవాల్ చేసాడు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ మాత్రం సిగ్గు పడకుండా సైలెంట్‌గా చేరిపోయాడు. మామ ముందు తగ్గినా తప్పు లేదనుకున్నాడు. మెల్లిగా చక్రం తిప్పి, పార్టీలో అడ్డొచ్చిన వాళ్లందర్నీ ఏరిపారేసి 94 నాటికి పార్టీలో గట్టి నాయకుడయ్యాడు.
ఎన్టీఆర్ హఠాత్తుగా లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవడం బాబుకి గట్టి షాక్. కానీ మౌనంగా ఉన్నాడు. బాహాటంగా ఏమీ మాట్లాడలేదు. తగ్గినట్టే తగ్గి నెగ్గాడు. ముఖ్యమంత్రి అయ్యాడు. ఎన్టీఆర్ కుటుంబంలో పంటి కింది రాళ్లు దగ్గుబాటి, హరికృష్ణ. ఇద్దరితో సయోధ్య కుదుర్చుకున్నట్టే కుదుర్చుకుని పక్కన పెట్టాడు.
తర్వాత ఎన్నో పరిణామాల్లో ఎన్నోసార్లు తగ్గాడు. అధికారం ముఖ్యం. అహంకారానికి వెళ్లడు. పట్టువిడుపులతో వుంటాడు. ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పాను అంటూ వుంటాడు కానీ, అవసరమైతే కేంద్రం ముందు ఎంత ఒద్దికగా అయినా వుంటాడు. రాజకీయం అనే కాఫీ డికాక్షన్‌ని కాచి వడబోసాడు. కాఫీ తాగి గ్లాస్‌ని విసిరేస్తాడు. అవసరమైతే ఆ గ్లాస్‌ని గాలించి వెతికి పట్టుకుంటాడు.
మొన్నటి ఎన్నికల్లో కేంద్రం తనని ఎంత చిన్న చూపు చూసినా, అరెస్ట్ అయినప్పుడు మోదీ స్పందించకపోయినా, అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా వేధించినా మౌనంగా భరించాడు. నోరు మెదపలేదు. తగ్గడం అంటే ఇది. బీజేపీకి బలం లేదని తెలిసి కూడా పొత్తు కోసం వెంపర్లాడాడు. గెలిస్తే కూటమిలో వుంటుంది. ఓడితే జగన్ పెట్టే కేసుల నుంచి రక్షిస్తుంది. ప్లాన్ టెన్ టైమ్స్ వర్కౌట్ అయ్యింది. ఇక్కడ గెలవడమే కాదు, అక్కడ కూడా తన మీదే ఆధారపడుతున్నారు. డబుల్ ధమాకా.
అధికారం మీద ఎంత కాంక్ష అయినా వుండొచ్చు. కానీ ఒక మంత్రి భార్య కూడా అహంకారంతో మాట్లాడుతున్న ఈ రోజుల్లో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి, దేశంలో ఒక ప్రముఖుడిగా ఉన్న చంద్రబాబుకి తగ్గడం తెలుసు. అవసరమైతే అహంకారాన్ని జయిస్తాడు. నేను చంద్రబాబు అనే అహాన్ని జయించడం వల్ల చంద్రబాబు అనే నేను అని నాలుగు సార్లు సీఎంగా ప్రమాణం చేసాడు. తెలుగు వాళ్లలో ఈ రికార్డు బద్ధలు చేసేవాళ్లు పుట్టాలంటే ఇంకా చాలా టైమ్ పడుతుంది.
ఇక తిక్క, లెక్క డైలాగ్ పవన్‌కి వర్తిస్తుంది. నాకో తిక్కుంది అని పార్టీ పెట్టాడు. దానికో లెక్కుందని అర్థం చేసుకోడానికి జనానికి పదేళ్లకి పైగా పట్టింది. పార్టీ పెట్టి బాబుకి మద్దతు ఇస్తే నిజంగా తిక్కే అనుకున్నారు. ఐదేళ్ల తర్వాత అన్ని స్థానాల్లో పోటీ చేసి ఓడిపోతే తిక్క కుదిరింది అనుకున్నారు. అపుడపుడు సభలు పెట్టి, వారాహిలో తిరిగితే ఇదంతా డాంబికం అనుకున్నారు.
చంద్రబాబు అరెస్ట్ అయి దిక్కు తోచని స్థితిలో బలహీనంగా వున్నప్పుడు పవన్ లెక్కలు తేల్చుకున్నాడు. జైలు దగ్గరే పొత్తు ప్రకటించేశాడు. వేగంగా పావులు కదిపి కూటమి ఏర్పాటుకు కారకుడయ్యాడు. తిక్కతిక్కగా కనిపిస్తూనే లెక్క సరిచేసి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు.
జగన్‌కి ఈ గేమ్ అర్థం కాలేదు. అయ్యే సరికి చదరంగం బల్లమీద లేడు. అధికారం శాశ్వతం కాదు… అది అపుడప్పుడన్నా పలకరించాలన్నా అహం వదులుకోవాలి. గ్రామం దగ్గరి నుంచి నియోజకవర్గం వరకు ఉన్న రాజకీయ వ్యవస్థని మరిచి తానే ఒక వ్యవస్థ అనుకున్నాడు. అడుగడుగునా తన ఫొటో ఉండాలని అనుకున్నాడు కానీ, జనంలో వుండాలని అనుకోలేదు. బటన్ నొక్కితే ఓటు వేస్తారనే అతి ఆత్మ విశ్వాసానికి గురయ్యాడు. తగ్గడం తెలియకపోతే ప్రజలే తగ్గిస్తారు. కిరీటం లేని తలని జనం గుర్తు పట్టరు.
సినిమా అర్థం కాక, ఒక రాజకీయ నటుడు సినీ నటుడి చేతిలో ఉమ్మడిగా ఓడిపోయాడు. జగన్ అనే నేను అని మళ్లీ వినిపించాలంటే ఈసారి ప్రయాణం చాలా పెద్దది. ఈ జర్నీలో నేనుని వదులుకోవాలి.